Sunday, September 6, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిగాలినుండి విద్యుత్తు

గాలినుండి విద్యుత్తు

- Advertisement -

దీనినే పవన విద్యుత్తు అని కూడా అందురు. పవన విద్యుత్తు ఒక రాష్ట్రానికే పరిమితమా అంటే కాదు కాదు రెండో రాష్ట్రంలో కూడా లభ్యమవుతుంది అన్న ప్రయత్నమూ జరిగింది, కొంత గొడవయ్యింది కూడా. ఆ గొడవలు మనకనవసరం. ఎందుకంటే ఏ విద్యుత్తయినా ప్రజలకు ఉపయోగంలోకి వస్తే అదే పదివేలు మనకు. ఇక విద్యుత్తు నీటిద్వారా, బొగ్గు ద్వారా, యురేనియం ద్వారా, నీటి అలలద్వారా, సూర్యరశ్మి ద్వారా, ఇంకొన్ని పద్ధతుల ద్వారా తయారు చేస్తారని మనకు తెలుసు. ఇప్పుడు ఎల్‌నినో ప్రభావంతో వర్షం లేక, రాక ఉట్టి గాలి వీస్తున్నది కాబట్టి ఆ గాలిని ఉపయోగించుకోవడం ముఖ్యం. మేఘాలు కమ్ముకుంటాయి కాని వర్షం రాదు, ఎందుకంటే గాలి వచ్చి దాన్ని తన్నుకుపోతుంది. ఎక్కడో పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడిన మార్పులవల్ల ఇలా జరుగుతున్నదని శాస్త్రజ్ఞులు తేటతెల్లం చేశారు. దానివల్ల నైరుతి రుతుపవనాలవల్ల రావలసిన వర్షాలు రావడంలేదు. కొన్నేండ్ల క్రితం కృత్రిమ వర్షాలని ఆర్భాటం చాలా చేశారు కాని ఇప్పుడు ఈ ఎల్‌నినో వల్ల ఏర్పడ్డ, ఏర్పడుతున్న కరువు పరిస్థితుల్లో మేఘాల మీద పొడి చల్లి వర్షాలు ఎందుకు కురిపించడం లేదు? నాయకులు ఒకరినొకరు తిట్టుకోవడంలో, లేదా తమను తిట్టినవాళ్లకు శిక్షవేయడంలో ఉన్నంత స్పీడుగా ప్రజల గురించిన వాళ్ల ఆలోచనలు అంత వేగంగా పోవడం లేదని తెలుస్తూనే ఉంది.

ఈ ఎల్‌నినోకు కారణం భూమి వేడెక్కడం. యుద్ధాలు ఆగకుండా జరుగుతున్నాయి గోళమంతటా. ట్రంపుల వారు, నెతన్యాహు, పుతిన్, కొరెట్స్కి కూడా మనకు వర్షాలు లేకపోవడానికి కారణం కాగా చమురు ధరల్ని పెంచేసి ఆపై తిండిగింజల ధరల్నీ పెరిగేలా చేస్తున్నారు. ఇష్టదేవతా ప్రార్ధన చేసినట్టు వీళ్లని ఎప్పుడూ తిడుతూ ఉండవలసిందేనా అంటే అవుననే సమాధానం చెప్పుకోవలసి వస్తుంది. మనుషులు తమ శత్రువులను కూడా రోజూ తలచుకుంటారు. ఆ మాటలు గాలిలో కలసిపోయినా వాటికీ ప్రయోజనముంటుంది. ఐతే గాలిమాటల ద్వారా విద్యుత్తు పుట్టించవచ్చునో లేదో అన్న విషయం మీద కూడా శాస్త్రజ్ఞులు ప్రయోగాలు చేస్తే అటు కేంద్రం నుండి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్తు నిల్వలు పెరిగిపోయి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
గాలిని వాడుకోవడం మానవునికి మొదటినుండీ బాగా తెలుసు. గాలికి అనుకూలంగా తెరచాపలు ఎత్తడం దించడం ద్వారా పడవలు నడిపేవారు. తాము ప్రయాణం చేసేవైపు గాలి ఉంటే తెరచాపలు పైకి లేస్తాయి. లేదంటే కిందికి.

గాలి బెలూన్ల ద్వారా ప్రయాణాలు చేసేవాళ్లు విమానాలు రాకముందు. ఇక రైతులు కూడా పంట ఐపోయాక గాలివాటును బట్టి ధాన్యాన్ని పొట్టునుండి వేరుపరుస్తారు. ఇలా మనిషికి నీళ్లతో ఎంత సంబంధభాందవ్యాలున్నాయో గాలితో కూడా ఉన్నాయి. అసలు నీళ్ళంటే గాలే అని తరువాత కనుక్కున్నాడు నీళ్లలో ఉండేది ఆక్సిజను, హైడ్రోజను అని. మనుషుల పొట్టలు పెరిగిపోవడానికి కూడా గాలే అంటే గ్యాసే కారణమని డాక్టర్లు తెలిపారు. ఈ గ్యాసు తిండివల్ల అంటే ఎక్కువైనా తక్కువైనా రావచ్చు లేదా అది సహించకపోవడంవల్ల రావచ్చు. ఇంకొకరు బాగుపడుతుంటే కూడా కడుపులో గ్యాసు పేరుకుపోతుందని సినిమాల్లో చూస్తుంటాం. ఏమైనా ఈ గ్యాసును కూడా మనిషి వృధా చేస్తున్నాడని అనిపిస్తుంది. శాస్త్రజ్ఞులు దీనిపై కూడా దృష్టి పెట్టాలని ఒక గాలి కోరిక. పర్వత ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో, ఎత్తైన ప్రదేశాల్లో, కొన్ని మైదాన ప్రాంతాల్లో గాలి ఎక్కువగా వీస్తుంటుంది. సంక్రాంతి రోజుల్లో మనం గాలిపటాలు ఎగరేయడం కూడా ఈ గాలి ఎక్కువగా వీయడం వల్లనే. పర్వతాలు కరిగిపోతున్నాయ్, కొండలు తొలిచేస్తున్నారు. ఇకనుండి మామూలు గాలి కాకుండా హరికేన్, సిరాకో లాంటి గాలులొచ్చి ఇళ్లను వాహనాలను లేపేస్తాయి. కాబట్టి మనం పర్యావరణాన్ని గాలికి వదిలేయకూడదు. అసలు ఈ పవన విద్యుత్తు వల్లే మన పుష్పక విమానాలు నడిచాయని, కాదు కాదు అప్పటికే విద్యుత్తు బ్యాటరీల తో అది నడిచిందని ఇవన్నీ మనకు ముందే ఉన్నాయష అనేవాళ్లూ బయలు దేరవచ్చు. ఏమైనా గాలిమాటలతో విద్యుత్తు మాట అటుంచి విద్యుత్ ఘాతాలు తగిలి పదవులు ఊడిపోనూవచ్చు. అందుకే మాటలకు గాలి మాటలకూ తేడా తెలుసుకొని ప్రవర్తించాలి.

జంధ్యాల రఘుబాబు 9849753298

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -