Friday, September 11, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్స్ర్తీల హక్కులకై గొంతెత్తిన గ్లోరియా

స్ర్తీల హక్కులకై గొంతెత్తిన గ్లోరియా

- Advertisement -

‘మనుషులం అందరం ఒకరితో ఒకరు ముడిపడి ఉన్నాం, అంతే కానీ ఒకరి కంటే ఒకరు ఎక్కువ, తక్కువ కాదు’, ‘ఒక సీతాకోకచిలుక రెక్కల కదలిక, వందల మైళ్ళ దూరంలో వాతావరణాన్ని మార్చగలదు’ అంటారు ప్రఖ్యాత స్ర్తీవాద రచయిత్రి, జర్నలిస్టు అయిన గ్లోరియా స్టీనిం. ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను తన అక్షరాలతో ఎత్తి చూపిన గొప్ప రచయిత్రి ఆమె. అమెరికా మహిళా ఉద్యమానికి శక్తివంతమైన గొంతుకగా నిలిచిన ధిశాలి. ఆ గొంతు ఇప్పుడు మూగబోయింది. వయోభారంతో తన 92 ఏండ్ల వయసులో న్యూయార్క్ నగరంలోని తన నివాసంలో సెప్టెంబర్‌ 2న కన్నుమూశారు. జీవితాంతం స్త్రీవాద ఆశయాల కోసం పోరాడిన ఆమె పరిచయం నేటి మానవిలో…

గ్లోరియా 1934 మార్చి25న అమెరికా లోని ఒహాయోలో జన్మించారు. తల్లి రూతు, తండ్రి లియో స్టీనం. ఒకప్పుడు ఎంతో ధైర్యంగా ఉండే ఆమె తల్లి నరాల బలహీనత వల్ల మానసికంగా నలిగిపోయింది. ఈ అనారోగ్యం కారణంగా ఆమె తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. అయితే గ్లోరియా దాన్ని పురుషాహంకారానికి ఆపాదించలేదు. ‘నా తల్లి నుండి విడిపోయిన విషయంలో నేను అతన్ని అర్థం చేసుకున్నాను, ఎప్పుడూ నిందించలేదు’ అని ఆమె అంటుండేవారు. అయితే ఈ సంఘటనల ప్రభావం ఆమె వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దింది. ఆమెను ఓ శక్తివంతమైన మహిళగా మార్చాయి.

తన అనుభవాల నుండి
తండ్రి ఆమెకు ఎప్పుడూ ఆర్థిక స్థిరత్వాన్ని అందించలేదు. తండ్రి దూరం కావడంతో వారి పరిస్థితిని మరింత దిగజార్చింది. తల్లి తన ఉద్యోగం నిలబెట్టుకోవడానికి పడిన కష్టాలు చూసి ఉద్యోగం చేసే మహిళల పట్ల ఉన్న ఆనాటి వివక్షను గ్లోరియా నిర్ధారించుకున్నారు. అంతేకాదు తన తల్లి పట్ల వైద్యుల ఉదాసీనత కూడా ఇలాంటి మహిళా వ్యతిరేక ద్వేషం నుండే వచ్చిందని ఆమె నమ్మింది. ఏండ్ల తర్వాత గ్లోరియా తన తల్లి అనుభవాన్ని సామాజిక అన్యాయాలను అర్థం చేసుకోవడంలో కీలకమైనదిగా భావించింది. మహిళలకు సామాజిక, రాజకీయ సమానత్వం లేదని ఆమె గ్రహించింది. వాటిని సాధించడం కోసం తన జీవితాన్ని అంకితం చేయాలని నిర్ణయించుకున్నారు.

భారతదేశంలోనూ…
1956లో స్మిత్ కాలేజీ నుండి తన అక్కతో కలిసి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు గ్లోరియా. ఆ తర్వాత ఒక ఫెలోషిప్ (స్కాలర్‌షిప్) పై భారతదేశంలో రెండేండ్లు గడిపారు. ఇక్కడ ఉన్నప్పుడు మహాత్మా గాంధీ అహింసా సిద్ధాంతాల పట్ల ఆకర్షితురాలయారు. భారతీయ మహిళల హక్కుల కార్యకర్తలతో కలిసి పనిచేశారు. ఈ అనుభవం ఆమె ఆలోచనా విధానాన్ని, భవిష్యత్ పోరాట పంథాను ఎంతగానో ప్రభావితం చేసింది. యునైటెడ్ స్టేట్స్‌కు తిరిగి వచ్చిన తర్వాత ఆమె CIA ద్వారా రహస్యంగా నిధులు పొందే సంస్థ అయిన ఇండిపెండెంట్ రీసెర్చ్ సర్వీస్‌కు డైరెక్టర్‌గా పనిచేశారు. 1959 ప్రపంచ యువజన ఉత్సవానికి అమెరికన్ విద్యార్థులను పంపడానికి ఆమె కృషి చేశారు. 1960లో ఆమె వారెన్ పబ్లిషింగ్ ద్వారా హెల్ప్ పత్రికకు మొదటి ఉద్యోగిగా నియమించబడ్డారు.

జర్నలిజంలో గుర్తింపు
1963లో జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించిన గ్లోరియా ఒక పత్రిక కోసం తన గుర్తింపును దాచిపెట్టి ‘ప్లేబాయ్ బన్నీ’గా ఒక క్లబ్‌లో చేరారు. అక్కడ మహిళా ఉద్యోగినులు ఎదుర్కొనే లైంగిక వేధింపులు, కఠినమైన పని పరిస్థితులను వివరిస్తూ ఆమె రాసిన పరిశోధనాత్మక కథనం అమెరికాలో పెద్ద సంచలనం సృష్టించింది. 1968లో ఆమె ‘న్యూయార్క్ మ్యాగజైన్’ (New York Magazine) సహ-వ్యవస్థాపకురాలిగా, రాజకీయ కాలమిస్ట్‌గా పిలిచేచారు. 1971లో ఆమె మహిళల సమస్యలు, స్త్రీవాద దృక్పథాన్ని ప్రపంచానికి చాటడానికి కేవలం మహిళలచే నడపబడే ‘Ms. మ్యాగజైన్’ను స్థాపించారు. గృహాలంకరణ, వంటలు మాత్రమే కాకుండా మహిళల నిజమైన హక్కులపై గొంతు విప్పిన మొదటి జాతీయ పత్రిక ఇది. దీని మొదటి ప్రతి కేవలం 8 రోజుల్లోనే పూర్తిగా అమ్ముడై రికార్డు సృష్టించింది. అలాగే మహిళల రాజకీయ, సామాజిక సాధికారత కోసం ఆమె పలు సంస్థలను ఏర్పాటు చేశారు. సామాజిక అంశాలపై పలు పుస్తకాలు రాశారు.

పురస్కారాలు
2013లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆమెకు అమెరికాలోనే అత్యున్నత పౌర పురస్కారమైన ‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్’ (Presidential Medal of Freedom) అందించి గౌరవించారు. ఆమె రాసిన ఆత్మకథ ‘మై లైఫ్ ఆన్ ది రోడ్’ (My Life on the Road) తో పాటు అనేక పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. దాదాపు శతాబ్దం పాటు మహిళల గొంతుకగా నిలిచిన ఆమె ఎంతో సార్థక జీవితాన్ని గడిపారు. తన చివరి శ్వాస వరకు సమానత్వం కోసం కృషి చేస్తూనే ఉన్నారు. తనను ప్రేమించే ఎందరో ప్రముఖుల మధ్య ప్రశాంతంగా కన్నుమూశారని గ్లోరియా ఫౌండేషన్‌ ఇన్‌స్టాలో ప్రకటించింది. పర్వతానికి అవతలి వైపు దారి చూపడానికి కొండలపై సంకేత అగ్నులు వెలిగించే సంప్రదాయం గ్లోరియాకు చాలా ఇష్టం.

ఉద్యమాలకు కేంద్రంగా…
గ్లోరియా కోసం పుష్పాలకు బదులుగా, బహుమతితో తనను గౌరవించాలనుకునే వారు గ్లోరియా ఫౌండేషన్‌కు విరాళం ఇవ్వాలంటూ గ్లోరియా కోరుకున్నారంటూ ఒక సంతాప సందేశాన్ని పోస్ట్‌చేశారు. గ్లోరియా తన రాబోయే పుస్తకం An unexpected life లో ‘నేను ఇప్పుడు యాభై ఏండ్లకుపైగా ఈ బ్రౌన్‌స్టోన్‌లో నివసిస్తున్నాను. నాకంటే ముందు ఎన్నో జీవితాలకు సాక్ష్యంగా నిలిచిన గదులలో, నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇతరుల జీవితాలను చూడబోతున్నాను’ అని రాసుకున్నారు. ఈ పుస్తకం ద్వారా ఆమె తన ఇంటిని సామాజిక న్యాయ ఉద్యమాలకు కేంద్రంగా మార్చాలనే నిబద్ధత, రాబోయే తరాలపై ప్రభావం చూపుతాయనే ఆశతో ప్రపంచానికి అందించిన కానుకగా భావించవచ్చు.
– సలీమా

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -