కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
ఎన్‌ఈపీ-2020ని వెనక్కి తీసుకోవాలి : ఉస్మానియా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆమంచి నాగేశ్వర్
నవతెలంగాణ-సిటీబ్యూరో/నిజాంపేట
ప్రభుత్వ విద్యా రంగాన్ని పటిష్టపరిచి కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ప్రగతినగర్ లోని లీలా సుందరయ్య ఫంక్షన్ హాల్ లో సీపీఐ(ఎం) మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ‘జిల్లా విద్యా సదస్సు’ నిర్వహించారు. పార్టీ జిల్లా కార్యదర్శి పి.సత్యం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 67శాతం, జీహెచ్‌ఎంసీ పరిధిలో 80శాతం విద్యార్థులు ప్రయివేటు పాఠశాలల్లో చేరుతుంటే ప్రభుత్వ విద్య ఎక్కడుందని ప్రశ్నించారు. విద్యను వ్యాపారంగా మార్చిన ‘కార్పొరేట్లు’ నేడు ప్రభుత్వాలనే శాసించే స్థాయికి ఎదిగాయన్నారు. కార్పొరేట్ పాఠశాలల్లో ఎల్‌కేజీ, యూకేజీ కే రూ.50వేల నుంచి రూ.4లక్షల వరకు వసూలు చేస్తుంటే.. సామాన్యుడి ఆదాయంలో 20శాతం కేవలం విద్యకే ఖర్చున చేయాల్సి పరిస్థితి దాపురించిందన్నారు. తాము అధికారంలోకి వస్తే విద్యకు బడ్జెట్‌లో 10శాతం నిధులు కేటాయిస్తామని చెప్పిన కాంగ్రెస్, నేడు 6శాతం కూడా ఖర్చు చేయలేని స్థితిలో ఉందన్నారు.
గ్రామానికో ప్రాథమిక పాఠశాల, మండలానికో జూనియర్ కాలేజీ, నియోజకవర్గానికో డిగ్రీ కాలేజీ, జిల్లాకో పీజీ కాలేజీల ఏర్పాటు ఏమైందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉన్న ప్రభుత్వ పాఠశాలలను తగ్గిస్తూ, దేశంలో లక్ష, రాష్ట్రంలో 8వేల పాఠశాలలను మూసివేసే కుట్ర చేస్తున్నారన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో టీచర్లు, ప్రొఫెసర్ల కొరత తీవ్రంగా ఉందనీ, సరైన సదుపాయాల్లేవన్నారు. అందరికీ విద్య సమానంగా అందాల్సిన అవకాశాల్లేక పోవడంతో ఆదివాసులు, పేదలు చదువులో ధనవంతులతో పోటీపడే పరిస్థితులు లేవన్నారు. దాదాపు రూ.26 వేల కోట్లను ప్రయివేటు విద్యాసంస్థలు ఫీజుల పేరుతో లూటీ చేస్తున్నాయన్నారు. దేశంలో 300 కుటుంబాల వద్దనే రూ.లక్షల కోట్లు పోగై ఉన్నాయనీ, వీరందరిపై మరో 2శాతం పన్ను పెంచితే పేదలకు ఉచిత విద్య, వైద్యం అందించవచ్చని తెలిపారు. అంబానీకి రూ.500 కోట్ల విలువైన ఇల్లు ఉంటే.. తెలంగాణలో 30లక్షల కుటుంబాలకు అసలు ఇండ్లే లేవన్నారు. ఈ అసమానతలకు ప్రభుత్వాలే కారణమని అన్నారు. రానున్న రోజుల్లో అన్ని మండల కేంద్రాలు, కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహిస్తామనీ, అవసరమైతే చలో అసెంబ్లీ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.
‘నీట్’ ప్రత్యక్ష బాధితులు కోటి మంది – ప్రొఫెసర్ నాగేశ్వర్
20 లక్షల మంది ‘నీట్’ పరీక్ష రాస్తే పేపర్ లీకేజీ ఎఫెక్ట్ కోటి మందిపై పడిందపి ప్పొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రధాన మీడియా కొంతమంది వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిన్నా.. సోషల్ మీడియా ద్వారా ‘నీట్’ వ్యవహారం మెజార్టీ ప్రజల్లోకి వెళ్లిందన్నారు. దీంతో వ్యవహారం చర్చినీయాశంగా మారి భాగా అర్థం చేసుకుని పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు. విద్యా రంగంపై ఎన్ని కమిషన్లు విస్తృత పరిశోధనలు చేసి నివేదికలు ఇచ్చినా.. ప్రభుత్వాలు నిధులు కేటాయించలేదన్నారు. అసంతృప్త ప్రజలను సంతృప్తి పర్చడానికే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ-2020ని తీసుకొచ్చా రన్నారు. ప్రొఫెసర్లు లేకుండానే కేరళ, గుజరాత్‌లో డిజిటల్ యూనివర్సిటీలను తీసుకొచ్చి ఆన్‌లైన్ ద్వారా పాఠాలు చెబుతున్నారని చెప్పారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు ఉన్న నాటెడ్జీ ఇంజినీరింగ్ విద్యార్థులకు ఉండటం లేదన్నారు. పాఠశాలల స్థాయిలోనే ఒకేషనల్ విద్యను ప్రోత్సహిం చేలా, 8వ తరగతి నుంచే ప్రారంభంచేలా నూతన ఎడ్యుకేషన్ పాలసీలో ఉందన్నారు. దేశంలో ఉన్న 1100 యూనివర్సిటీల నుంచి ప్రతీ ఏడాది 2కోట్ల మంది విద్యార్థులు ఉన్నత విద్యారంగంలో ఎన్‌రోల్ చేసుకుంటున్నారని తెలిపారు. దేశంలో యువజన నిరుద్యోగ శాతం 14.8 శాతానికి చేరిందనీ, ఇందులో 58శాతం ఏడాదిగా, 78 శాతం రెండేండ్లుగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఎన్‌ఈపీ 2020ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సదస్సులో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రవి, అశోక్, శ్రీనివాసులు, రాజశేఖర్, జిల్లా కమిటీ సభ్యులు రాథోడ్ సంతోష్, బి.వెంకట రామయ్య, లింగస్వామి, నరేష్, లక్ష్మణ్, శ్రీనివాస్, పార్టీ మండల, డివిజన్, జిల్లా నాయకులు పాల్గొన్నారు.



