సెంట్రల్ జోన్ 266 ఆలౌట్
దులీప్ ట్రోఫీ సెమీఫైనల్
నవతెలంగాణ-బెంగళూరు
రింకు సింగ్ (60, 88 బంతుల్లో 8 ఫోర్లు) అర్థ సెంచరీతో రాణించటంతో సెంట్రల్ జోన్ గౌరవ ప్రద స్కోరు సాధించింది. దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో టాస్ నెగ్గిన ఈస్ట్ జోన్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. బౌలర్లు సమిష్టిగా మెరిశారు. అభిజిత్ సర్కార్ (3/38), ముకేశ్ కుమార్ (3/56), మహ్మద్ షమి (2/42), ఖురేషి (2/49) వికెట్ల వేటలో రాణించారు. దీంతో 80.1 ఓవర్లలోనే సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 266 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ అయన్ జుయాల్ (46, 113 బంతుల్లో 6 ఫోర్లు), రింకు సింగ్ మినహా ఆ జట్టులో ఎవరూ పెద్దగా రాణించలేదు. యశ్ రాథోడ్ (27, 68 బంతుల్లో 4 ఫోర్లు), హర్ష్ దూబె (27, 38 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), ఆర్యన్ పాండే (22, 46 బంతుల్లో 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. టాప్ ఆర్డర్లో అయన్ జయాల్, మిడిల్ ఆర్డర్‌లో రింకు సింగ్ నిలబడటంతో సెంట్రల్ జోన్ ఆ మాత్రం పరుగులు చేసింది. ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు రావాల్సి ఉంది.
దులీప్ ట్రోఫీ మరో సెమీఫైనల్లో సౌత్ జోన్ బౌలర్ విద్వత్ కావేరప్ప (4/66) నాలుగు వికెట్లతో మాయ చేశాడు. నిదీశ్ (2/36), తనయ్ త్యాగరాజన్ (2/31)లు సైతం వికెట్ల వేటలో విజృంభించారు. దీంతో 59.1 ఓవర్లలో 195 పరుగులకే నార్త్ జోన్ కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోరుకే పరిమితమైంది. ఓపెనర్ కమ్రాన్ ఇక్బాల్ (76, 182 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్) భారీ అర్థ సెంచరీతో ఓ ఎండ్‌లో నిలబడినా.. మరో ఎండ్ నుంచి సహకారంర లభించలేదు. మిడిల్ ఆర్డర్‌లో వాదావన్ (35, 63 బంతుల్లో 3 ఫోర్లు) ఒక్కడే చెప్పుకోదగిన స్కోరు చేశాడు. సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 18 ఓవర్లలో 2 వికెట్లకు 40 పరుగులు చేసింది. నారాయణ్ జగదీశన్ (34, 58 బంతల్లో 6 ఫోర్లు), కెప్టెన్ తిలక్ వర్మ (1 నాటౌట్) తొలి రోజు ఆట ముగిసేసరికి అజేయంగా క్రీజులో నిలిచారు.



