రికార్డు స్థాయి ఆహార ధాన్యాల ఉత్పత్తి అంటూ కేంద్రం ప్రచారం..
దేశంలో వాతావరణ సంక్షోభంపై మాత్రం నిర్లక్ష్యం..బియ్యం, గోధుమలకే మోడీ సర్కారు చర్యలు పరిమితం
నీటి కొరత, కరువు, వరదలకు అనుగుణంగా
మారని విధానాలు..’ఫుడ్ సెక్యూరిటీ’ కాదు..
‘క్లైమేట్ సెక్యూరిటీ’ అవసరం
రైతు భవిష్యత్‌ను కాపాడాలంటే అదే కీలకం..
ప్రభుత్వానికి వ్యవసాయ నిపుణులు, విశ్లేషకుల సూచనలు
న్యూఢిల్లీ : దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయికి చేరిందని మోడీ ప్రభుత్వం పదేపదే ప్రచారం చేసుకుంటున్నా.. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా దేశ ఆహార వ్యవస్థను మార్చడంలో మాత్రం ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అస్తవ్యస్త వర్షాలు, కరువులు, ఆకస్మిక వరదలు, భూగర్భజలాల క్షీణత ఇప్పటికే వ్యవసాయానికి తీవ్ర ముప్పుగా మారుతున్నాయి. ఇలాంటి సమయంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పాతకాలపు బియ్యం, గోధుమల ఆధారిత విధానాన్ని కొనసాగించడం, పంటల వైవిధ్యానికి తగిన ప్రోత్సాహం ఇవ్వకపోవడం భవిష్యత్ ఆహార భద్రతను ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు, పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1960లలో విదేశీ ఆహార సాయంపై ఆధారపడిన దేశం.. నేడు 350 మిలియన్ టన్నులకు పైగా ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసే స్థాయికి చేరింది. కానీ ఆ ఘనతను కాపాడేందుకు అవసరమైన తదుపరి దశలో కేంద్రం ఎంత వరకు ముందుకు వెళ్తోందన్నదే అసలు ప్రశ్నగా మిగిలింది.
చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు వంటి పంటలకు ప్రాధాన్యం పెంచడం ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించవచ్చు. ఆహారంలో పోషక వైవిధ్యాన్ని పెంచవచ్చు. కానీ కొన్ని కార్యక్రమాలు, ప్రచారాలతో రైతుల పంట ఎంపిక మారదని వ్యవసాయ పరిశోధకులు చెప్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు వ్యవస్థలో మార్పు రావాలనీ, మద్దతు ధర, మార్కెట్, నిల్వ, ప్రాసెసింగ్, రవాణా వంటి మొత్తం వ్యవస్థ ప్రత్యామ్నాయ పంటలకు అనుకూలంగా మారాలని సూచిస్తున్నారు.వాతావరణ సంక్షోభాన్ని రైతు ఒంటరిగా ఎదుర్కోలేడు
వాతావరణ పరిస్థితులపై రైతులకు ముందస్తు సమాచారం సకాలంలో చేరాలి. వేడి తరంగాలు, భారీ వర్షాలు, కరువు పరిస్థితులను ముందుగానే గుర్తించి పంట ప్రణాళికను మార్చుకునే అవకాశం కల్పించాలి. వాతావరణాన్ని తట్టుకునే విత్తనాలు, సూక్ష్మ సాగునీరు, వాటర్‌షెడ్ అభివృద్ధి, డిజిటల్ సలహాలు, పంట బీమా వంటి చర్యలను బలోపేతం చేయాలి. కేంద్రం రైతులపై ప్రమాదాన్ని నెట్టివేసి.. తర్వాత పరిహారం ఇచ్చే విధానానికి బదులుగా ప్రమాదాన్ని ముందుగానే తగ్గించే విధానాన్ని అవలంభించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ధాన్యం మాత్రమే కాదు.. గిడ్డంగులనూ కాపాడాలి
వాతావరణ ముప్పు పొలంలోనే ఆగదు.. వరదల్లో గిడ్డంగులు దెబ్బతింటే ధాన్యం నష్టపోతుంది. అధిక ఉష్ణోగ్రతలతో నిల్వ నష్టం పెరుగుతుంది.
రవాణా వ్యవస్థ దెబ్బతింటే మార్కెట్లకు సరఫరా ఆగిపోతుంది. అందుకు వరదలను తట్టుకునే గిడ్డంగులు, మెరుగైన కోల్డ్‌చైన్‌లు, ఉష్ణోగ్రతలను తట్టుకునే నిల్వ వ్యవస్థలు, బలమైన రవాణా మౌలిక వసతులు అవసరమని నిపుణులు చెప్తున్నారు.
కేంద్రం వద్ద సమాధానం కరువు
కేంద్రంలోని మోడీ సర్కారు వ్యవసాయం, రైతుల విషయంలో గొప్పలు పెద్ద ఎత్తున చెప్పుకుంటోంది. రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణాంకాలను చూపిస్తూ ఆహార భద్రత సాధించామని చెప్పుకుంటోంది. అయితే రేపటి వాతావరణ సంక్షోభంలో కూడా రైతు పండించగలడా? ప్రజలకు అందుబాటు ధరలో పోషకాహారం దొరుకుతుందా? నీటి వనరులు మనగలవా? పంట నష్టపోతే రైతుకు రక్షణ ఉంటుందా? అన్న ప్రశ్నలకు మోడీ ప్రభుత్వం వద్ద సమాధానం లేదనే చెప్పాలి.
కావాల్సింది ప్రచారం కాదు.. విధాన మార్పు
ఆహార భద్రతను రేషన్ బియ్యం, గోధుమల పంపిణీగా పరిమితం చేయకుండా.. నీరు, వ్యవసాయం, పోషణ, నిల్వ, రవాణా, మార్కెట్లను కలిపిన సమగ్ర విధానంగా మార్చాలి. ”భారత్ గతంలో ఆహార కొరతను అధిగమించింది. ఇప్పుడు వాతావరణ సంక్షోభాన్ని అధిగమించాల్సిన దశ వచ్చింది.
మోడీ ప్రభుత్వం.. విజయాలను ప్రచారం చేసుకోవడం కంటే.. భవిష్యత్ ప్రమాదాలను ఎదుర్కొనే విధానాలను రూపొందించాలి” అని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే ‘రికార్డు ఉత్పత్తి’ అనే పేరు మిగిలినా.. రైతుకు భద్రత, ప్రజలకు పోషకాహారం, దేశానికి సుస్థిరమైన ఆహార భవిష్యత్ మాత్రం ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
బియ్యం-గోధుమలపై ఆధారపడటం
బియ్యం, గోధుమలు దేశ ఆహార భద్రతకు కీలకమైన పంటలు. అయితే ప్రభుత్వ కొనుగోళ్లు కొన్ని పంటలు, కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడంతో వ్యవసాయ వ్యవస్థలో ప్రమాదపు సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అనేక ప్రాంతాల్లో భూగర్భజలాలు తీవ్రంగా క్షీణిస్తున్నప్పటికీ.. అధిక నీరు అవసరమయ్యే పంటల చుట్టూ ఏర్పడిన కొనుగోలు, మద్దతు వ్యవస్థలను మార్చడంలో కేంద్రం తగినంత వేగం చూపడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ”రైతును పంట మార్చాలని చెప్పడం సులభం. కానీ ప్రత్యామ్నాయ పంటకు ఖచ్చితమైన మార్కెట్, ధర, ప్రభుత్వ కొనుగోలు, నిల్వ, ప్రాసెసింగ్ హామీ ఇవ్వకుండా రైతు ఎందుకు మారుతాడు?” అని వ్యవసాయ నిపుణులు చెప్తున్నారు. ఇదే ఇప్పుడు మోడీ ప్రభుత్వ వ్యవసాయ విధానానికి అసలు పరీక్షగా వివరిస్తున్నారు.



