‘బాండెడ్ లేబర్’ నిర్మూలన అత్యవసరంచట్టాలను కఠినంగా అమలు చేస్తాం
ఇందుకోసం విభాగాల సమన్వయం కీలకం : మంత్రులు వివేక్, సీతక్క
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బాండెడ్ లేబర్ లాంటి దురాచారాన్ని పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరముందని రాష్ట్ర మంత్రులు వివేక్ వెంకటస్వామి, సీతక్క తెలిపారు. ఇప్పటికే ఈ దిశగా పని చేస్తున్న అధికారులను ఈ సందర్భంగా వారు అభినందించారు. శనివారం హైదరాబాద్‌లోని మ్యారీగోల్డ్ హోటల్‌లో ”తెలంగాణలో మానవ అక్రమ రవాణా- బాండెడ్ లేబర్ నిరోధం”పై నిర్వహించిన వర్క్‌షాప్‌లో వారు ప్రసంగించారు.ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ, 30-40 ఏండ్ల క్రితం రంగారెడ్డి జిల్లాలోనే అనేక బాండెడ్ లేబర్ కేసులను ప్రత్యక్షంగా చూశానని గుర్తు చేశారు. మహారాష్ట్రలో బాండెడ్ లేబర్‌గా పడిన కష్టాలను ఇద్దరు మహిళలు వివరించిన ఘటనను ప్రస్తావిస్తూ వీటిపై ప్రజల్లో అవగాహన పెరగడం అత్యవసరమని తెలిపారు. ఎవరూ బాండెడ్ లేబర్‌కు లోనుకాకూడదని, అదనపు పని చేస్తే అదనపు వేతనం ఇవ్వాలని చట్టంలో స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. 2021 నుంచి 2025 మధ్య రాష్ట్రవ్యాప్తంగా 673 మంది బాండెడ్ కార్మికులను రక్షించినట్టు వెల్లడించారు. వీరిలో పురుషులు, మహిళలు, చిన్నా రులు ఉండగా, వ్యవసాయం, ఇటుక బట్టీలు, సాగునీటి పనులు, మత్స్యకార రంగం, గృహ సేవలు, సిమెంట్ పనులు, గొర్రెల కాపరి వంటి రంగాల్లో ఎక్కువగా ఉన్నారని తెలిపారు.
మంత్రి సీతక్క మాట్లాడుతూ, చట్టాలను రూపొందించటంతో పాటు వాటిని సమర్థవంతంగా అమలు చేయ టమే ముఖ్యమన్నారు. శాఖల మధ్య సమన్వ యంతో పనిచేసినప్పుడే బాండెడ్ లేబర్, ట్రాప ˜ికింగ్ నిర్మూలన సాధ్యమని తెలిపారు. ఇతర రాష్ట్రాల బాధితుల పట్ల కూడా సమాన గౌరవం, సానుభూతి చూపాలని సూచించారు. గ్రామీణ ఉపాధి, స్వయం సహాయక సంఘాలు, సామాజిక వ్యవస్థలను బలోపేతం చేయడం ద్వారా ఈ నేరాలను తగ్గించవచ్చని సూచించారు. డీజీపీ బి. శివధర్ రెడ్డి మాట్లాడుతూ బాండెడ్ లేబర్ కేవలం కార్మిక సమస్య కాదన్నారు. ఇది బలవంతపు వ్యవస్థీకృత నేరమని చెప్పారు. బాధితులను తప్పుడు హామీలతో ఆకర్షించి, దోపిడీ పరిస్థితుల్లో బంధించి ఉంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అక్కడి నుంచి బయటపడటానికి వారికి బాహ్య సహాయం అవసరం అవుతోం దని తెలిపారు. బాధితుల ముందస్తు గుర్తింపు, బలమైన దర్యాప్తు, ఆధునిక సాంకేతికత వినియోగంతో శిక్షలు ఖాయం చేయడంపై పోలీస్ శాఖ దష్టి పెట్టాలని సూచించారు. అదనపు డీజీపీ చారు సిన్హా మాట్లాడుతూ, మానవ అక్రమ రవాణా చర్చల్లో బాండెడ్ లేబర్ ఉన్న పెద్దవయస్సు వారి అంశం విస్మరించబడుతోందని తెలిపారు.
అప్పుల బంధాన్ని నేరంగా గుర్తించడం, దోపిడీ గొలుసు మొత్తం మీద దర్యాప్తు బలోపేతం చేయడం, బాధితుల గౌరవం-భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడం అత్యవసరమని పేర్కొన్నారు. ”బాండెడ్ లేబర్ ఒప్పందం కాదు, ఇది బలవంతం. ఇది తరచుగా ట్రాఫికింగ్ నేరాలతో ముడిపడి ఉంటుంది. ఇక్కడ సమస్య కేవలం తరలింపు కాదు, బలవంతం, మోసం ద్వారా దోపిడీ చేయడమే” అని తెలిపారు.
మహిళా-శిశు అభివృద్ధి శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్ మాట్లాడుతూ, రక్షణ చర్యలతో పాటు స్థిరమైన పునరావాసం లేకపోతే బాధితులు మళ్లీ దోపిడీ పరిస్థితుల్లోకి నెట్టబడే ప్రమాదం ఉందన్నారు. కనీస వేతనం చెల్లించకపోవడాన్ని కూడా బలవంతపు శ్రమగానే పరిగణించాలని న్యాయ వ్యవస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. తెలంగాణ పోలీస్ మహిళా భద్రత విభాగం డబ్ల్యూఎస్‌డబ్ల్యూ), ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ (ఐజేఎం) తో కలిసి బాండెడ్ లేబర్‌కు సంబంధించిన మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు రాష్ట్ర స్థాయి సమన్వయ వర్క్‌షాప్‌ను నిర్వహించింది.ఈ వర్క్‌షాప్‌లో 200 మందికి పైగా పాల్గొన్నారు. ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారులు, పోలీస్ అధికారులు, న్యాయ వ్యవస్థ ప్రతినిధులు, న్యాయవాదులు, మీడియా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొని, మానవ అక్రమ రవాణా, బాండెడ్ లేబర్ వ్యవస్థకు సంబంధించిన తాజా ధోరణులపై చర్చించారు. ఈ సందర్భంగా సమన్వయంతో చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు.



