నిరుపేదకు ఆర్థిక సాయం.. పాఠశాలకు సీసీ కెమెరాలు
ఆలయానికీ, మరుగుదొడ్డి నిర్మాణానికి విరాళం
మక్తల్ మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ కుమారి శైవి రెడ్డి
నవతెలంగాణ-మక్తల్
పదవి ద్వారా వచ్చే గౌరవ వేతనాన్ని వ్యక్తిగత అవసరాలకు వినియోగించకుండా ప్రజా సంక్షేమానికి వెచ్చిస్తూ మక్తల్ మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ శైవి రెడ్డి దాతృత్వాన్ని చాటుకున్నారు. ప్రభుత్వం తనకు అందించిన నాలుగు నెలల గౌరవ వేతనాన్ని వివిధ సామాజిక అవసరాలకు కేటాయించి పలువురికి అండగా నిలిచారు.ఎండనక, వాననక రోడ్డుపక్కన కూర్చొని ఏళ్లుగా చెప్పులు కుడుతూ, మరమ్మతులు చేస్తూ జీవనం సాగిస్తున్న నిరుపేద సీతమ్మను గుర్తించిన శైవి రెడ్డి ఆమెకు రూ.7 వేల ఆర్థిక సాయం అందించారు. రోజంతా కష్టపడి పనిచేస్తూ, తన వృత్తిని సేవాభావంతో కొనసాగిస్తున్న సీతమ్మకు ఈ సాయం కొంతైనా ఊరటనిస్తుందని తెలిపారు.అదేవిధంగా ప్రభుత్వ ఎంపీపీఎస్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పాఠశాలకు సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ.12 వేల గౌరవ వేతనాన్ని పాఠశాల హెచ్‌ఎంకు అందజేశారు.
విద్యార్థుల భద్రతతో పాటు పాఠశాలల్లో మెరుగైన వాతావరణం కల్పించేందుకు తనవంతు సహకారం అందించడం సంతోషంగా ఉందన్నారు.అలాగే పులిమామిడి ఆలయం వద్ద భక్తులు, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరుగుదొడ్డి నిర్మాణానికి మరో రూ.10 వేల గౌరవ వేతనాన్ని విరాళంగా అందించారు. ఇలా ప్రభుత్వం తనకు అందించిన నాలుగు నెలల గౌరవ వేతనాన్ని ప్రజా అవసరాలకు, సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించడం ద్వారా ప్రజాప్రతినిధిగా తన బాధ్యతను చాటుకున్నారు.ప్రజలకు అందుబాటులో ఉంటా ప్రజలకు ఎంతో కొంత ఉపయోగపడాలనే ఉద్దేశంతో తనకు చేతనైనంత సహాయం ఎల్లప్పుడూ అందిస్తానని శైవి రెడ్డి తెలిపారు. ప్రజలు ఎదుర్కొనే కనీస అవసరాలైన తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్, రోడ్లు, డ్రైనేజీ వంటి సమస్యలపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తానన్నారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకువస్తే తక్షణమే స్పందించి పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.మంత్రి వాకిటి శ్రీహరిని అలాగే తన తండ్రి అమర్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని ప్రజల్లో కలిసిమెలిసి పనిచేస్తూ, పదవిని ప్రజాసేవకు ఒక అవకాశంగా భావిస్తానని శైవి రెడ్డి తెలిపారు. గౌరవ వేతనం ప్రజల కోసం వినియోగించడం తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు.


