టీడబ్ల్యూజేఎఫ్, హెచ్‌యూజే నేతలతో స్పీకర్ ప్రసాద్ కుమార్
ఎమ్మెల్సీ వ్యాఖ్యల నేపథ్యంలో ఫెడరేషన్ నేతల సంఘీభావం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
శాసనసభ లాబీల్లో మీడియా ప్రతినిధులకు ఎటువంటి ఆంక్షలు ఉండబోవనీ, గతంలో మాదిరిగానే లాబీల్లో మీడియా రాకపోకలు సాగించవచ్చని శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ స్పష్టం చేశారు. మంగళవారం అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్), హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ్ యూజే) ప్రతినిధి బృందం స్పీకర్‌ను మర్యాదపూర్వకంగా కలిసింది. స్పీకర్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీల అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ కు సంఘీభావం ప్రకటించారు. అసెంబ్లీ లాబీల్లోకి మీడియాను రానివ్వరనే ప్రచారం జరుగుతోందని ఫెడరేషన్ నేతలు స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా కవరేజ్ సమయంలో మీడియాకు ఎదురవుతున్న పలు సమస్యలను ఆయనకు వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన స్పీకర్ ప్రసాద్ కుమార్.. లాబీల్లో మీడియాపై ఆంక్షలు విధించే ఆలోచన లేదని తేల్చిచెప్పారు. గతంలో ఏ విధంగా ఉందో, ఇప్పుడు కూడా అదే పద్ధతి కొనసాగుతుందని స్పష్టం చేశారు. జర్నలిస్టులకు అసెంబ్లీలో ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే.. వాటిని పరిష్కరిస్తానని ఫెడరేషన్ నేతలకు ఆయన హామీనిచ్చారు.స్పీకర్‌ను కలిసిన వారిలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య, హెచ్‌యూజే అధ్యక్షుడు బి. అరుణ్ కుమార్, ఫెడరేషన్ ఉపాధ్యక్షులు బట్టిపాటి రాజశేఖర్, కార్యదర్శి గండ్ర నవీన్, హెచ్‌యూజే నాయకులు ప్రదీప్, తదితరులు ఉన్నారు.
అసెంబ్లీ లాబీల్లో మీడియాకు ఎలాంటి ఆంక్షలు ఉండవు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



