మహిళా బిల్లును ఎవరు వ్యతిరేకిస్తున్నారో మోడీ చెప్పాలి : ప్రియాంకగాంధీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్లకు సంబంధించి రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు-2026, డీలిమిటేషన్ (పునర్విభజన) బిల్లు-2026, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లులపై నేడు (శుక్రవారం) సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ జరగనుంది. ఈ బిల్లులపై జరిగిన చర్చలో టీడీపీ తరపున ఎంపీ బైరెడ్డి శబరి, జనసేన తరుపున తంగెళ్ల ఉదరు శ్రీనివాస్ పాల్గొని బిల్లులకు మద్దతు ఇచ్చారు. డీలిమిటేషన్ తరువాత తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న లోక్‌సభ సీట్లు 17 నుంచి 26కు పెరుగుతాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. అదే విధంగా ఏపీలో ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానాలు 25 నుంచి 38కి పెరుగుతాయని అన్నారు. ఇక, తమిళనాడులో 39 నుంచి 59కి, కర్ణాటకలో 28 నుంచి 42కి, కేరళలో 20 నుంచి 30కి సీట్లు పెరుగుతాయన్నారు. మొత్తంగా 50 శాతం సీట్లు పెరుగుతాయని వెల్లడించారు. దక్షిణాది జనాభా శాతం కంటే సీట్లు ఎక్కువగా పెరుగుతాయని అమిత్ షా చెప్పారు. విపక్షాలు అబద్ధాలు చెబుతూ ప్రజలను అనవసరంగా ఆందోళనకు గురి చేస్తున్నాయన్నారు. అన్ని ప్రాంతాలకూ సమాన న్యాయం జరుగుతుందని చెప్పారు.
మహిళా బిల్లును ఎవరు వ్యతిరేకిస్తున్నారో మోడీ చెప్పాలి : ప్రియాంక గాంధీ
మహిళా రిజర్వేషన్ బిల్లును ఎవరు వ్యతిరేకిస్తున్నారో ప్రధాని మోడీ చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా ప్రశ్నించారు. ప్రధాని మోడీ చేసిన ప్రసంగాన్ని తప్పుపట్టిన ఆమె.. అందులో జవహర్లాల్ నెహ్రూ పేరు వినిపించకపోవడం గమనార్హం అని అన్నారు. మహిళల హక్కుల పట్ల బీజేపీ నేతలే ఛాంపియన్లుగా భావిస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు. ‘మోడీ ప్రసంగంలో నెహ్రూ పేరు వినిపించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. రిజర్వేషన్లపై 2018లోనే ప్రధాని నరేంద్ర మోడీకి రాహుల్ గాంధీ లేఖ రాశారు. 2019లోపే రిజర్వేషన్లు అమలు చేయాలని రాహుల్ కోరారు.
ప్రధాని మోడీ సగం సమాచారం మాత్రమే వెల్లడించారు. ఇప్పుడు ప్రధానంగా రిజర్వేషన్ల కోటాపై చర్చ కాదు.. లోక్‌సభ సీట్లను 850కి పెంచడంపైనే. మోడీ ప్రభుత్వం లోక్‌సభ సీట్ల పెంపుపైనే ఆసక్తి కనబరుస్తోంది. ఆ విషయంలో ప్రభుత్వానికి అంత తొందరెందుకు?’ అని ప్రశ్నించారు. ‘మహిళా రిజర్వేషన్ బిల్లును ఎవరూ వ్యతిరేకించలేదు. రాహుల్ స్వయంగా మోడీ దగ్గరకు వెళ్లి మరీ మద్దతు తెలిపారు. ఆ బిల్లుపై క్రెడిట్‌ను మోడీ.. కాంగ్రెస్‌కు ఇవ్వలేదు. బిల్లు విషయంలో మహిళలను బీజేపీ తప్పుదోవ పట్టిస్తోంది. మహిళా బిల్లును ఎవరు వ్యతిరేకిస్తున్నారో మోడీ చెప్పాలి. కులగణనకు ఆయన ఎందుకు భయపడుతున్నారు? ఓబీసీలకు న్యాయం జరగాలి.. వారి హక్కులను ఎవరూ కాలరాయలేరు’ అని పేర్కొన్నారు. బిల్లులపై జరిగిన చర్చలో ఇప్పటివరకు 32 మంది వివిధ పార్టీల ఎంపీలు పాల్గొన్నారు.
బిల్లులపై నేడు ఓటింగ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



