Sunday, September 6, 2026
E-PAPER
Homeఎడిట్ పేజివ్యక్తిగత విభేదాలు, పదవీ వివాదాలు.. మరి విధానాలు?

వ్యక్తిగత విభేదాలు, పదవీ వివాదాలు.. మరి విధానాలు?

- Advertisement -

ఇటీవలి కాలంలో దేశంలోనూ మరీ ముఖ్యంగా తెలుగు రాష్ర్టాల రాజకీయాల్లో మార్పులూ చేర్పులూ ఆసక్తినే గాక ఆలోచననూ కలిగిస్తున్నాయి. పాలకపార్టీలలో కొందరు కీలక నాయకులూ, మంత్రులూ అటూ ఇటూ మారుతు న్నారు. ఫిరాయింపులపై కోర్టుల్లో కేసులే నడుస్తున్నాయి. తాము అధికారంలో వున్నప్పుడు ఇబ్బడిముబ్బడిగా ఇతరులను చేర్చు కున్నవారే ఇతరులకు నైతిక సూత్రాలు చెబుతున్నారు. బయటనుంచి వచ్చినవారికి పెద్దపీట వేస్తూ ఎప్పటినుంచో వున్న తమను విస్మరిస్తున్నారని నాయకులు ఫిర్యాదులతో వాపోతున్నారు. అత్యంత విధేయులుగా కుడిభుజాలుగా చలామణి అయిన వారే మాజీ బాస్‌‌లకు షాక్‌‌లిస్తున్నారు. వారూ అదేస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. పూర్వాశ్రమంలో అధికార యంత్రాంగంలో, పోలీసువ్యవస్థలో వుండి రకరకాల ముద్రలేయించుకున్న వారు తర్వాత అందుకు భిన్నంగా మాట్లాడుతూ ప్రజల్లోకి వస్తున్నారు. ఇక మీడియా కథనాలూ, వ్యాఖ్యానాలూ కూడా వార్త స్వభావం కోల్పోయి అటో ఇటో ప్రచారం ప్రధానమై పోతున్నది. మొత్తంగా పత్రికల ప్రాచుర్యం తగ్గుతున్నదంటుంటే మీడియా కూడా నిర్ణీత నిర్దేశిత అజెండాలతో నడుస్తున్నదని ‘బొద్దింకల’ తిరుగు బాటుతో సహా అన్ని సందర్భాల్లో రుజువువుతున్నది. స్థూల జాతీయో త్పత్తినీ, రేటింగును అంచనా వేసే సమయంలో మరింత వాస్తవికంగా వ్యవహరించాలని గౌతమ్‌ అదానీ బహిరంగంగా పిలుపునివ్వడం ఇందుకో తాజా వుదాహరణ మాత్రమే. ఇప్పుడు పార్టీలలో మార్పులు చేర్పులు, చేరికలూ నిష్క్రమణల వెనక కూడా నిర్దిష్ట ప్రభావాలున్నాయని సాధారణ ప్రజానీకం కూడా భావిస్తున్న పరిస్థితి. సరళీకరణ యుగంలో ప్రజాస్వామ్య వ్యవస్థ సారాన్ని దెబ్బతీసి కార్పొరేట్‌ ‌వాణిజ్య వర్గాల ప్రాబల్యమే రాజ్యమేలుతున్న తీరుకు ఇవన్నీ నిదర్శ నాలుగా భావించవలసి వుంటుంది.

వ్యక్తిగత తగాదాల చుట్టూనే..
ఈ మొత్తం పరిణామాలలో కొట్టచ్చినట్టు కనిపించే అంశమేమంటే నిష్క్రమణలూ చేరికలూ విడిపోవడాలూ కొత్త స్థాపనలూ కలయికలూ అన్నిట్లోనూ సామాజిక ప్రజా ఎజెండాలకన్నా వ్యక్తిగత వ్యవహారాలే ముందుకు రావడం. బీఆర్‌ఎస్‌ అధినేతపై కుటుంబంపై తిరుగుబాటు చేసిన కవిత, వైసీపీ నుంచి వైదొలగిన విజయసాయి రెడ్డి, రేవంత్‌ ‌రెడ్డి మంత్రివర్గం నుంచి తొలగించబడిన కొండా సురేఖ, కొంతమంది మాజీ అధికారుల నిర్ణయాలు ఏవి తీసుకున్నా వ్యక్తిగత విషయాలే ప్రధానంగా చెబుతున్నారు. సమాజం, రాజకీయాలు తర్వాత వస్తున్నాయి. రాజకీయ తేడాలు గాక వ్యక్తిగత కోణాలలో వస్తున్నారు గనకే తామెక్కడ ఏ విషయంలో విభేదించామో చెప్పలేకపోతున్నారు. పైగా తాము విశ్వసనీయంగా వున్నా అవతలివారే తమను అవమానించారని లేక తమను కాదని మరెవరినో ఎంచుకున్నారని ఆరోపిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే జానపద చిత్రాల్లోలాగా రాజు మంచివారే సేనాపతి మంత్రులదే తప్పు అని చెబుతున్నారు. దానికి తగినట్టే ఆయా పార్టీల నాయకులు కూడా విధానపరంగా ఖండించకండా వ్యక్తిగత దాడులు లేదా విశ్వాస ఘాతుకత అంటూ తిట్టిపోస్తున్నారు. వ్యక్తిగతంగా వారి వారి పదవులూ కోపతాపాలకు తోడు కుటుంబాల కథలూ వ్యథలూ మరీ ముఖ్యంగా మహిళలను కించపర్చే దుష్ర్పచారాలు వివాదాలుగా వీడియో ఆడియో లీకులతో ఆరోపణలూ అభాండాలే నిండి పోతున్నాయి. ముందే చెప్పిన మీడియా కూడా వారి వారి అనుబంధాలనూ ప్రయోజనాలను బట్టి అటోఇటో చిత్రిస్తూ తికమక పరుస్తున్నది. అవినీతి ఆరోపణలు, అక్రమ వ్యవహారాలు కూడా ఈ అనుబంధాలను బట్టి చూపించడం తప్ప విలువలు వాస్తవాలను బట్టి జరగడం లేదు.

ఉపాధి, ఉద్యోగాల కల్పన, వ్యవసాయం, ధరల పెరుగుదల, శాంతిభద్రతలు, సామాజిక వివక్ష, దేశ సార్వభౌమత్వం, ప్రపంచశాంతి వంటి ముచ్చట్లే మాయమైపోతున్నాయి, ఏమంటే వీరెవరూ పొరబాటున కూడా వాటి జోలికిపోరు. పైన చెప్పిన చాలా వివాదాలపై మీడియా హడావుడిలో పొరబాటునైనా జాతీయ అంతర్జాతీయ పరిణామాలు ప్రస్తావించడమే జరగదు. పైగా ఇప్పుడు మోడీ యుగంలో తిష్టవేసుకున్న మతతత్వ హిందూత్వ రాజకీయ భావజాలాన్నే రకరకాల మెలికలతో వినిపించి వీరతాడు వేసుకోవడానికి పాకులాడుతుంటారు. ఏమంటే తమపై వత్తిడి అంత తీవ్రంగా వుందంటారు. అవతలివారిని పోటీగా చూపించి సమర్థించుకుంటారు. అసలు మోడీకి ఎవరు ఎక్కువ దగ్గరనేదానిపైనా ఈ పార్టీల నేతల మధ్య గొప్పల పోటీ నడుస్తుంటుంది. కనకనే లౌకికతత్వం, సామాజిక న్యాయం ప్రజాస్వామ్యం వంటి పదాలు చాలామంది గొంతులో అసలు పలకవు. స్థానిక అధికార పోటీ ప్రయోజనాలే దృష్టిలో వుంచుకుని మోడీ సర్కారు పట్ల ప్రశంసలు లేదా మెతకదనం ప్రదర్శిస్తుంటారు. కాంగ్రెస్‌ ‌ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి మోడీని ‘బడే భాయ్‌’ అనడంపై చాలా చర్చ నడిచింది. ఇప్పుడాయన అసదుద్దీన్‌, అక్బరుద్దీన్‌ ఒవైసీలు కూడా మోడీ, అమిత్‌ ‌షాలలాగే దేశభక్తులని పాతబస్తీనుంచి ప్రకటించగానే కేంద్రమంత్రులు దాడి ఎత్తుకున్నారు. మతతత్వ రాజకీ యాలు ఏవైనా పొరబాటే. అయితే మతాన్ని దేశభక్తినీ కలగాపులగం చేయడం కూడా తప్పువుతుంది. కృత్రిమ వివాదాలకే ఇవన్నీ పనికి వస్తాయి.

అంతర్గత వ్యవహారాలపైనే..
కొండా సురేఖది తప్పా? అధిష్టానానికి తప్పా? అనేది వారి అంతర్గత అంశం. విజయసాయిరెడ్డి రైటా? సజ్జల రామకృష్ణారెడ్డి రైటా? ఎవరిపైన కేసులు పెట్టారు? ఎవరిపై ఎందుకు పెట్టలేదు ? అనేది కూడా వారి అంతర్గత వ్యవహారమే. కవిత కుటుంబానికి మధ్య జరిగిందేమిటన్నది, అసలు ప్రజలకు సంబంధించిన విషయమే కాదు. గతంలో పా లించిన ‌కేసీఆర్‌, జగన్‌ ప్రభుత్వాల విధానాల మంచి చెడ్డలూ, ప్రజలకు జరిగిన లాభనస్టాలు, ప్రజాస్వామ్య విధానాలు వాటిలో ఇప్పుడు రావలసిని మార్పులు సమాజానికి సంబంధించినవి. ఇప్పుడు పాలన చేస్తున్న చంద్రబాబు నాయుడు- పవన్‌ ‌కళ్యాణ్‌, రేవంత్‌ ‌రెడ్డి- భట్టి విక్రమార్క ప్రభుత్వాలకూ అదే వర్తిస్తుంది. వీరిలో ఎవరు ఎప్పుడు ఎవరికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు, ఏ పదవులు ప్రసాదించారు, ఏవి నిరాకరించారు, ఎప్పుడు ఏ తగాదాలు వారిని విడదీశాయి? వీటితో జనానికి సంబంధమేమిటి? రాజకీయ విమర్శలు, ఆరోపణల విషయానికి వస్తే వారేమి చేశారు, చేస్తున్నారనే దానిపై లేదా కేసులు ఆరోపణలపై న్యాయస్థానాలు నిర్ణయాలు తీసుకోవాలి.

వీటిని ఎడతెగని పంచాయితీలుగా మార్చి రోజుల తరబడి మీడియా చర్చలనూ రాజకీయ సంవాదాలను సాగదీసుకోవడంఅసలు చర్చను పక్కదోవ పట్టించడానికి కూడా కారణ మవుతుంటుంది. ఎందుకంటే వీరిలో చాలామంది అటూ ఇటూ ఎప్పుడైనా కలిసిపోతుంటారు. రూ.లక్షల కోట్ల విలువైన సంపదలూ సంస్థలను శాసించే అదానీలు అంబానీల పాత్ర అందరి వెనకా వుంటుంది. అసలు ఈ చర్చలలో చాలాభాగం వ్యాపార లావాదేవీలు, కుంభకోణాలలో మునిగితేలుతుంటుంది. కూరిమి కలదినములలో నేరములెన్నడు కలగనేరవు అన్నట్టు వారు వారు బాగున్నప్పుడు కప్పిపుచ్చుకుని తర్వాత మొత్తం దాడులు చేసుకుంటే ఎవరికైనా విలువేముంటుంది? ఆయా సర్కార్లలో కీలక అధికారులగా చక్రం తిప్పినవారు చాలా విషయాలు సోదాహరణంగా, సాధికారికంగా సమాచారాలు చెప్పగలరు. కానీ వారు విధానాల రీత్యా ప్రజల పక్షాన నిలవడం కీలకం. ఎందుకంటే ప్రపంచీకరణ యుగంలో కార్పొరేట్‌ ‌శక్తులే సర్కార్లను ఆడిస్తూ తమ ప్రయోనాల కోసం కథనాలు నడిపిస్తున్నాయి. భారత కార్పొరేట్‌ ‌సామ్రాట్‌ అదానీ గురించి అమెరికా మీడియాలో సాగిన వివాదం కేసులు తర్వాత కోర్టుల సాక్షిగా అంతా సర్దుకోవడం చూశాం.కనక ఇలాంటి సందర్భాలలోనూ విమర్శనాత్మకంగా వుండవలసిందే.

ప్రజల పక్షాన కృషి?
పర్యావరణ, ప్రజాస్వామ్య స్వేచ్ఛలు, ఎస్సీ,ఎస్టీ హక్కుల రక్షణ వంటి విషయాలలో కొంతమంది మాజీ ఉన్నతాధికారులు ప్రశంసనీయమైన భూమిక పోషించడం, పౌరసమాజంలో చొరవ చూపడం అభినందనీయం. లౌకిక ప్రజా స్వామిక భావాలకు నిబద్దులైన మరికొందరు ప్రముఖులు విశేషంగా శ్రమించి విషయాలను వెలికి తీస్తున్నారు. ప్రజాపక్ష మేధావుల పాత్ర పాలకులు జీర్ణించుకోలేకపోవడం, సోషల్‌ ‌మీడియాలో రకరకాల దాడులు చేయించడం కూడా పరి పాటిగా మారింది. అదే సమయంలో రాజకీయంగా తాము మితవాదం వైపు(రైట్‌) ‌వున్నామని ఎబి వెంకటేశ్వరరావు వంటివారు స్పష్టంగా చెప్పడం గమనించదగింది. సామాజిక న్యాయం, దళిత హక్కుల కోసం తాము రాజకీయాల్లోకి వస్తామని మరికొందరు ప్రకటిస్తున్నారు. వారివారి విధానాలను ఆచరణను చూడవలసే వుంటుంది. ఉదాహరణకు విజయసాయి రెడ్డి తాను మోడీ నాయకత్వాన్ని బలోపేతం చేస్తానని ప్రకటించారు. కాకినాడ సామూహిక ఆత్మహత్య ఘటనల్లో ‘లవ్‌ ‌జిహాద్‌’ ‌తీసుకొచ్చారు. ప్రపంచీకరణ గతం కన్నా ఎక్కువగా లాబీయింగ్‌‌ను కూడా ఒక పరిశ్రమగా తయారు చేసిన తీరు ప్రశాంతకిశోర్‌ వంటి మార్కెట్‌ ‌వ్యూహకర్తలు ప్రత్యక్షంగా చూపించారు.
ఇప్పుడు వివిధ స్థాయిల్లో అది విస్తరిస్తున్నది. వచ్చే ఎన్నికల్లోగా ఇంకా అనేక వేదికలూ వ్యవస్థలూ పుట్టుకు రావచ్చు. సర్వేలూ, జనాభిప్రాయాలు వాటిపై చర్చలతో ప్రభావాలూ కూడా పెరుగుతాయి. తమిళనాడులో సంచలన విజయం సాధించిన ముఖ్యమంత్రి విజయ్‌ ‌సర్వేలలో కాస్త రేటింగు పెంచుకున్నారని తెలియగానే కాంగ్రెస్‌ ‌భరించలేక పోయింది.

సిజెపి నాయకులపై ఆరోపణలతో అప్పుడే సిజెడి(డి)అంటూ పుట్టుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఏ పరిణామాన్ని, ఏ సమయంలో ఏ కోణంలో చూడాలన్న విచక్షణ చాలా ముఖ్యం. న్యాయవ్యవస్థ కూడా చాలా సందర్భాలలో విమర్శలకు గురైనా ఇటీవలి సంచలనాలు ఊహ కందనివి. ఒక పాఠ్య పుస్తకంలో న్యాయవ్యవస్థ అవినీతి గురించి ప్రస్తావించినందుకు సిజెఐ సూర్యకాంత్‌ ‌తీవ్రంగా స్పందించారు. కానీ, రాజస్థాన్‌ ‌హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిపై సుప్రీం కోర్టున్యాయమూర్తి ఆరోపణలు చేయడం, ఆయన్ను తప్పించడం తర్వాత మళ్లీ ఎదురుదాడి చూస్తున్నాం. ఎన్నికల సంఘం ఓటు హక్కుపైనే దాడి చేస్తూ కోట్ల ఓట్లు హరిస్తున్నది. సుభాష్‌ ‌చంద్రకు వేల కోట్ల అప్పు అప్పనంగా మాఫీ చేస్తే న్యాయమూర్తులే ఆపాల్సి వచ్చింది. ఇవి వ్యవస్థాగత సంక్షోభాలకు మచ్చుతునకలు. నయా ఫాసిస్టు తరహా రాజ్యం భావ ప్రకటనా స్వేచ్ఛపైనా దాడులు, అణచివేతలు సాగిస్తున్నప్పుడు విశాలమైన ప్రజాస్వామిక సమీకరణ అత్యంత ప్రధానమైంది. మీడియావరణాన్ని శాసిస్తూ సోషల్‌ ‌మీడి యాలను కూడా నడిపిస్తూ తమ మాటే చలామణి చేసుకోవాలనుకున్న పాలకులను వాస్తవాలతో ఎదుర్కోవడానికి అలాంటి విశాలత చాలా దోహదకారి అవుతుంది. అయితే విశాలత విమర్శనా కోణం నాణేనికి రెండు ముఖాల వంటివని ఈ పరిణామాలు చెబుతాయి.

తెలకపల్లి రవి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -