– 99 రోజుల ప్రగతి ప్రణాళికపై సీఎస్ సమీక్ష
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ’99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఈనెల 20నుంచి 26వ తేదీ వరకు ‘సంక్షేమవారం’ నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు తెలిపారు. ఈ మేరకు శనివారంనాడిక్కడి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం నుంచి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. సంక్షేమ వారంలో రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో సేవల్ని మెరుగుపరచడం, విద్యార్థులు, సమాజ భాగస్వామ్యాన్ని పెంపొందించడం వంటి చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. సంక్షేమ వారం లక్ష్యాలు, షెడ్యూల్ చేయబడిన కార్యక్రమాల్లో పకడ్బందీ ప్రణాళిక, పర్యవేక్షణ, విస్త్రుత భాగస్వామ్యం ఉండేలా చూడాలని చెప్పారు. ఈ సందర్భంగా ఏరోజు ఏ కార్యక్రమాలు ఎలా నిర్వహించాలనే ప్రణాళిక షెడ్యూల్‌ను ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్ వివరించారు. నిర్దేశించిన అన్ని పనుల కార్యాచరణ అమలును నిశితంగా పర్యవేక్షిస్తూ, సరైన డాక్యుమెంటేషన్ ఉండేలా చూసుకోవాలని చెప్పారు. రోజువారీ నివేదికలతో పాటు సమగ్ర ఏకీకృత నివేదికను అందించాలి. ప్రణాళికా శాఖ కార్యదర్శి గౌరవ్ ఉత్పల్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేయాలని చెప్పారు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన కల్పించాల న్నారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్యదర్శి సురేంద్ర మోహన్, సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ సీహెచ్ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.
ఇదీ షెడ్యూల్
– ఏప్రిల్ 20 : అన్ని సంక్షేమ విద్యా సంస్థల్లో సమగ్ర వంటశాల మరియు పారిశుధ్య కార్యక్రమాన్ని చేపట్టాలి. పరిశుభ్రతా ప్రమాణాలను నిర్ధారించడానికి అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాలి.
– ఏప్రిల్ 21: విద్యార్థుల్లో సృజనాత్మకత, మేధో వికాసాన్ని ప్రోత్సహించేందుకు క్విజ్, చర్చ, చిత్రలేఖనం వంటి పోటీలు నిర్వహించాలి.
– ఏప్రిల్ 22: హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో చిన్నపాటి మరమ్మతులపై దృష్టి పెట్టాలి. అధికారులు అంచనాలు సిద్ధం చేసి, అవసరమైన అనుమతులు పొంది, వేసవి సెలవుల్లో పనులు పూర్తిచేయాలి.
– ఏప్రిల్ 23: విద్యా నైపుణ్యాన్ని ప్రోత్సహించేందుకు, తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశాలు (పేరెంట్ టీచర్ మీటింగ్స్) నిర్వహించి, ప్రతిభావంతులైన విద్యార్థులను సన్మానించాలి.
– ఏప్రిల్ 24: ఉపాధి అవకాశాలను పెంచే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలను వివరిస్తూ, యువత కోసం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించాలి.
– ఏప్రిల్ 25: క్రీడలు, ఆటలు, కళలు, చేతిపనులు, సంగీతం, డిజిటల్ అక్షరాస్యత, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలను చేర్చి విద్యార్థుల కోసం వేసవి శిబిరాలు నిర్వహించాలి.
– ఏప్రిల్ 26: రాష్ట్రంలోని అన్ని హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో ”బడి బాట” కార్యక్రమాన్ని నిర్వహించాలి.
20 నుంచి 26 వరకు సంక్షేమవారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



