తెలంగాణ సిలికాన్ ఫోటోనిక్స్ మిషన్’కు వ్యూహాత్మక రోడ్‌మ్యాప్‌ను రూపొందించడంపై చర్చ
నవతెలంగాణ – మల్హర్ రావు
నీతి ఆయోగ్ సభ్యుడు డా. వీకే సారస్వత్ ఆదివారం డా. బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.సిలికాన్ ఫోటోనిక్స్ రంగంలో ఉన్న అవకాశాలను తెలంగాణ అందిపుచ్చుకునేలా ‘తెలంగాణ సిలికాన్ ఫోటోనిక్స్ మిషన్’కు దశలవారీ వ్యూహాత్మక రోడ్‌మ్యాప్‌ను రూపొందించడంపై ప్రధానంగా చర్చించారు.ఫోటోనిక్స్ వ్యాలీ కార్పొరేషన్ భవిష్యత్ కార్యాచరణ,ఇండియా సెమీకండక్టర్ మిషన్–2.0తో ‘తెలంగాణ సిలికాన్ ఫోటోనిక్స్ మిషన్’ను అనుసంధానించేందుకు గల అవకాశాలపై సమీక్షించారు.
రాష్ట్రంలో పరిశోధన నుంచి వాణిజ్య స్థాయి తయారీ వరకు సమగ్ర సిలికాన్ ఫోటోనిక్స్ ఎకోసిస్టమ్ అభివృద్ధి చేయడం, డిజైన్, పరిశోధన, తయారీ, ప్యాకేజింగ్, టెస్టింగ్, సరఫరా వ్యవస్థలను అనుసంధానించడంపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. పరిశోధన ఫలితాలను వాణిజ్యపరమైన సాంకేతిక పరిష్కారాలు, ఉత్పత్తులుగా మలిచేలా పరిశ్రమలు, విద్యాసంస్థలు, పరిశోధనా సంస్థల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. రాబోయే రోజుల్లో అధునాతన ఫోటోనిక్ ప్యాకేజింగ్, కో-ప్యాకేజ్డ్ ఆప్టిక్స్ లాంటి తదుపరి తరం సాంకేతికతల్లో తెలంగాణను కీలక కేంద్రంగా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు వివరించారు.అందుకు అనుగుణంగా నిపుణులు, పరిశోధనా సంస్థలు, పరిశ్రమలతో కలిసి సమగ్ర కార్యచరణ ప్రణాళికను రూపొందించడంపై ఇప్పటి నుంచే దృష్టి సారించామన్నారు.
త్వరలో ఏర్పాటు చేయనున్న ‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇన్ క్వాంటం కంప్యూటింగ్’లో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని డా. వీకే సారస్వత్‌ను మంత్రి శ్రీధర్‌బాబు ఆహ్వానించారు. ఫోటోనిక్స్, క్వాంటం కంప్యూటింగ్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే అడ్వైజరీ కౌన్సిల్‌కు నేతృత్వం వహించాలని కూడా కోరారు. ఫోటోనిక్స్, క్వాంటం కంప్యూటింగ్ లాంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో తెలంగాణతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని డా.వీకే సారస్వత్ పేర్కొన్నారు. ఈ రంగాల్లో పరిశోధన, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు తనవంతు సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తానన్నారు. సమావేశంలో ఐటీఈ&సీ సంయుక్త కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి, ఫోటోనిక్స్ వ్యాలీ కార్పొరేషన్ సీఈవో ఏఎస్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.



