– డీలిమిటేషన్‌పై సీఎం
– ఈనెలాఖరులో హైదరాబాద్‌లో నిర్వహణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అసంబద్ధమైన నియోజకవర్గాల పునర్ విభజన, డీలిమిటేషన్‌ను వ్యతిరేకిస్తూ దక్షిణాది రాష్ట్రాల గొంతుకను వినిపించాలని అధికార కాంగ్రెస్ నిర్ణయించింది. ఆయా రాష్ట్రాల నేతలతో ఈనెలాఖరులో హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభకు ఆ పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఏర్పాట్లు చేపట్టాలంటూ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు జరిగే నష్టాన్ని వివరిస్తూ ముఖ్యమంత్రి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, కర్నాటక, కేరళ, తమిళనాడు సీఎంలకు లేఖలు రాసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో బహిరంగ సభకు రావాలంటూ వారికి వర్తమానం పంపాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఇదే అంశంపై చర్చించి, కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలను తిరస్కరిస్తూ కార్యాచరణ చేపట్టేందుకు వీలుగా ఆయన ఏఐసీసీ పెద్దలతో సమాలోచనలు జరిపారు. ఇందుకోసం బుధవారం ఢిల్లీ వెళ్లిన సీఎం… గురువారం వరకూ అక్కడే ఉండనున్నారు. కాగా గత పార్లమెంటు ఎన్నికల సమయంలో బీజేపీ, ఆరెస్సెస్‌నుద్దేశించి సీఎం చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. కమలం పార్టీకి పార్లమెంటులో ఎక్కువ సీట్లు కట్టబెడితే అది రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తుందని, రిజర్వేషన్లను ఎత్తేస్తుందని ఆయన హెచ్చరించారు. అదే తరహాలో ఇప్పుడు డీలిమిటేషన్ అంశాన్ని తీవ్ర స్థాయిలో చర్చనీయాంశం చేయాలని సీఎం భావిస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. దీనికి తెలంగాణ నాయకత్వం వహిస్తే… ఇటు ప్రభుత్వానికి, అటు పార్టీకి ఉపయుక్తంగా ఉంటుందనేది ఆయన వ్యూహంగా కనడడుతున్నది. అందువల్లే వీలైనంత త్వరగా కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ (పీఏసీ)ని నిర్వహించి, ఆ సమావేశంలో కార్యాచరణ ప్రకటించాలని పీసీసీ చీఫ్‌నకు సీఎం సూచించారు. డీలిమిటేషన్‌పై గతేడాది మార్చిలో తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన చెన్నైలో దక్షిణాది రాష్ట్రాల సమావేశాన్ని నిర్వహించిన విషయం విదితమే. ఆ భేటీకి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకాగా.. బీఆర్‌ఎస్ తరపున ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పాల్గొన్నారు. తదుపరి సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహించాలని ఆ సందర్భంగా తీర్మానించారు. అందులో భాగంగానే ఈనెలాఖరులో ఇక్కడ బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించారు. ఒకవేళ ఏదైనా కారణం వల్ల ఈనెలలో నిర్వహించలేకపోతే మే మొదటి వారంలోనైనా ఆ మీటింగును ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ సభ తర్వాత ఇతర దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఇలాంటి మీటింగులు ఏర్పాటు చేయాలంటూ అక్కడి ప్రభుత్వాలను కోరాలని టీపీసీసీ నిర్ణయించినట్టు సమాచారం.
దక్షిణాది నేతలతో భారీ బహిరంగ సభ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



