Wednesday, September 9, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంరిపబ్లికన్లకు అగ్నిపరీక్షే !

రిపబ్లికన్లకు అగ్నిపరీక్షే !

- Advertisement -

అధికార పార్టీకి శాపంగా మారుతున్న ట్రంప్‌ నిర్ణయాలు
మధ్యంతరంలో మెజారిటీ అసాధ్యమంటున్న పరిశీలకులు

వాషింగ్టన్‌ : అమెరికాలో మధ్యంతర ఎన్నికలకు మరో రెండు నెలలు మాత్రమే సమయం ఉండడంతో ప్రచార హోరు ఉధృతమవుతోంది. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యవహార శైలి, ఆయన అనుసరిస్తున్న విధానాలపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో రిపబ్లికన్ల విజయావకాశాలు ప్రమాదంలో పడుతున్నాయి. కాంగ్రెస్‌లో ఇప్పటికే స్వల్ప ఆధిక్యతతో నెట్టుకొస్తున్న రిపబ్లికన్లకు ఈ ఎన్నికలు నిజంగా అగ్నిపరీక్షే. మధ్యంతర ఎన్నికలు అంటే దేశాధ్యక్షుడి పనితీరుపై ప్రజలు ఇచ్చే తీర్పు అని నిపుణుల అభిప్రాయం. ఒకవేళ ప్రతినిధులసభలో డెమొక్రాట్లకు మెజారిటీ లభిస్తే ట్రంప్‌ పాలనపై దర్యాప్తు చేపట్టే అవకాశం ఉంది. ట్రంప్‌ అవినీతిపై విచారణ జరుపుతామని ఆ పార్టీ నేతలు ఇప్పటికే ప్రకటించారు. డెమొక్రాట్లకు మెజరిటీ వస్తే ట్రంప్‌ ఒంటెత్తు పోకడలకు బ్రేక్‌ పడుతుంది. అనేక చట్టాల విషయంలో శ్వేతసౌధం రాజీపడాల్సి వస్తుంది.

అనూహ్య ఫలితం తప్పదా ?
సెనెట్‌పై ఆధిపత్యం కోసం డెమొక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఫలితం అనూహ్యంగా ఉండవచ్చునని చెబుతున్నారు. ఒకవేళ సెనెట్‌లో డెమొక్రాట్లకు మెజారిటీ వస్తే సుప్రీంకోర్టులో ఖాళీ అయ్యే న్యాయమూర్తుల నియామకంతో పాటు ట్రంప్‌ నామినీలను చాలా వరకూ అడ్డుకునే అవకాశం ఉంది. రాయిటర్స్‌/ఇప్సోస్‌ తాజా సర్వే ప్రకారం ఇరాన్‌ యుద్ధం, ఆర్థిక వ్యవస్థ పనితీరుపై చాలా మంది తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో ట్రంప్‌ రేటింగ్‌ అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయింది. 2018లో డెమొక్రాట్లు ప్రతినిధులసభలో 40 సీట్లు గెలుచుకున్నారు. అప్పటితో పోలిస్తే ప్రస్తుతం ట్రంప్‌పై వ్యతిరేకత దాదాపు రెట్టింపైంది. రిపబ్లికన్లతో పోలిస్తే డెమొక్రాట్లు ఓటింగ్‌పై బాగా ఆసక్తి కనబరుస్తున్నారు. ఇటీవలి ప్రైమరీ ఎన్నికలలో ఈ విషయం స్పష్టమైంది. రిపబ్లికన్‌ అభ్యర్థులతో పోలిస్తే డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థులే ఐదు శాతం పాయింట్ల ఆధిక్యతలో ఉన్నారని చెబుతున్నారు.

ఆ నాలుగు రాష్ట్రాలే కీలకం
1938 నుంచి అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికలలో రెండు సందర్భాలలో తప్ప మిగిలిన అన్ని ఎన్నికలలోనూ అధ్యక్షుడి పార్టీ ప్రతినిధులసభలో తన బలాన్ని కోల్పోయింది. ప్రతినిధులసభలో ప్రస్తుతం రిపబ్లికన్లకు 218, డెమొక్రాట్లకు 214 మంది సభ్యులు ఉన్నారు. నవంబర్‌ 3వ తేదీన ప్రతినిధులసభలోని మొత్తం 435 స్థానాలకు, సెనెట్‌లోని వంద స్థానాలలో సుమారు మూడింట ఒక వంతు సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. తీవ్రమైన పోటీ ఉన్న జార్జియా, మైనే, మిచిగాన్‌, నార్త్‌ కరోలినాలో డెమొక్రాట్లు మెజారిటీ సెనెట్‌ స్థానాలను గెలుచుకున్నప్పటికీ 2024 ఎన్నికలలో ట్రంప్‌కు మంచి మెజారిటీ ఇచ్చిన అలాస్కా, లోవా, ఒహియో, టెక్సాస్‌ రాష్ట్రాలలో వారు కనీసం రెండింటిని గెలుచుకోవాల్సి ఉంటుంది. డెమొక్రాట్లను సోషలిస్టులుగా, కమ్యూనిస్టులుగా రిపబ్లికన్లు చిత్రీకరిస్తున్న విషయం తెలిసిందే. మిచిగాన్‌లో ప్రగతిశీల డెమొక్రటిక్‌ అభ్యర్థి అబ్దుల్‌ ఎల్‌-సయీద్‌ అభ్యర్థిత్వాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. లోవాలో పెరుగుతున్న ఇంధన ధరలు, ట్రంప్‌ సుంకాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. అదే సమయంలో విదేశీ గొడ్డు మాంసంపై దిగుమతి పన్నును ఎత్తివేయాలన్న ట్రంప్‌ నిర్ణయంపై టెక్సాస్‌లోని పశువుల పెంపకందారులు మండిపడుతున్నారు. పొరుగు దేశమైన కెనడాతో జరుగుతున్న వాణిజ్య యుద్ధం మిచిగాన్‌, మైనే రాష్ట్రాలకు నష్టం కలిగించే అవకాశం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -