Tuesday, September 8, 2026
E-PAPER
Homeజాతీయంవృద్ధాశ్రమాలపై తాజా సమాచారం కావాలి

వృద్ధాశ్రమాలపై తాజా సమాచారం కావాలి

- Advertisement -

నాలుగు వారాల్లోగా స్టేటస్‌ రిపోర్ట్‌‌లు ఇవ్వండి
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సుప్రీం ఆదేశాలు
న్యూఢిల్లీ :
దేశవ్యాప్తంగా గల వృద్ధాశ్రమాల సంఖ్య, వాటి వివరాలు, అలాగే సీనియర్‌ ‌సిటిజన్‌‌లకు అందుబాటులో వున్న సదుపాయాల గురించి తాజా స్టేటస్‌ ‌రిపోర్ట్‌‌లను దాఖలు చేయాల్సిందిగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీం కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది.
నాలుగు వారాల్లోగా తాజా సమాచారాన్ని అందచేయాలంటూ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అడ్బకేట్స్‌ ‌జనరల్‌‌కు, స్టాండింగ్‌ ‌కౌన్సిళ్ళకు ఈ ఆదేశాల గురించి తెలియచేయాలని చీఫ్‌ ‌జస్టిస్‌ ‌సూర్యకాంత్‌ ‌నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణిని కోరింది.
కేంద్ర మాజీ మంత్రి, సీనియర్‌ ‌న్యాయవాది అశ్విని కుమార్‌ ‌వృద్ధుల సంక్షేమం గురించి ముఖ్యంగా దారిద్ర్య రేఖకు దిగువున జీవిస్తూ, సరైన వసతి, ఆహారం, వైద్య సంరక్షణ లేని వారి గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ 2016లో దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల పిటిషన్‌‌ను బెంచ్‌ ‌విచారించింది. వృద్ధులు గౌరవంగా జీవించడానికి వీలుగా తగినన్ని వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయాలని ఆ పిటిషన్‌ ‌కోరుతోంది.
దేశంలో వృద్ధాశ్రమాలు ఎన్ని వున్నాయి, వారికి వచ్చే పెన్షన్‌, వారికి అందుబాటులో వున్న వైద్య సంరక్షణ వంటి అంశాలకు సంబంధించి పూర్తి వివరాలను అందచేయాల్సిందిగా గతంలో కేంద్ర ప్రభుత్వం కోరిందని, కానీ ఇంకా రాలేదని విచారణ సందర్భంగా కుమార్‌ ‌పేర్కొన్నారు. త్వరితగతిన విచారణ జరపాలని పలుసార్లు అభ్యర్ధించినప్పటికీ 2022 నుండి ఈ అంశం విచారణకు రాలేదని ఆయన పేర్కొన్నారు.
దీనిపై కేంద్రం తరపు న్యాయవాది మాట్లాడుతూ, పర్యవేక్షణ నిమిత్తం ఈ ప్రొసీడింగ్స్‌‌ను ఆయా రాష్ట్రాల హైకోర్టులకు బదిలీ చేయాలని సూచించారు. ఆ సూచనను కుమార్‌ ‌వ్యతిరేకించారు. సుప్రీం కోర్టే ఈ ప్రొసీడింగ్స్‌‌ను పర్యవేక్షణను కొనసాగించాలని వాదించారు. దేశవ్యాప్తంగా అమలయ్యేలా తీసుకోవాల్సిన నిర్ణయం ఇదని, హైకోర్టులకు వదిలిపెట్టరాదని అన్నారు.
సుప్రీం కోర్టు విస్తృత మార్గదర్శకాలను రూపొందించినా వాటి అమలును అంతిమంగా హైకోర్టులే పర్యవేక్షించాల్సి వుంటుందని చీఫ్‌‌జస్టిస్‌ ‌పేర్కొన్నారు. ఈ ప్రొసీడింగ్స్‌‌ను ఎవరు పర్యవేక్షించాలనేది నిర్ణయించడానికి ముందుగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి ఆధునీకరించిన సమాచారం అందాలని బెంచ్‌ ‌పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -