మూసీ ప్రక్షాళన కార్పొరేట్ల ప్రయోజనాల కోసమేనా.?
గోదావరి జలాల కేటాయింపే శాశ్వత పరిష్కారం
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసే వరకు పోరాటం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ జహంగీర్
నేడు ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా
హాజరుకానున్న సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, నేతలు ఎస్.వీరయ్య, జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ-బోడుప్పల్
యాదాద్రి భువనగిరి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగు, తాగునీటి ప్రాజెక్టులకు తక్షణమే నిధులు విడుదల చేసి, వాటి పూర్తి కోసం ప్రభుత్వం స్పష్టమైన గడువు ప్రకటించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండీ జహంగీర్ డిమాండ్ చేశారు. రైతులకు సాగునీరు అందించి వ్యవసాయాన్ని కాపాడే వరకు సీపీఐ(ఎం) పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలనే డిమాండ్‌తో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ చేపట్టిన పాదయాత్ర రెండో రోజు ఘట్కేసర్, మేడిపల్లి మీదుగా ఉప్పల్, అంబర్‌పేట నుంచి సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి చేరుకుంది. బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని పీర్జాదిగూడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జహంగీర్ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఏర్పడి దశాబ్ద కాలం పూర్తవుతున్నా సాగు, తాగునీటి ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. వ్యవసా యాధారిత జిల్లాలో సాగునీటి వసతులు లేక చిన్న, సన్నకారు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
బునాదిగాని, ధర్మారెడ్డి, పిల్లాయిపల్లి కాల్వల పనులకు నిధులు కేటాయించకపోవడంతో అవి మధ్యలోనే నిలిచిపోయాయని తెలిపారు. బస్వాపూర్, గంధమల్ల, చర్లగూడెం వంటి బహుళార్థసాధక ప్రాజెక్టులు నిధుల కొరతతో పెండింగ్‌లో ఉండటంతో జిల్లాలో సాగు, తాగునీటి కష్టాలు కొనసాగుతున్నాయన్నారు. నవాబుపేట రిజర్వాయర్ నుంచి గుండాల మండలానికి, అశ్వరాయిపల్లి నుంచి ఆలేరు ప్రాంతానికి నీరందించేందుకు నిర్మించిన కాల్వల్లో 15 ఏండ్లుగా నీరు పారక గడ్డి మొలిచి శిథిలావస్థకు చేరాయని విమర్శించారు. నారాయణపురం, చౌటుప్పల్ ప్రాంతాలకు కీలకమైన రాచకొండ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఎందుకు ముందుకు సాగడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆసిఫ్‌నగర్, బృందావనం కాల్వలను పునరుద్ధరించాలని కోరారు.
మూసీకి గోదావరి జలాలే శాశ్వత పరిష్కారం
మూసీ సుందరీకరణ పేరుతో చేపడుతున్న కార్యక్రమాలు కార్పొరేట్ లాభాలకే పరిమితమవుతున్నాయన్న అనుమానాలు ప్రజల్లో ఉన్నాయని జహంగీర్ అన్నారు. విషపూరిత మూసీనీటి ప్రభావంతో భువనగిరి ప్రాంత ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని, వారికి శాశ్వత పరిష్కారం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మూసి ప్రక్షాళనకు గోదావరి జలాల అనుసంధానమే శాశ్వత పరిష్కారమని పేర్కొన్నారు. మూసీ ప్రక్షాళన, గోదావరి జలాల తరలింపుపై సమగ్ర ప్రాజెక్టు నివేదికను ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. షామీర్‌పేట్ చెరువును రిజర్వాయర్‌గా అభివృద్ధి చేసి అక్కడి నుంచి యాదాద్రి భువనగిరి ప్రాంతానికి గోదావరి జలాలు అందించే ప్రతిపాదనను అమలు చేయాలని కోరారు.
పాదయాత్ర బృందానికి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కమిటీ, ఘట్కేసర్, మేడిపల్లి మండల కమిటీల నాయకులు ఘన స్వాగతం పలికారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి వేలాది మంది రైతులు పాదయాత్రకు సంఘీభావంగా తరలివస్తారని జహంగీర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి అవనగంటి వెంకటేష్, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, దాసరి పాండు, జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, గడ్డం వెంకటేశ్, వనం ఉపేందర్, నాయకులు అరుణ, మాజీ ఎంపీటీసీ మేకల కృష్ణయ్య, మామిండ్ల వెంకటేశం, ఉపసర్పంచ్ మత్య్సగిరి, రాజు, ముత్యాలు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా నాయకులు చింతల యాదయ్య, ఘట్కేసర్ నాయకురాలు సబిత, మేడిపల్లి మండల కార్యదర్శి ఎన్. సృజన, కర్రె జంగయ్య, కుమార్, అంజయ్య గౌడ్, పాపయ్య, శ్రీనివాసరావు, అదే విధంగా అంబర్‌పేట డివిజన్ నాయకులు మహేందర్, శ్రీనివాసరావు తదితరులు పాదయాత్రకు స్వాగతం పలికారు.



