– వరి నాట్లు వేసి, చీపుర్లు పట్టి బీఆర్‌ఎస్ వినూత్న నిరసన
– కాంగ్రెస్ వేయి రోజుల పాలనపై ఆగ్రహం
నవతెలంగాణ – అశ్వారావుపేట
గ్రామాల్లో పారిశుధ్యం అధ్వానంగా మారిందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వేయి రోజులు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఏడు రోజుల నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం అశ్వారావుపేట మండలం ఆసుపాక గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
బీఆర్‌ఎస్ మండల నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనలో గ్రామంలోని ప్రధాన రోడ్డుపై వరి నాట్లు వేసి తమ నిరసనను తెలిపారు. గ్రామంలోని వీధులు బురదమయంగా మారాయని, రోడ్లు చెరువులను తలపిస్తున్నాయని నాయకులు విమర్శించారు. అనంతరం చీపుర్లు చేతబట్టి రోడ్లను శుభ్రం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని, పారిశుధ్య నిర్వహణను నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. పారిశుధ్యం సక్రమంగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. గ్రామాల్లో పారిశుధ్య సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో నాయకులు డాక్టర్ ఉదయజ్యోతి, భూక్యా ప్రసాద్, కాసాని పద్మ, చంద్రమోహన్, జుజ్జురపు శ్రీరామమూర్తి, సత్యవరపు సంపూర్ణ, శెట్టిపల్లి రఘురామ్,మోటూరి మోహన్, కౌలూరి నరేష్,నల్లపు రామారావు, సున్నం రామలక్ష్మయ్య, కొనకళ్ల శ్రీనివాస్, మొద్దు మరియమ్మ తదితరులు పాల్గొన్నారు.



