ఎన్నికైన పాలక సంస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ సిఫారసు
పూర్తి ముసాయిదాను అందించాలని లడఖ్ ప్రతినిధుల డిమాండ్
న్యూఢిల్లీ : లడఖ్‌కు రాజ్యాంగపరమైన ప్రత్యేక రక్షణలు కల్పించే దిశగా కేంద్ర హోంశాఖ (ఎంహెచ్‌ఏ) ఆర్టికల్ 371 కింద కొత్తగా ‘చాప్టర్-కే’ను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది. ఈ నిబంధన ద్వారా లడఖ్‌లో ఎన్నికైన పాలక సంస్థను ఏర్పాటు చేసే అంశంపై కేంద్ర హోంశాఖ అధికారులు, లడఖ్ పౌర సమాజ ప్రతినిధుల మధ్య ఢిల్లీలో చర్చలు జరిగాయి. లేV్‌ా లేహ్అపెక్స్ బాడీ (ఎల్‌ఏబీ), కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ (కేడీఏ) ప్రతినిధులు సమావేశంలో పాల్గన్నారు. ఆర్టికల్ 371 కింద ప్రతిపాదిస్తున్న ప్రత్యేక పాలనా విధానంపై కేంద్ర హోంశాఖ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినట్టు సమావేశంలో పాల్గన్న ప్రతినిధులు తెలిపారు. అయితే ప్రతిపాదనకు సంబంధించిన పూర్తి ముసాయిదాను తమకు అందించలేదని వారు వివరించారు. లేహ్అపెక్స్ బాడీకి చెందిన చెర్రింగ్ దోర్జే లక్రుక్ మాట్లాడుతూ.. మే 22న జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలనే తాజా సమావేశంలోనూ ప్రస్తావించారని తెలిపారు. ‘చాప్టర్-కే’కు సంబంధించిన వివరణాత్మక డ్రాఫ్ట్‌ను అందించాలని తాము కోరినట్టు చెప్పారు. పౌర సమాజ ప్రతినిధుల ప్రకారం.. కేంద్ర హోంశాఖ ప్రతిపాదించిన పాలక సంస్థకు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ప్రతినిధులను ఎన్నుకుంటారు. భూమి, సంస్కృతి, భాష, అడవులు, పర్యావరణం, సహజ వనరులతో పాటు ఆర్టికల్ 240 కింద కేంద్రపాలిత ప్రాంతానికి కేటాయించే ఇతర అంశాలపై ఆ సంస్థకు శాసనాధికారాలు కల్పించే అంశం ప్రతిపాదనలో ఉంది.
ప్రస్తుతం ఆర్టికల్ 371 కింద పలు రాష్ట్రాలకు ప్రత్యేక రాజ్యాంగ నిబంధనలు వర్తిస్తున్నాయి. లడఖ్ కోసం కొత్తగా ‘చాప్టర్-కే’ను ప్రవేశపెట్టే అంశంపై కేంద్రం ఇప్పుడు చర్చలు ప్రారంభించింది.
కాగా లడఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని, రాజ్యాంగపరమైన రక్షణలు కల్పించాలని, గిరిజన హోదాకు సంబంధించిన డిమాండ్లను పరిష్కరించాలని లేహ్ అపెక్స్ బాడీ, కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ గత కొంతకాలంగా కోరుతున్నాయి. భూమి, సహజ వనరులు, ఉద్యోగాలు, స్థానిక సంస్కృతికి రక్షణ కల్పించాలన్నది కూడా వారి ప్రధాన డిమాండ్లలో ఒకటి. 2019లో జమ్మూకాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ అనంతరం లడఖ్‌ను శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతం(యూటీ)గా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి స్థానిక ప్రజలకు పాలన, భూమి, వనరులు, అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన నిర్ణయాల్లో అధిక భాగస్వామ్యం కల్పించాలన్న డిమాండ్ కొనసాగుతోంది. తాజా సమావేశంలో లడఖ్ ప్రతినిధులు పలు డిమాండ్లను కేంద్ర హోంశాఖ ముందు ఉంచారు. ప్రతిపాదిత రాజ్యాంగ పరిరక్షణలు అమల్లోకి వచ్చే వరకు లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ భూమి, పరిపాలన, బ్యూరోక్రసీకి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోకుండా చూడాలని కోరారు.
రానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే దీనికి సంబంధించిన చట్టాన్ని తీసుకురావాలని కూడా విజ్ఞప్తి చేశారు. గతేడాది సెప్టెంబర్ 24న లేహ్ నగరంలో జరిగిన ఘటనలో పోలీసు కాల్పుల్లో నలుగురు మరణించారు. బాధితుల కుటుంబాలకు పరిహారం అందించాలని, గాయపడిన వారికి సహాయం చేయాలని లడఖ్ ప్రతినిధులు సమావేశంలో కోరారు. పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ మాట్లాడుతూ… సమావేశంలో పూర్తి స్థాయి ముసాయిదా అందుతుందని ఆశించామనీ, అయితే అది జరగలేదని తెలిపారు. పోలీసు, బ్యూరోక్రసీపై ప్రతిపాదిత ఎన్నికైన సంస్థకు అధికారాలు కల్పించాలని తాము కోరినట్టు చెప్పారు. ఈ డిమాండ్లను పరిశీలిస్తామని కేంద్రం తెలిపినట్టు ఆయన వివరించారు.



