ఒకపక్క ప్రజల్లో ‘ఈ20’పై విమర్శలు..
మరోపక్క డీడీ న్యూస్‌లో అనుకూల వార్తలు
మోడీ సర్కారుకు మద్దతుదారులైన
ఏడుగురు రైతు నేతలతో వరుస వీడియోలు
ప్రసార సంస్థ
విశ్వసనీయతపై ప్రశ్నలు
ఈ20పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. వాహనదారుల్లో చాలా మంది మైలేజీ తగ్గుతోందనీ, వాహనాల పనితీరుపై ఆందోళనలు వ్యక్తం చేస్తుండగా.. కేంద్రం మాత్రం ఈ20 రైతులకు ప్రయోజనం చేకూరుస్తుందని వాదిస్తోంది. ఈ ప్రభుత్వ వాదనకు ప్రభుత్వ ప్రసార సంస్థ డీడీ న్యూస్ విస్తృత ప్రచారం కల్పించింది. ముఖ్యంగా గతంలో మోడీ ప్రభుత్వ విధానాలకు మద్దతు తెలిపిన ఏడుగురు రైతు నేతలతో ఈ20ని సమర్థిస్తూ వీడియోలు ప్రసారం చేయడం, వారి నేపథ్యాన్ని ప్రేక్షకులకు వెల్లడించకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
న్యూఢిల్లీ : దేశంలో ఈ20 పెట్రోల్‌పై తీవ్ర వివాదం నెలకొంది. పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలపడం ద్వారా ముడి చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు రైతులకు కొత్త మార్కెట్ లభిస్తుందని కేంద్రం చెప్తోంది. అయితే మరోవైపు వాహనదారులు మైలేజీ తగ్గడం, వాహనాల పనితీరుపై సమస్యలు తలెత్తుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రసార సంస్థ డీడీ న్యూస్ ఈ20ని ఎలా ప్రచారం చేసిందనే అంశంపై ‘న్యూస్‌లాండ్రీ’ కథనం చర్చకు దారి తీసింది.
మే నుంచి 50కి పైగా కార్యక్రమాలు
న్యూస్‌లాండ్రీ కథనం ప్రకారం.. మే నుంచి డీడీ న్యూస్ ఈ20పై 50కి పైగా కార్యక్రమాలు (ఎక్స్‌ప్లైనర్లు, డిబేట్లు, గ్రౌండ్ రిపోర్టులు) ప్రసారం చేసింది. అయితే జులై 28న ఒకేరోజు ఏడుగురు రైతు నేతల వీడియోలను తన అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో వరుసగా ప్రసారం జరిపింది. ఈ వీడియోల్లో రైతులకు ఇథనాల్ మిశ్రమం వల్ల ప్రయోజనం కలుగుతోందని ప్రధానంగా ఉంది. ఈ20ని వ్యతిరేకించే వారి వాదనలను కొందరు నేతలు తీవ్రంగా విమర్శించారు. కాగా ఈ వీడియోలలో వినిపించినవారి వాదనలు ఒకే తరహాలో ఉండటం గమనార్హం.
ఇథనాల్‌ను వ్యతిరేకిస్తే రైతును వ్యతిరేకించడమేనట..!
భారతీయ కృషక్ సమాజ్‌కు చెందిన కృష్ణవీర్ చౌదరి ఈ20ని వ్యతిరేకించే వారిని ‘దేశ వ్యతిరేకులు’గా వివరించారు. రైతులు ‘అన్నదాత’ నుంచి ‘శక్తిదాత’గా మారుతున్నారనీ, ఇథనాల్ మిశ్రమాన్ని వ్యతిరేకించడం సమర్థనీయం కాదని ఆయన అన్నారు. ఇక కె.పి.సింగ్ థైనువాన్ అనే వ్యక్తి ఈ20పై వస్తున్న ఆందోళనలను పూర్తిగా నిరాధారమైనవిగా పేర్కొంటూ.. ఇథనాల్ విస్తరణను ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యానికి ముడిపెట్టారు. చెరకు, వరి, మొక్కజన్న రైతులకు ఇథనాల్ కార్యక్రమం గణనీయమైన ప్రయోజనం కలిగిస్తోందని అశోక్ బల్యాన్ అన్నారు. కె.సాయిరెడ్డి, వినోద్ ఆనంద్, ధర్మేంద్ర చౌదరి, రాంపాల్ జాట్ అనే రైతు నేతలు కూడా ఇలాగే ఈ20 అనుకూల వ్యాఖ్యలు చేశారు.
ఏడుగురి గత నేపథ్యం
ఈ ఏడుగురు రైతు నేతలది ప్రభుత్వ అనుకూల వైఖరేనని వారి నేపథ్యాన్ని బట్టి తెలుసుకోవచ్చు. కృష్ణవీర్ చౌదరి 2014లో బీజేపీలో చేరారు. 2024లో బీజేపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేశారు. 2020-21 రైతుల ఉద్యమ సమయంలో మూడు సాగు చట్టాలకు మద్దతు తెలిపారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఎంఎస్‌పీ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. అశోక్ బల్యాన్ కూడా మూడు వ్యవసాయ చట్టాలకు మద్దతు తెలిపిన రైతు సంఘాల్లో ఒకదానికి నాయకత్వం వహించారు. కె.సాయిరెడ్డి నేతృత్వంలోని భారతీయ కిసాన్ సంఫ్‌ు ఆరెస్సెస్ అనుబంధ సంస్థగా ఉంది. ఆ సంస్థ కేంద్ర ప్రభుత్వ విధానాలకు, ఈ20 లక్ష్యానికి మద్దతు ఇచ్చింది. ఇక కె.పి. సింగ్ థైనువాన్ పలు బీజేపీ కార్యక్రమాల్లో పాల్గన్నారు. మోడీ, యోగికి మద్దతుగా సోషల్ మీడియాలో పలు పోస్టులూ ఉన్నాయి. వినోద్ ఆనంద్.. కేంద్ర ప్రభుత్వ ఎంఎస్‌పీ, వ్యవసాయ సంస్కరణలపై ఉన్నతస్థాయి కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. ధర్మేంద్ర చౌదరి సోషల్ మీడియా ఖాతాల్లో బీజేపీ సీనియర్ నేతలతో సమావేశాల చిత్రాలు ఉన్నాయి. రాంపాల్ జాట్ గతంలో బీజేపీతో అనుబంధంగా ఉన్నారు.
మోడీకి కృతజ్ఞత కార్యక్రమంలోనూ ఏడుగురు
ఈ ఏడుగురు రైతు నేతలు గతేడాది ఆగస్టు 12న ఢిల్లీలోని పూసా కాంప్లెక్స్‌లో జరిగిన ‘ప్రధాన మంత్రి ఆభార్ కార్యక్రమం’లో పాల్గన్నారు. మోడీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
డీడీ న్యూస్ తటస్థతపై ప్రశ్నలు
ఈ20పై డీడీ న్యూస్ వ్యవహరించిన తీరు ఇప్పుడు అనేక సందేహాలు కలిగిస్తోంది. ఒక ప్రజా ప్రసార సంస్థగా వ్యవహరించే డీడీ న్యూస్..ప్రభుత్వానికి అనుకూల ప్రసార మాధ్యమంగా మారడం ఆందోళనకరమని విశ్లేషకులు చెప్తున్నారు. ఇదే విషయంలో వ్యతిరేక అభిప్రాయాలకు కూడా ఎందుకు చోటు కల్పించలేదన్న ప్రశ్నలు వెలువడుతున్నాయి. దీంతో ప్రజాధనంతో నడిచే ప్రసార సంస్థ విశ్వసనీయత, తటస్థతపై పలువురు ప్రశ్నిస్తున్నారు.
మాట
మార్చిన
రైతు
నేతలు..
‘న్యూస్‌లాండ్రీ’ సంబంధిత రైతు నేతలను సంప్రదించగా… వారి స్పందనలు మాత్రం పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ఈ20తో రైతులకు ప్రయోజనం లేదని ధర్మేంద్ర చౌదరి అన్నారు. చెరకు ధరలు పెంచితే రైతులకు ఉపయోగం ఉంటుందని చెప్పారు. రాంపాల్ జాట్ మాట్లాడుతూ.. తన ప్రాంతంలోని రైతులకు ఇథనాల్ మిశ్రమం వల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదని తెలిపారు. వాహనాలు దెబ్బతింటున్నాయనే ఫిర్యాదులు కూడా వస్తున్నాయని తెలిపారు. అయితే ప్రభుత్వ విధానాలపై చర్చించడం తమ విధానమని అశోక్ బల్యాన్, కృష్ణవీర్ చౌదరిలు చెప్పారు.



