సదస్సుకు సిద్ధమైన ఢిల్లీ
నేడు రష్యా, ఇరాన్ అధ్యక్షుల రాక
మోడీతో ప్రత్యేక భేటీ
న్యూఢిల్లీ : భారత్ అధ్యక్షతన జరుగుతున్న 18వ బ్రిక్స్ సమావేశాల వేదికకు కౌంట్ డౌన్ షురూ అయ్యింది. ఈనెల 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగే సదస్సులో బ్రిక్స్ సభ్య దేశాలతో పాటు భాగస్వామ్య దేశాలు, ఆహ్వానిత దేశాల ప్రతినిధులూ పాల్గొననున్నారు. ఈ సదస్సులో ప్రధానంగా ప్రపంచ ఆర్థిక వృద్ధిని మరింత సమ్మిళితంగా మార్చేందుకు అవసరమైన సహకారం, ఆవిష్కరణలు, స్థిరత్వం, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం వంటి అంశాలపై చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో 18వ బ్రిక్స్ లీడర్స్ సమ్మిట్ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ , ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ శుక్రవారమే న్యూఢిల్లీకి చేరుకుంటారని భావిస్తున్నారు. వీరిద్దరూ ప్రధానమంత్రి మోడీతో భేటీ కానున్నారు.
బ్రిక్స్ అనేది… గ్లోబల్ సౌత్ దేశాల మధ్య రాజకీయ, దౌత్య, ఆర్థిక సహకారం కోసం ఏర్పడిన అంతర్జాతీయ సమన్వయ వేదిక. దీనికి ప్రత్యేక రాజ్యాంగ ఒప్పందం, సొంత బడ్జెట్ లేదా శాశ్వత సెక్రటేరియట్ లేవు. బ్రిక్స్ సహకారం ప్రధానంగా మూడు విభాగాలు…రాజకీయ, భద్రతా సహకారం, ఆర్థిక రంగ సహకారం, సాంస్కృతిక, ప్రజల మధ్య సంబంధాల చుట్టూ కొనసాగుతుంది. ప్రస్తుతం బ్రిక్స్‌లో 11 పూర్తి సభ్య దేశాలు ఉన్నాయి.
నాలుగోసారి బ్రిక్స్ అధ్యక్షత బాధ్యతలు చేపట్టనున్న భారత్
2026 జనవరి 1 నుంచి భారత్ బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలను చేపట్టింది. అయితే భారత్ బ్రిక్స్ అధ్యక్షత వహించడం ఇది నాలుగోసారి. గతంలో 2012, 2016, 2021 సంవత్సరాల్లోనూ భారత్ ఈ బాధ్యతలను నిర్వహించింది. అంతేకాకుండా 2026వ సంవత్సరం బ్రిక్స్ ఏర్పాటై 20 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా కూడా ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది
2024 కజాన్ సదస్సులో బ్రిక్స్‌లో
పార్ట్నర్ కంట్రీ కేటగిరీ ఏర్పాటు
2024 కజాన్ సదస్సులో బ్రిక్స్‌లో పార్ట్నర్ కంట్రీ కేటగిరీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ విభాగంలో బెలారస్, బొలీవియా, క్యూబా, కజకిస్తాన్, మలేషియా, నైజీరియా, థాయ్‌లాండ్, ఉగాండా, ఉజ్బెకిస్తాన్, వియత్నాం ఉన్నాయి. భాగస్వామ్య దేశాలను సాధారణంగా నేతల సదస్సుకు ఆహ్వానిస్తారు. సభ్య దేశాల ఏకాభిప్రాయం ఉన్న సందర్భాల్లో ఇతర బ్రిక్స్ సమావేశాల్లోనూ వీరు పాల్గొనే అవకాశం ఉంటుంది.
విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు
బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో భారత ప్రభుత్వం, భారత భద్రతా బలగాలు విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ సదస్సు సమయంలో అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఢిల్లీ విమానాశ్రయ నిర్వాహక సంస్థ పలు కఠినమైన చర్యలను అమలు చేస్తోంది. తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన 500 సీసీటీవీ కెమెరాల సహాయంతో, భద్రతా ఏర్పాట్లను సీసీటీవీ కంట్రోల్ రూమ్ పర్యవేక్షిస్తుంది. ఈ కంట్రోల్ రూమ్ పరిధిలో న్యూఢిల్లీ జిల్లాలోని కీలకమైన రహదారులలో సగం భాగం, అలాగే విదేశీ అతిథులు బస చేయనున్న ఆబ్రే హోటల్ , తాజ్ మాన్ సింగ్ హోటల్ వంటి ప్రాంతాలు ఉంటాయి.అదే విధంగా సమగ్ర భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ బలగాలు, ఎన్‌ఎస్‌జీ, ఇతర ఏజెన్సీలకు చెందిన సుమారు 7,000 మంది సిబ్బందిని మోహరించారు. అలాగే వివిధ ప్రాంతాలలో ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ బలగాలు, ఎన్‌ఎస్‌జీ, ఇంటెలిజెన్స్ బ్యూరో, ఎస్‌పీజీ సిబ్బందితో కూడిన బహుళ అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.
బ్రిక్స్ సదస్సు ప్రధాన ఎజెండా…
గ్లోబల్ సౌత్: అంతర్జాతీయ సంస్థల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల గొంతుకను, ప్రాతినిధ్యాన్ని బలంగా వినిపించడంపై భారత్ ప్రధానంగా దృష్టి సారించనుంది. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ : డిజిటల్ చెల్లింపులు, డిజిటల్ సేవల రంగంలో భారత ప్రభుత్వం సాధించిన విజయాలను, జ్ఞానాన్ని ఇతర బ్రిక్స్ దేశాలతో పంచుకోవడం. వాతావరణ మార్పు లు, ఇంధన పరివర్తన: పునరుత్పాదక శక్తి, ఇంధన భద్రత, స్థిరమైన సాంకేతికతలపై సభ్య దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడం. మల్టీలేటరల్ సంస్థల సంస్కరణలు: ఐక్యరాజ్యసమితి, ఐఎంఎఫ్ వంటి ప్రపంచ ఆర్థిక, పాలనా సంస్థల్లో వర్ధమాన దేశాలకు సరైన ప్రాతినిధ్యం దక్కేలా సంస్కరణలు తీసుకురావడంపై చర్చలు.



