Tuesday, September 1, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఎమ్మెల్యేలు, మంత్రుల్ని దిగ్బంధిస్తాం

ఎమ్మెల్యేలు, మంత్రుల్ని దిగ్బంధిస్తాం

- Advertisement -

చిన్న, మధ్యతరహా ప్రాజెక్టుల్ని పూర్తిచేయాలి
రాష్ట్ర సర్కారు వాటికే ప్రాధాన్యతనివ్వాలి
బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లవి ఒకే విధానాలు
సోషలిస్టు వ్యవస్థతోనే ప్రజా సమస్యలు పరిష్కారం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ
బండి, కిషన్‌‌రెడ్డికి తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులు పట్టవా?
పేదల కోసం ఆలోచించేది ఎర్రజెండానే : ఎస్‌.వీరయ్య
యాదాద్రి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేయాలని ఇందిరాపార్కు వద్ద ధర్నా
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్ర ప్రభుత్వం చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో వెంటనే పూర్తిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ డిమాండ్‌ ‌చేశారు. కేవలం రూ.1700 కోట్లు ఖర్చుపెడితే యాదాద్రి భువనగిరి జిల్లాలోని పెండింగ్‌ ‌ప్రాజెక్టులను పూర్తిచేసి ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని సూచించారు. లేనిపక్షంలో ఆ జిల్లా రైతాంగాన్ని కదిలించి ఎమ్మెల్యేలు, మంత్రులను దిగ్బంధిస్తామని హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పెండింగ్‌ ‌సాగునీటి ప్రాజెక్టులకు నిధులు విడుదల చేసి వాటిని పూర్తి చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ సీపీఐ(ఎం) బృందం చేపట్టిన పాదయాత్ర హైదరాబాద్‌‌కు చేరుకున్నది. సోమవారం ఉదయం బాగ్‌‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్కు వరకు పాదయాత్ర చేపట్టింది. అనంతరం అక్కడ వేలాది మందితో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎమ్‌‌డీ.జహంగీర్‌ అధ్యక్షతన మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జాన్‌‌వెస్లీ మాట్లాడుతూ.. డిండి, చర్లగూడెం ప్రాజెక్టులను దశాబ్దాలుగా పెండింగ్‌‌లో పెట్టడం ఏంటని ప్రశ్నించారు. రాచకొండ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసి వదిలిపెట్టారనీ, దానికి కనీసం డీపీఆర్‌ ‌కూడా రూపొందించడం లేదని తెలిపారు. ఆ పథకం పూర్తయితే నారాయణపురం, చౌటుప్పల్‌ ‌మండలాలకు సాగునీరు అందుతుందనీ, భూగర్భజలాలు పెరుగుతాయని చెప్పారు. బస్వాపూర్‌, గంధమల్ల రిజర్వాయర్లు, చర్లగూడెం ప్రాజెక్టు, ధర్మారెడ్డిపల్లి, పిలాయిపల్లి కాలువలను వెంటనే పూర్తి చేయించాలనీ, మూసీని ప్రక్షాళన చేయాలని డిమాండ్‌ ‌చేశారు. బస్వాపురం భూ నిర్వాసితులకు వెంటనే పరిహారం చెల్లించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టుల పట్ల వివక్ష చూపడాన్ని ఆక్షేపించారు. ఎవడబ్బ సొమ్ము అని మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు దేశసంపదను ధారాదత్తం చేస్తున్నదని ప్రశ్నించారు. కేవలం కొన్ని కుటుంబాల చేతిలో లక్షలాది కోట్ల రూపాయలు ఉండటమేంటి? వారికే దేశ వనరులను కట్టబెట్టడం ఏంటి? అని నిలదీశారు. కార్మికులు, రైతులు, ప్రజల విషయంలో బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వాలవి ఒకే విధానాలనీ, సోషలిస్టు వ్యవస్థ వస్తేనే పేదలకు న్యాయం దక్కుతుందని చెప్పారు.

మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ..ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే యాద్రాది జిల్లా ప్రాజెక్టులు ఇన్నేండ్లుగా పెండింగ్‌‌లో ఉండేవి కాదన్నారు. యాదాద్రి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రాజెక్టులకు నిధులు రాబట్టాలని సూచించారు. మూసీలో గోదావరి నీళ్లను పారిస్తామని సంగెంలో ఇచ్చిన హామీ ఏమైందని సీఎం రేవంత్‌‌రెడ్డిని ప్రశ్నించారు.
వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.వెంకట్రాములు మాట్లాడుతూ..గ్రామీణ పేదలు, రైతుల బతుకులు బాగుపడకుండా తెలంగాణలో మూడు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ, వికసిత్‌ ‌భారత్‌ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. బస్వాపురం భూ నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ ‌చేశారు. కేవీపీఎస్‌ ‌రాష్ట్ర కార్యదర్శి టి.స్కైలాబ్‌‌బాబు మాట్లాడుతూ…ప్రజలు ఎర్రజెండాకు అధికారం ఇస్తే పెండింగ్‌ ‌ప్రాజెక్టులను వెంటనే పూర్తిచేస్తారన్నారు. అయోధ్య రామాలయం, బద్రినాథ్‌ ‌టెంపుల్‌‌లో జరిగిన అవినీతి సొమ్ముతో యాదాద్రి జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తిచేయొచ్చన్నారు. బస్వాపూర్‌ ‌నిర్వాసితులకు పరిహారం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద రూ.400 కోట్లు లేవా? అని ప్రశ్నించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పి.ఆశయ్య మాట్లాడుతూ..కాలుష్యమయమైన మూసీనది నీళ్లను తాగడం వల్ల యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రజలు క్యాన్సర్‌, చర్మ, కిడ్నీ, తదితర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వచ్చి ఒక్కరోజు యాదాద్రి జిల్లాలోని గ్రామాల్లో బోర్ల నీళ్లను తాగాలని సవాల్‌ ‌విసిరారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) సీనియర్‌ ‌నేత డీజీ నర్సింహారావు, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్‌, యాదాద్రి భువనగిరి జిల్లా నాయకులు బి.అనురాధ, బాలరాజు, పెంటయ్య, దాసరిపాండు, కల్లూరి మల్లేశం, బూర్గు కృష్ణారెడ్డి, శ్రీనివాసాచారి, తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చిన సీపీఐ(ఎం) పాదయాత్ర

యాదాద్రి భువనగిరి జిల్లాలోని పెండింగ్‌ ‌ప్రాజెక్టులను, కాలువల పనులను పూర్తిచేయాలని డిమాండ్‌ ‌చేస్తూ ఈ నెల 29న భువనగిరిలో సీపీఐ(ఎం) పాదయాత్ర మొదలైంది. దీనిని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌.వీరయ్య ప్రారంభించగా… పాద యాత్రకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు, జిల్లా కార్యదర్శి ఎమ్‌‌డీ జహంగీర్‌ ‌నేతృత్వం వహించారు. భువనగిరి, బీబీనగర్‌, ఘట్‌‌కేసర్‌ ‌మీదుగా హైదరాబాద్‌ ‌వరకు కొనసాగింది. ఘట్‌‌కేసర్‌‌, ఉప్పల్‌, అంబర్‌‌పేటలలో పాదయాత్రకు ఆయా జిల్లాల పార్టీ కమిటీలు ఘనంగా స్వాగతం పలికాయి. 30వ తేదీన రాత్రి బాగ్‌‌లింగపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వరకు చేరుకున్నది. పాదయాత్రలో యాదాద్రి జిల్లాకు చెందిన సీపీఐ(ఎం) నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. ప్రాజెక్టుల కోసం సీపీఐ(ఎం) నాయకులు పాదయాత్ర చేస్తున్నారనే కాంగ్రెస్‌ ‌నేతల ఒత్తిడితో రాష్ట్ర ప్రభుత్వం రూ.206 కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటిం చింది. కానీ, బస్వాపూర్‌ ‌రిజర్వాయర్‌ ‌నిర్మాణానికి ఆ నిధులు ఏ మూలకూ సరిపోవు. పోరాటం చేసినప్పుడు మొక్కుబడి అరకొర నిధులు కేటాయించడం కాదు…బస్వాపురం, గందమల్ల రిజర్వాయర్లు, చర్లగూ డెం ప్రాజెక్టు, ధర్మారెడ్డి, పిలాయిపల్లి కాలువల పనులకు పూర్తిస్థాయిలో నిధులు విడుదల చేసి పనులు చేసేదాకా క్షేత్రస్థాయిలో పోరాటాన్ని ఆపేదే లేదని సీపీఐ(ఎం) పాదయాత్ర బృందం స్పష్టం చేసింది.

కాళేశ్వరం పేరుతో మిగతా ప్రాజెక్టులను 
గత ప్రభుత్వం విస్మరించింది : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌.వీరయ్య

గత ప్రభుత్వం కాళేశ్వరం పేరుతో మిగతా ప్రాజెక్టులన్నింటినీ విస్మరించిందనీ, ఇప్పుడు ఆ కాళేశ్వరం కూడా వృథాగా మారిందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌.వీరయ్య అన్నారు. పెండింగ్‌ ‌ప్రాజెక్టులను పూర్తిచేయకుండా రేవంత్‌‌రెడ్డి సర్కారు కాళేశ్వరం లోపాలను ఎత్తిచూపుతూ పబ్బం గడుపుతున్నదని విమర్శించారు. తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చే విషయంపై రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 8 మంది ఎంపీలు ఎందుకు మాట్లాడటం లేదు? కేంద్ర మంత్రులు కిషన్‌‌రెడ్డి, బండి సంజయ్‌ ఎందుకు సమాధానం చెప్పరు? అని నిలదీశారు. యాప్‌ ‌తెచ్చి రైతులకు సకాలంలో యూరియా దక్కకకుండా చేయడం దుర్మా ర్గమన్నారు. ఫ్యూచర్‌‌సిటీకి పెట్టుబడులు రాబట్టు కోవడంపై ఉన్న శ్రద్ధ వేలాది కుటుంబాలు బాగుపడే ప్రాజెక్టులను పూర్తిచేయడంపై ఎందుకు లేదని ప్రశ్నించారు. గ్రామీణ పేదలు, రైతుల బతుకులు బాగుపడకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగుపడదని స్పష్టం చేశారు. పేదల గురించి ఆలోచించేది, ప్రాణాలు అర్పించేది ఎర్రజెండా మాత్రమేనని చెబుతూ విద్యుత్‌, భూ పోరాటాల గొప్పతనాన్ని వివరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ప్రాజెక్టుల పూర్తి కోసం సమరశీల పోరాటాలే శరణ్యమన్నారు.

ఏండ్లుగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రాజెక్టులపై పోరాటం :మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
గోదావరి, కృష్ణా జలాలతో యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని ప్రాజెక్టులను నింపాలని ఎన్నో ఏండ్లుగా పోరాటాలు చేస్తున్నామనీ, వాటి ఫలితంగా కొంత మేర విజయం సాధించామని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి తెలిపారు. ఆ జిల్లాలోని ప్రాజెక్టుల పూర్తికి, నిర్వాసితులకు పరిహారం చెల్లించడానికి కాళేశ్వరం లెక్క లక్షల కోట్ల రూపాయలు అవసరం లేదనీ, తక్కువ నిధులతో ఎక్కువ మంది రైతులకు ప్రయోజనం చేకూర్చవచ్చునని విడమర్చి చెప్పారు. కమీషన్లు, రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడటం ఆపి ప్రాధాన్యతా క్రమంలో చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులను పూర్తిచేయాలని డిమాండ్‌ ‌చేశారు. ఎన్నికల ముందేమో ప్రజల పక్షాన ఉంటామని చెబుతూ అధికారంలోకి రాగానే పాలకులు వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -