ప్రజల్లో నిత్యం విధ్వంసం, విద్వేషాలను రగిలించడం ద్వారా ఓట్లు దండుకునే పన్నాగాలను అవపోసన పట్టిన కమలనాథులు ఆ పనిలో అనుక్షణం నిమగమయ్యే ఉంటారు. ఇందుకు తాజా ఉదాహరణే ప్రధాని జాతినుద్దేశించి చేసిన ప్రసంగం. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోయిన నేపథ్యంలో చేసిన ప్రసంగంలో ఆయన అడుగడుగునా ప్రతిపక్షాలపై విద్వేషాన్ని వెళ్లగక్కారు. దీన్ని కూడా ఎన్నికల ప్రచారానికే ఉపయోగించుకున్నారు. తమిళనాడు, పశ్చిమబెంగాల్ పేర్లను ప్రత్యేకించి ప్రస్తావిస్తూ… ”దేశంలోని తల్లులకు, కుమార్తెలకు క్షమాపణలు చెబుతున్నా” అంటూ మొసలికన్నీళ్లు పెట్టుకుంటూ నీచ రాజకీయాలకు పాల్పడ్డారు. తన పక్షపాత రాజకీయ ప్రసంగానికి ప్రభుత్వ ప్రసార సంస్థ అయిన దూరదర్శన్‌ను సైతం దుర్వినియోగం చేశారు.
బిల్లు వీగిపోయిన దగ్గర నుండి ప్రతిపక్షా లను ముఖ్యంగా కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీపై విరుచుకుపడుతున్నారు. బిల్లును ఓడగొట్టిన కాంగ్రెస్, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్‌లను మహిళలు ఎప్పటికీ క్షమించరనే శాపనార్ధాలు మొదలుపెట్టారు. శనివారం తమిళ నాడు, ఆదివారం బెంగాల్ ఎన్నికల ప్రచారంలో కూడా ఇదే విషయాన్ని పదేపదే వల్లెవేశారు. మహిళలు చట్టసభల్లోకి అడుగు పెట్టడం కాంగ్రెస్, డీఎంకే, తృణమూల్‌లకు ఏమాత్రం ఇష్టంలేదని ఆరోపిం చారు. రెండుచోట్ల ప్రచారంలో కూడా ఇదే విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించటం చూస్తే రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడాన్ని రాజకీయం గా ఎలా ఉపయోగించుకుంటున్నారో స్పష్టంగా తెలుస్తోంది.
పార్లమెంట్‌లో గురువారం ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపక్షాలు ఐక్యంగా తిప్పికొట్టాయి. అయితే దాన్ని మహిళా బిల్లుగా ప్రధాని సహా కమలనేతలు చిత్రించే ప్రయత్నాలు చేస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు, మహిళా రిజర్వేషన్‌పై విమర్శలను అడ్డుకోవడానికి ప్రభుత్వం 2023 సెప్టెంబర్‌లో ‘నారీ శక్తి వందన్ అధినియం’ (ఎన్.ఎస్.వి.ఎ)ను హడావిడిగా ఆమోదించింది. ఈ ఆమోదించిన బిల్లును అమలులోకి తెచ్చే ఉద్దేశమే ఉంటే 2024 ఎన్నికల నుండే రిజర్వేషన్లు అమలయ్యేవి. కానీ మోడీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్‌ను జనగణన, పునర్విభజనతో ముడిపె ట్టింది. ఈ అనవసరమైన లంకెల వల్ల రిజర్వేషన్ల అమలు అనిశ్చితిలో పడుతుందని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేసినా, ప్రభుత్వం ఆ భయాలు నిరాధారమని కొట్టిపారేసింది. 2024 ఎన్నికలు పూర్తయిన వెంటనే డీలిమిటేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని, జనగణన కూడా నిర్దిష్ట సమయానికల్లా పూర్తి చేస్తామని ఆనాడు మోడీ ప్రభుత్వం నమ్మబలికింది. కానీ, ఈ రెండూ వాస్తవ రూపం దాల్చలేదు. దానికి కారకులెవరు?
2023లో ఏకగ్రీవంగా ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లును 2024 ఎన్నికల్లోనే అమలు చేయాలని అప్పట్లో ప్రతిపక్షాలు ఎంత డిమాండ్ చేసినా మోడీ ఏమాత్రం ఖాతరు చేయలేదు. పోనీ ఇపుడు మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్, జమిలి ఎన్నికల బిల్లులను వేర్వేరుగా ప్రవేశపెట్టమని ప్రతిపక్షాలు ఎంత చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదు, వినిపించుకోలేదు. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు డీలిమిటేషన్‌తో లింకు పెట్టి, పనిలో పనిగా జమిలి ఎన్నికల బిల్లులను కూడా ఆమోదింప చేసుకునేందుకు మోడీ ప్లాన్ చేశారు. అందుకనే ఎలాంటి మొహ మాటం లేకుండా ఇండియా బ్లాక్, ఎన్డీయేతర పార్టీలు ఏకమై ఈ రాజ్యాంగ సవరణ బిల్లు ఓడగొట్టాయి.
బిల్లు వీగిపోవటంలో మోడీ బాధ్యత కూడా వుంది. ఎలాగంటే, రాజ్యాంగ సవరణ బిల్లుల ఆమోదానికి ఎన్డీయేకి తగినంత మెజారిటి లేదన్న విషయం ప్రధానికి, ప్రభుత్వానికి స్పష్టంగా తెలుసు. అయినా ఓటింగ్ దాకా పరిస్ధితిని ఎందుకు తెచ్చారు? ఎందుకంటే వ్యూహాత్మకంగానే తెచ్చారని అర్ధమవుతోంది. మోడీ వ్యూహంలో రెండే అంశాలున్నాయి. మొదటిదేమో మహిళా సెంటిమెంటును ముందుకు తెచ్చి బెంగాల్, తమిళనాడు ఎన్నికలలో లబ్బి పొందడం తప్ప అంతకు మించి మహిళా రిజర్వేషన్ పట్ల ఆయనకు ఏ చిత్తశుద్దీ లేదు. బిల్లు వీగిపోతుందని వారికి ముందే తెలుసు. తలచినదే జరిగిన తర్వాత… ఇప్పుడు తమ వ్యూహంతో భాగంగా ప్రతిపక్షాలను దోషులుగా చిత్రీకరిం చటం మొదలుపెట్టారు. తమిళనాడు, బెంగాల్ ఎన్నికల్లో మహిళల ఓట్లను గంపగుత్తగా బీజేపీ, ఎన్డీయే అభ్యర్ధులకు వేయిం చుకోవటమే లక్ష్యంగా ప్రచారం చేసుకుంటున్నారు. ”మహిళా బిల్లును అడ్డుకొని భ్రూణ హత్యకు పాల్పడ్డాయి” అని విపపక్షాలపై నిందారోపణలు చేస్తున్నారు. నిందను ప్రతిపక్షాలపైకి నెట్టి ఎన్నికల్లో లబ్బి పొందడానికే ప్రభుత్వం ఈ పథకం వేసింది. లేదంటే ఆమోదం పొందిన బిల్లును నేరుగా అమలులోకి తేకుండా జనగణన, డీలిమిటేషన్‌తో మెలిక పెట్టడమెందుకు? ప్రభుత్వం తన మాయాజాలం ఆపి, ఎటువంటి శషభిషలు లేకుండా మహిళలకు రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలనుకుంటే అడ్డుపడేవారెవరు? ఎవరూ లేరు. సారాంశంలో గుర్తించాల్సిందేమిటంటే దోషి మోడీ సర్కారే…
మోడీ పెడబొబ్బలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



