Monday, August 31, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుహైదరాబాద్‌‌లో 
భారీ భూ కుంభకోణం

హైదరాబాద్‌‌లో 
భారీ భూ కుంభకోణం

- Advertisement -

రూ.500 కోట్ల భూమిని ప్రయివేట్‌‌ వ్యక్తులకు అప్పగించే కుట్ర
ఉపసంహరించుకోవాలని ‌మాజీ మంత్రి హరీశ్‌‌రావు డిమాండ్‌
సీఎం ఎ.రేవంత్‌‌రెడ్డికి లేఖ

​నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
హైదరాబాద్‌‌లోని అజామాబాద్‌ పారిశ్రామిక వాడలో గల రూ.500 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని ప్రయివేట్‌ ‌వ్యక్తులకు అప్పగించే యత్నాన్ని విరమించుకోవాలని మాజీ మంత్రి హరీశ్‌‌రావు డిమాండ్‌ ‌చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌‌రెడ్డికి లేఖ రాశారు. తెలంగాణ ఆయిల్‌ఫెడ్ ఆధీనంలో ఉన్న భూమిని సదరు సంస్థకు కాకుండా ఇతరులకు అప్పనంగా ధారాదత్తం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. బహిరంగ మార్కెట్లో వందల కోట్ల విలువ గల భూమిని కాంగ్రెస్‌ ‌పార్టీకి చెందిన అనుయాయులకు తక్కువ ధరకు అప్పగించేందుకు చేస్తున్న ప్రయత్నాలను వెనక్కితీసుకోవాలన్నారు. మూడు దశాబ్దాలుగా ఆయిల్‌ఫెడ్ ఆధీనంలో 3 ఎకరాల 23 గుంటల భూమి ఉందని గుర్తు చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన రూ.87 కోట్లు చెల్లించడానికి సొంత ప్రభుత్వ సంస్థ అయిన ఆయిల్‌ఫెడ్ సిద్ధంగా ఉన్నా, వారిని కాదని ప్రయివేట్‌ వ్యక్తులకు అప్పగించడం వెనుక దాగిన కుట్రను బహిర్గతం చేయాలని డిమాండ్‌ ‌చేశారు.

ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిన కాంగ్రెస్‌ సర్కార్ రియల్ ఎస్టేట్ ఏజెన్సీగా మారిపోయిందని విమర్శించారు. 1987లోనే సుప్రీంకోర్టు ప్రయివేట్‌ సంస్థకు మొట్టికాయలు వేసి ప్రభుత్వానిదే హక్కు అని తేల్చినా కమీషన్ల కోసం కాంగ్రెస్ నేతలు తీర్పులనే తుంగలో తొక్కారని లేఖలో పేర్కొన్నారు. ఒక్క అజామాబాద్ అనే కాకుండా కోకాపేట, రాయదుర్గం, గచ్చిబౌలిలోనూ కాంగ్రెస్ రియల్ ఎస్టేట్ దందా నడిపిస్తోందని ఆరోపించారు. స్వార్థం కోసం ఇష్టారాజ్యంగా ఆస్తులు అమ్ముకుంటూ పోతే భవిష్యత్‌లో గుడికి, బడికి, చివరికి స్మశానానికి కూడా రాష్ట్రంలో స్థలం మిగలదని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ముఖ్యమంత్రి ఈ అక్రమ కేటాయింపును రద్దు చేసి, ఆ భూమిని ఆయిల్‌ఫెడ్‌కే దక్కేలా ఫ్రీహోల్డ్ హక్కులు కల్పించాలని డిమాండ్‌ ‌చేశారు. ప్రజల సొత్తును ప్రయివేట్‌ వ్యక్తులకు దోచిపెడితే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -