సెప్టెంబర్ 10లోపు ఆన్లైన్ నమోదు తప్పనిసరి
– ఏఈఓ శివకుమార్
నవతెలంగాణ – ఆలేరు రూరల్
రాష్ట్ర ప్రభుత్వం సన్న వరి సాగును ప్రోత్సహించేందుకు ఎంపిక చేసిన ఏడు రకాల సన్న వరి ధాన్యానికి కొనుగోలు సమయంలో క్వింటాలుకు రూ.500 బోనస్ అందజేయనున్న నేపథ్యంలో రైతులు విత్తనాల వివరాలను తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని కొలనుపాక వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) శివకుమార్ తెలిపారు. ఈ నమోదు ప్రక్రియను సెప్టెంబర్ 10వ తేదీలోపు పూర్తి చేసుకోవాలని సూచించారు.
ప్రభుత్వం ఎంపిక చేసిన బీపీటీ–5204, ఆర్ఎన్ఆర్–15048 (తెలంగాణ సోనా), హెచ్ఎమ్టీ సోనా, డబ్ల్యూజీఎల్–44 (సిద్ధి), కేఎన్ఎమ్–1638, కేఎన్ఎమ్–7715, జైశ్రీరాం సన్న వరి రకాలను సాగు చేస్తున్న రైతులు విత్తనాలు కొనుగోలు చేసిన డీలర్ షాపుకు వెళ్లి తమ విత్తనాల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయించుకోవాలని శివకుమార్ కోరారు.రైతులు పట్టాదారు పాస్బుక్, మొబైల్ నంబర్ వెంట తీసుకెళ్లి డీలర్ వద్ద నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలన్నారు. డీలర్ వద్ద విత్తనాలు కొనుగోలు చేయకుండా వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, పరిశోధనా కేంద్రాల నుంచి విత్తనాలు పొందిన వారు,అలాగే సొంత విత్తనంతో సన్న వరి సాగు చేస్తున్న రైతులు కూడా స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని వ్యవసాయ శాఖ అధికారులకు సమర్పించి సన్న ధాన్యం సాగు వివరాలను నమోదు చేయించుకోవచ్చని తెలిపారు.



