దేశం గురించి మాట్లాడినట్లు ఊరు గురించి మాట్లాడుకోవాలి. బావులు చెరువులు చెలిమెల గురించి, చెట్టు పుట్టల గుట్టల గురించి చెప్పుకోవాలి, రాసుకోవాలి. దేశచరిత్ర గ్రామ చరిత్రతోనే మొదలవుతుంది.
దేవుని గురించి చాలా కావ్యాలు వచ్చాయి. కానీ దేవుళ్లకు తావిచ్చిన ఊరు గురించిన రచనలు చాలా తక్కువ. ఊరంటే పోశమ్మ, కోట మశమ్మ, హనుమాన్ల గుడే కాదు ఊరూరుకు సాంఘిక సామాజిక చరిత్ర సంస్కృతిక నేపథ్యాలు యాప, రావి చెట్టులా పెనవేసుకొని ఉంటాయి. బుద్ధుని ఆనవాళ్లను బుద్ధుని గుర్తుకు తెచ్చే ఒక చక్కటి పేరు గలిగిన ఊరు బుద్ధారం.
ఊరు కన్నతల్లి. ఊరు గురించి రాయడమంటే అమ్మ గురించి రాయడమే. జన్మనిచ్చిన నేల గురించి చెప్పుకోవడమే. అట్లా రాసివోసుకొని నిలబెట్టుకున్న పుస్తకమే బుద్ధారం చరిత్ర సంస్కృతి.
ఊరు ఒక దగ్గర ఆగిపోదు నదిలా సముద్రంలా విస్తరిస్తుంది. అలా విస్తరించిన గ్రామమే బుద్దారం. మనకు తెలియని చరిత్రలు, తెలిసిన కథలుంటాయి. చూసిన సంఘటనలు, ఆడిపాడిన నాటకాలుంటాయి. విశ్వవాణి యువజన సంఘం చేసిన చైతన్య కార్యక్రమాల ద్వారా పోరాడిన మనుషులుంటారు. వీరులు ధీరవనితలుంటారు. జానపద కళలు సాహిత్యాలు సమావేశాలు జరిగిన సందర్భాలుంటాయి.
కవులు రాసిన కావ్యాలు, శతకాలు, స్థలపురాణాలు, నిజాయితీలతో వెలిగిన నిప్పురవ్వలుంటాయి. ప్రతిఊరుకు కొంత జీవ భాషుంటది. సూటుబూటుదే గాదు బురదకాళ్లదీ చరిత్రే. ఆ లోయ, ఆ గండీ, ఆ కొండలు, చెలిమెల సవ్వడిని, శిల్పీకరణ పొందిన విగ్రహాలు మట్టిశ్వాస చరిత్రను అక్షరమక్షరం రచించిన పరిశోధకులు హెచ్. రమేష్ బాబు. బుద్దారం చరిత్ర సంస్కృతి పుస్తకానికి “బుద్ధారం ఒకప్పటి చారిత్రక నగరం” అని ప్రఖ్యాత స్థపతి, సీఈఓ ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ డా.శివనాగిరెడ్డి, “బౌద్ధమత స్ఫూర్తి బుద్ధారం’ చరిత్ర పరిశోధకులు డా.ద్యావనపల్లి సత్యనారాయణల ముందుమాటలు ఈ గ్రామ చరిత్రను మరింత ముందుకు తీసుకుపోయే కాగడాలు. వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలంలోని బుద్ధారం గ్రామం ఎంతో ప్రాముఖ్యత కలిగిన ప్రాచీన గ్రామం. బుద్దారం జనజీవన విధానాలు ఆలయాలు, గండి అంజనేయ ప్రశస్తి, బుద్దేశ్వరాలయ పునర్నిర్మాణం, నాటక, భక్తసమాజం కళలు, యువజన సంఘాలు, సామాజిక చైతన్యం, కవి సమ్మేళనాలు, పుస్తకావిష్కరణలు వయోవృద్దుల అనుభవాలు, సాంఘిక, ఆర్థిక జీవన విధానాలు, చారిత్రక అనవాళ్లు, రాతిబావులు, సరికెలు ఇరిసెలు, వృద్దుల అనుభవాలు, రచ్చకట్ట, అంబేద్కర్ ఫూలే విగ్రహలు సమస్తం ఈ గ్రంథంలో అక్షర బద్దమైనవి.
13వ శతాబ్దంలో వర్దమానపురం పాలకునిగా గోనబుద్ధారెడ్డి పేరు, మహబూబ్ నగర్ జిల్లాలోనే గాక తెలుగు నేలంతట చిరపరిచితమైన పేరు. సురవరం ప్రతాపరెడ్డి తన ఆంధ్రుల సాంఘిక చరిత్రలో బుద్దాపురం బుద్దారెడ్డి పేరున కట్టించినదే అని రాయగా, డాక్టర్ కపిలవాయి లింగమూర్తి తన పాలమూరు జిల్లా దేవాలయాలలో గోనగణిపిరెడ్డి తమ తండ్రి గారి పేరు స్థాపించిన గ్రామానికి బుధ్దవరమని చెరువుకు బుద్ధ సముద్రం అని రాశారు. చైతన్యవంతమైన గ్రామంలో ఆలోచనలు ముందుచూపుతో ఉంటాయి. చారిత్రక ప్రాశస్త్యం పచ్చని గడ్డిలా పరుచుకుంది. కొందరి పరిశోధకుల రచనలు బట్టి బుద్ధారం గ్రామం బౌద్ధమతం బహుళ ప్రచారంలో ఉన్న కాలంలోనే ఏర్పడినట్లుగా తెలుస్తుంది. 8 శతాబ్దాల క్రితం నిర్మించిన బుద్దేశ్వర ఆలయం ఎంతో చారిత్రక ప్రాశస్త్యాన్ని కలిగి ఉన్నది. నాటి కందూరు చోళుల కాలంలో వర్ధమానపురాన్ని ఏలిన గోన వంశీయులైన గోనబుద్ధారెడ్డి పరిపాలనలో బుద్ధారం దక్షిణ ద్వారంగా ఉండేది. పడమటి ద్వారంగా బూదపురం (నేటి భూత్పూర్) ఉండేది. తూర్పు ద్వారంగా వర్ధమాన పురం ఉండేది . క్రీ.శ. 13వ శతాబ్దిలో కాదాంబ నాగర శైలిలో నిర్మించిన గుడిని శేషాద్రి రమణ కవులు ఈ ఆలయాన్ని సందర్శించినట్టు తెలుస్తుంది . స్థానిక వీరుల కథలను తెలిపే వీరగల్లులు 1950లో పొస్టాఫీసు,1961లో ప్రాథమిక పాఠశాల,1970లో ఆ ఊరికి కరెంటు వచ్చినట్టు సీనియర్ సిటిజన్ కనిమెట్ట రాములు చెప్పినవిషయం బాగుంది. 1974లో చేతి పంపులు బోర్లు, 1981లో నల్లాలతో నీటి సరఫరా మొదలైన వైనం తెలుస్తుంది.
బుద్దారం ప్రధాన రోడ్డు పక్కనే గాంధీ విగ్రహాన్ని 1991లో డా. నారాయణ సర్పంచిగా ఉన్న సమయంలో ప్రతిష్టించినట్లు తెలుస్తుంది. పూలే, అంబేడ్కర్ విగ్రహాలు బుద్ధారం గ్రామానికి సూర్యచంద్రుల్లా దారి చూపుతారు. కల్లు, కుంట, కుదురు, కొండ, గిరి, నర్వపాడు, స్థల వాచకాలను బట్టి గ్రామం ఎంత ప్రాచీనమైందో తెలుసుకునే అవకాశం ఉంది. నీలయ్యకుంట శివారు, పాండవుల మోటు, కానిగ బడి, స్థానికంగా ఆ ఊరిలో పేర్లునన్నే సాబ్, మొయిలి సాబ్ ఆ కాలంలో చదువు చెప్పె పంతుళ్లు ఆ ఊరిల పేర్లు. గండి అంజనేయ స్వామి దేవాలయం ప్రసిద్ది గాంచింది. గ్రామ నడిబొడ్డున నూరేళ్ల నాటి విశాలమైన రచ్చకట్ట. పాత రచ్చకట్టను విస్తృత పరిచి 1959 అక్టోబర్ 11న భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూచే ప్రారంభించినట్లు తెలుస్తుంది. ఈ రచ్చకట్టను మేస్త్రి నందిమల్ల బుచ్చన్న తక్కువ సమయంలో 24 గంటల్లోనే రాత్రి పగలు నిర్మించాడు. అది ఊళ్లోని సమస్యలు ఊరు పెద్దలు కలిసి కట్టగా అభివృద్ధి విషయాలు చర్చించుకునే ఒక కూడలి. బస్సులో వనపర్తికి వెళ్తుంటే ఒక అపురూపంగా ఈ రచ్చకట్ట దారిన శ్రీకృష్ణదేవరాయల భువన విజయాల కనిపిస్తుంది.
కోనేరు నుండి కుళాయిల దాక, గ్రామ సర్పంచి నుండి జిల్లా పరిషత్ వరకు, గ్రంథాలయం నుండి మహిళా సంఘాలు, వాల్మీకి కుల సంఘం, నాయి బ్రాహ్మణ గీతా కార్మికుల, భక్తులు భజన, అంబేద్కర్ విజ్ఞాన సమితి వరకు వరకు, పంచాయతీ భవనం నుండి ఆంధ్ర మహాసభల వరకు, రవాణా సౌకర్యం నుండి నేటి ఆధునికమైన రోడ్ల వరకు, యక్షగానం,జానపద నాటకాలు భజన కోలాటం సాంస్కృతిక ప్రదర్శనల నుండి సాహిత్య సభలు కవిసమ్మేళనాలు, పుస్తక ఆవిష్కరణలు ఆధునిక సినిమాల వరకు, ఖానిగీ బడి నుండి బాలికల రెసిడెన్షియల్ కాలేజీ వరకు, తొలినాటి పంచ కమిటీనుంచి, మొదటి సర్పంచి బలిజ బుచ్చయ్య ఈనాటి గ్రామ సర్పంచ్ ఎంపీటీసీలు, గ్రామాభివృద్ధి సంఘం, అత్యున్నత కీర్తి శిఖరాలు, సోషలిస్టు నాయకులు మహదేవ్ సింగ్, గాజుల చంద్రయ్య వరకు చరిత్రంతా చరితకెక్కించారు. ఈ చారిత్రకమైన బుద్ధారం గ్రామాన్ని, జోవహార్ లాల్ నెహ్రూ, సురవరం ప్రతాపరెడ్డి, ముఖ్యమంత్రి హోదాలో నీలం సంజీవరెడ్డి, జయప్రకాష్ నారాయణ ఇందిరాగాంధీ, ఎన్టీ రామారావు జైపాల్ రెడ్డి గుడిగానిపల్లి గోపాల్ రెడ్డి తదితరులు సందర్శించారు. మాదిగ డప్పు, దళితుల కొమ్ము, పెద్ద బాడిశ, సామాజిక వర్గాల పనిముట్ల విధానాల ప్రస్థానాన్ని కూడా ఈ పుస్తకంలో పొందుపరచడం ముఖ్యమైనది.
బుద్దవరం గ్రామ హరిజనులకు ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని అరికట్టాలి అంటూ 1953లో జరిగిన పాత జంగమామపల్లి భూ పోరాటానికి సంబంధించి గాజుల చంద్రయ్య ప్రచురించిన కరపత్రం ఇందులో చోటు చేసుకోవడం. గ్రామ పోరాట చరిత్రకు అతి గొప్ప రికార్డు. బుద్ధారం గ్రామానికి చరిత్ర ఎంతనో ఆ ఊరిలో వెలసిన ఒక చైతన్య స్రవంతి విశ్వవాణి యువజన సంఘం (1979-8) సాధించిన విజయాలు అనేకం. ఇదే గ్రామంలో కె.అంజయ్య గాయకుడిగా రాష్ట్ర స్థాయిలో ప్రతిష్టలు పొందాడు.సిపిఐ ఎం ఎల్ న్యూడెమోక్రసీ ఎస్.ఎల్. పద్మ రాష్ట్ర స్థాయిలో నాయకురాలుగా రాణించారు. చిక్కొండ్ర రవి కవిగా వీరనాగు సామాజిక శతకం బుద్ధారం గ్రామం నుండే రాస్తూ ఎదుగుతున్నాడు. సాహిత్య రంగంలో కూడా బుద్ధారం గ్రామానికి విశిష్టమైన స్థానం ఉంది. ద్విపద సాంప్రదాయంలో రామాయణం రాసిన గోనబుద్ధారెడ్డి తొలి తెలుగు కుప్పాంబిక ఇక్కడికి చెందిన వారే. కవులు, కళాకారులు, రచయితలు, రాజకీయ నాయకులు, చరిత్రకారులు, సోషలిస్టు నాయకులు, కుల వృత్తులు పని విధానాలు ఒకటేమిటి సబ్బండ వర్గాల సమ్మేళనం కలిపి కుట్టుకున్న ఒక జాతీయ జెండా లాంటి ఊరు బుద్ధారం. ఊరు ఒక మహా కావ్యమన్న జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి. నారాయణ రెడ్డిగారన్నట్లు బుద్ధారం చరిత్రంతా ఒక మహా కావ్యమే..
బుద్ధారం చరిత్ర గ్రంథాన్ని కాకతీయుల కాలంనుండి గోనబుద్ధారెడ్డి కాలం వరకు, కందూరు చోళులు వనపర్తి సంస్థానం పాలనలో 1000సంవత్సరాల బుద్ధారం గ్రామంలోని ప్రతి రాయిని, స్థలాన్ని కదిలించిన ఉనికి అస్తిత్వాన్ని గ్రంథ రూపంలో అందించిన హెచ్.రమేష్ బాబు రచనా కృషి అపారమైనది, ప్రశంసనీయమైనది. స్థానిక చరిత్రల్లోఅత్యున్నతమైన గ్రామ చరిత్ర కాలగర్భంలో కలిసిపోకుండా విశ్వవాణి గ్రామాభివృద్ధి సంఘంముందుకొచ్చి 300 పేజీలకు పైగా ప్రచురించడం అభినందనీయం. సింతవోల పండ్ల రాశిలా ఈ పుస్తకం అందంగా ఇలా రూపుదిద్దుకోవడానికి ముందుకు వచ్చిన బుద్దారం విశ్వవాణి గ్రామాభివృద్ధి సంఘం వారు అభినందనీయులు.
వనపట్ల సుబ్బయ్య
9492765358



