Monday, August 31, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుప్రశ్నించడమే మా ఎజెండా

ప్రశ్నించడమే మా ఎజెండా

- Advertisement -

న్యూ ఇండియా కోరేది అభివృద్ధే
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లా విద్వేష, విభజన రాజకీయాలు కాదు
ఈ దేశం కార్పొరేట్లది కాదు..ప్రజలది
జెన్‌‌జీ పోరాటం- ఒక పరిశీలన సెమినార్‌‌లో
ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత ఉపాధ్యక్షులు ఐషీ ఘోష్‌
ప్రజాస్వామ్యాన్ని కాపాడేది ప్రశ్నించే ప్రజాచైతన్యమే: మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌
తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కోసం
ఉద్యమం : ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
న్యూ ఇండియా కోరుకుంటున్నది అభివృద్ధిని మాత్రమేనని ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత ఉపాధ్యక్షులు ఐషీఘోష్‌ స్పష్టం చేశారు. బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్‌ ‌విద్వేష, విభజన రాజకీయాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని చెప్పారు. ఎస్సెల్‌ ‌గ్రూపు యాజమాని సుభాష్‌ ‌చంద్రకు చెందిన రూ.22 కోట్ల అప్పులకుగానూ సెటిల్‌‌మెంట్‌ ‌కింద రూ.6.5 కోట్లు చెల్లిస్తే చాలని ఎన్‌‌సీఎల్‌‌టీ చెప్పటాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. కార్పొరేట్లకు వేలాది కోట్ల రూపాయలను మాఫీ చేసి లబ్ది చేకూర్చడమే దేశభక్తినా? అని నిలదీశారు. ఈ దేశం కార్పొరేట్లది కాదనీ, రైతులు, కార్మికులు, ప్రజలదని స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనురిస్తున్న విధానాలపైనా, ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పనపైనా ప్రశ్నించడమే అజెండాగా ముందుకెళ్తున్నామని తెలిపారు. సాంత్రత్య సమరయోధుల స్ఫూర్తితో దేశాన్ని రక్షించుకుంటామనీ, జెన్‌‌జీ, జెన్‌ ఆల్ఫా చేస్తున్న ఈ పోరాటానికి ప్రజలందరూ మద్దతివ్వాలని పిలుపునిచ్చారు. ఆర్థికాభివృద్ధిలో దేశ యువతను భాగస్వామ్యం చేయాలని డిమాండ్‌ ‌చేశారు. ఆదివారం హైదరాబాద్‌‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జెన్‌‌జీ పోరాటం-ఒక పరిశీలన అనే అంశంపై సెమినార్‌‌ను నిర్వహించారు. అందులో ఐషీఘోష్‌ ‌మాట్లాడుతూ…కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచీ యూనివర్శిటీలను, ఉన్నతవిద్యను నిర్వీర్యం చేసిందనీ, స్కాలర్‌‌షిప్పులను ఆపడంతో పాటు యూజీసీ గ్రాంట్లను ఇవ్వకుండా చేసిందని విమర్శించారు.

పైగా, యూనివర్సిటీలు అప్పు కింద లోన్లు తీసుకుని తిరిగి తీర్చాలని సూచించడం దారుణమన్నారు. ఇలా ఒక క్రమపద్ధతిలో పేదలకు విద్యను దూరం చేసేందుకు ప్రభుత్వ విద్యారంగంపై దాడి చేసిన తీరును, ప్రాంతం, మతం, భాష పేరుతో విద్యార్థులను చీల్చి విద్యను వ్యాపారమయం, కేంద్రీకృతం, మతపరం చేసిన తీరును వివరించారు. దీన్ని ప్రశ్నించిన జేఎన్‌‌యూ, సెంట్రల్‌ ‌యూనివర్సిటీ నేతలపై దేశద్రోహులు, పాకిస్తాన్‌, చైనా ఏజెంట్లు అని ముద్ర వేయడం దారుణమనీ, దానికి సంబంధించి ఒక్క ఆధారాన్ని కూడా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌నిరూపించ లేకపోయాయని చెప్పారు. ఎన్‌‌టీఏ ద్వారా కేవలం ఇంగ్లీషు, హిందీ భాషల్లో పరిక్షాపత్రాలను తయారు చేయించడం వల్ల ప్రాంతీయ భాషల్లో చదివే గ్రామీణ విద్యార్థులు నీట్‌ ‌పరీక్షల్లో తీవ్రంగా నష్టపోయారని వాపోయారు. 60, 70 లక్షల రూపాయల ఫీజులు కట్టి వారు ప్రయివేటు కాలేజీల్లో చదివే స్థోమత ఉంటుందా? అప్పులు, లోన్లు తీసుకుని చదివించినవారు సేవ గురించి ఆలోచిస్తారా? తోటి విద్యార్థుల బాధల గురించి పట్టించుకుంటారా? ప్రయివేటు ఆస్పత్రి పెట్టుకుని అప్పు తీర్చేందుకు సంపాదనపై దృష్టి పెట్టరా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. నీట్‌ ‌పరీక్ష పేపర్ల లీకేజీ ద్వారా లక్షలాది మంది విద్యార్థులతో ఆటలాడుకోవడం దారుణమన్నారు. ఏటా ఇస్తామన్న రెండు కోట్ల ఉద్యోగాల కల్పన హామీ ఏమైంది అని అడిగితే బజ్జీలు, పకోడీ బండీలు, పాలకేంద్రాలు పెట్టుకోండి అని బీజేపీ నేతలను మాట్లాడటాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. జెన్‌‌జీ పోరాటం స్ఫూర్తిదాయకమనీ, ఆ పోరాటంలో వామపక్ష విద్యార్థి సంఘాల పాత్ర కీలకమని చెప్పారు. దేశరక్షణ కోసం పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని ప్రకటించారు.

మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్‌ ‌కె.నాగేశ్వర్‌ ‌మాట్లాడుతూ..40 ఏండ్లుగా అనేక పోరాటాలను దగ్గరగా చూశాననీ, ఆ పోరాటంలో ఎనర్జీ తనకు ఆశ్చర్యం కలిగించ ిందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో జరుగుతున్న యువజన పోరాటాలను వివరిస్తూనే సరైన మార్గదర్శకత్వం లేకుంటే వాటిపై ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు. దేశంలో యువత పాపులేషన్‌, ఉన్నత విద్య ‌పెరిగిందనీ, దానికి తగ్గట్టుగా కేంద్ర పాలకులకు యువతకు ఉపాధి కల్పించడంలో విఫలమయ్యారని విమర్శించారు. మన దేశంలో మాన్‌‌ఫాక్చరింగ్‌ ‌రంగం సరైన రీతిలో అభివృద్ధిలో చెందలేదని ఎత్తిచూపారు. మరోవైపు సంపద కొద్ది మంది చేతుల్లో పోగై అర్థిక అసమతుల్యత పెరిగిపోతుందన్నీ, మరోవైపు ఫుడ్‌ ‌సెక్యూరిటీ గ్యారెంటీ లేకుండా పోయిందని వివరించారు. మరోవైపు విద్య, వైద్యంపై ప్రజలు విపరీతంగా ఖర్చుచేయాల్సిన పరిస్థితి కుటుంబాలకు భారంగా మారిందన్నారు. కష్టపడి చదివినా పేపర్‌ ‌లీకేజీలతో విద్యార్థులు సతమతం అవుతున్న పరిస్థితి ఉందన్నారు.

ఇలా అనేక అభద్రతా భావాల నుంచే జెన్‌‌జీ పోరాటం పుట్టుకొచ్చిందనీ, ప్రజాస్వామ్య పద్ధతిలో తిరుగుబాటు శక్తిగా ఎదిగారని వివరించారు. మీడియా, సోషల్‌‌మీడియాను మ్యానేజ్‌‌చేయడం, పొలిటికల్‌ ‌పోలరైజ్‌, యువత ఆలోచనల్ని బంధించడం, ప్రతిపక్షాలను చీల్చడం, ప్రశ్నిస్తే దేశద్రోహి ముద్ర వేయడం వంటి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ఎత్తుగడలు పనిచేయడం లేదనీ, సిలబస్‌ ‌బయటి నుంచి ప్రశ్నలు వస్తుండటంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అతలాకుతలం అవుతున్నదని చెప్పారు. ఇప్పుడు సర్‌ ‌పేరుతో లబ్ది పొందాలని చూస్తున్నదని తెలిపారు. జెన్‌‌జీ ఉద్యమం ఆర్గనైజ్డ్‌‌గా మారుతున్నదనీ, దీన్ని బలమైన పోరాటంగా మార్చాలని పిలుపునిచ్చారు. ప్రశ్నించే ప్రజాచైతన్యమే ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని కాపాడుతుందని చెప్పారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు మాట్లాడుతూ…​ఢిల్లీ జంతర్ మంతర్ పోరాటం స్ఫూర్తితో తెలంగాణలోని విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కొరత, అధ్యాపకుల ఖాళీలు, ఫీజుల భారంతో పాటు విద్యార్థులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎస్‌ఎఫ్‌‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌.రజనీకాంత్‌ అధ్యక్షతన జరిగిన ఈ సెమినార్‌‌లో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.మమత, డి.కిరణ్‌, కె.అశోక్‌‌రెడ్డి, బి.శంకర్‌, రాష్ట్ర సహాయ కార్యదర్శులు సుమ, కార్తీక్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు లెనిన్‌‌గువేరా, కేవై.ప్రణయ్‌, కార్తీక్‌, జునుగురి రమేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -