Wednesday, September 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనిబంధనలు అందరికీ సమానం

నిబంధనలు అందరికీ సమానం

- Advertisement -

సభా నియమాలను అందరికీ అమలు చేయాలి
ఇకనైనా ప్రజాసమస్యలపై చర్చించాలి : అసెంబ్లీలో ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్‌ ఒవైసీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

వివక్ష లేకుండా శాసనసభ నియమాలను పటిష్టంగా అమలు చేయాలని ఎంఐఎం పక్షనేత ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ఒవైసీ అన్నారు. నిబంధనలు అధికార, విపక్ష సభ్యులందరికీ సమానమేనని చెప్పారు. మంగళవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సభాపతి స్థానాన్ని అవమానించడం అంటే ప్రజాస్వామ్య వ్యవస్థను, శాసనసభను అవమానించడమేనని స్పష్టం చేశారు. స్పీకర్ స్థానంలో ఎవరు కూర్చున్నా ఆ కుర్చీకి ప్రతి ఒక్కరూ గౌరవం ఇవ్వాలన్నారు. జరిగిన ఘటన ఏమాత్రం క్షమించరానిదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డి ప్రవర్తించిన తీరుపై ఆ పార్టీ అధినేత కేసీఆర్ బాధ్యత వహించి స్పీకర్‌కు, రాష్ట్రంలోని తల్లులందరికీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పడే ఈ వివాదం సద్దుమనుగుతుందన్నారు. బీఆర్‌ఎస్‌ మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల చర్యను ఆయన ఖండించారు. మహిళలను గౌరవించాలనీ, వాళ్లు తన సోదరీమణుల్లాంటివారని అన్నారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీకి ఒక న్యాయం, బీజేపీకి, కాంగ్రెస్‌‌కు మరో న్యాయం ఉండకూడదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు న‌ల్ల‌ని టీష‌ర్టులు, వాటిపై ఏదో రాసి ఉంద‌నే కార‌ణంతో వారిని స‌భ‌లోకి అనుమ‌తించ‌లేదనీ, మ‌రి బీజేపీ స‌భ్యులు ప్ల‌కార్డులను, కాంగ్రెస్‌ ‌సభ్యులు పోటోలను ప్ర‌ద‌ర్శించ‌డాన్ని ఎందుకు అనుమ‌తించార‌ని నిల‌దీశారు. సభలో అందరికీ సమాన న్యాయం, సమాన నిబంధనలు ఉండాలన్నదే తమ అభిప్రాయమని స్పష్టం చేశారు. సభా నియమాలను పక్షపాతం లేకుండా అమలు చేయాలని కోరారు. ఈ వివాదాలకు ముగింపు పలికి సభా సమయం వృధా చేయకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతుల సమస్యలు, నీటి సమస్యలు, ఆరోగ్యశ్రీ బకాయిలు, పీఆర్సీ, మైనార్టీల సమస్యలు తదితర ప్రజా ప్రాధాన్యత అంశాలపై అసెంబ్లీలో చర్చ జరపాలని ఆయన సూచించారు.

భాషపైనా చర్చ జరగాలి : కూనంనేని
శాసన సభ్యులు వాడే భాషపైనా చర్చ జరగాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ కన్నీళ్లు పెట్టుకోవడం తనను ఎంతో బాధించిందని ‌చెప్పారు. ప్రజాప్రతినిధులు సభలో వ్యక్తిగత దూషణలకు దిగడం, అనుచిత భాష ఉపయోగించడం సరైన పద్ధతి కాదన్నారు. అమ్మను తిట్టే హక్కు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. హరీశ్‌రావు వంటి నేతలు చొక్కా విప్పడం హా‌స్యాస్పదమన్నారు. పొడవు, మరుగుజ్జు అంటూ వ్యక్తిగతంగా మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ జరగాల్సిన అసెంబ్లీలు వ్యక్తిగత విమర్శలతో అగౌరవ సభలుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాతా మధు మాట్లాడిన భాష చాలా అభ్యంతరకరంగా ఉందన్నారు. మాట్లాడిన తర్వాత ‘మీరు భావిస్తే’ అంటూ సమర్థించుకోవడం సరికాదని పేర్కొన్నారు. తప్పు జరిగిందని స్పీకర్‌ ‌ముందు అంగీకరించాల్సిందన్నారు. ఇది వరకు పుచ్చలపల్లి సుందరయ్య, తరిమెల నాగిరెడ్డి, వావిలాల గోపాలకృష్ణయ్య, వెంకయ్యనాయుడు లాంటి వాళ్లు సభను నడిపిన తీరును నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలి : విప్ ఆది శ్రీనివాస్
కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి క్షమాపణ చెప్పాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రేరేపితంగానే బీఆర్ఎస్ నేతల నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వచ్చాయని ఆరోపించారు. స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యల అంశం కేవలం రాజకీయ వివాదం కాదనీ, ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని అన్నారు. మరోవైపు తమను కొట్టారంటూ నిన్న కొందరు బీఆర్ఎస్ నేతలు అబద్దపు బ్యాండేజీలు కట్టుకున్నారని ఆరోపించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -