- Advertisement -
- ఆయన రాసిన పుస్తకాన్ని నిషేధించాలి
- అంబేద్కర్, ఉపాధ్యాయ, విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు
- నవతెలంగాణ – కామారెడ్డి
- డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌ను కించపరిచే విధంగా పుస్తకం రాసిన హమారా ప్రసాద్‌పై దేశద్రోహం, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అంబేద్కర్, ఉపాధ్యాయ, విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో వారు ఈ డిమాండ్ చేశారు. హమారా ప్రసాద్ రాసిన పుస్తకం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌ను అవమానపరిచేలా ఉండటంతో పాటు దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని నాయకులు ఆరోపించారు. ఈ పుస్తకం ద్వారా సమాజంలో విద్వేషాలు, విభేదాలు సృష్టించేందుకు కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు. అంబేద్కర్‌ను అవమానించే పుస్తకాన్ని వెంటనే నిషేధించాలని డిమాండ్ చేశారు.
- హమారా ప్రసాద్ వెనుక ఎవరెవరు ఉన్నారనే విషయంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులందరిపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
- అంబేద్కర్ అందించిన రాజ్యాంగ హక్కుల ద్వారా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్న వారు ఈ అంశంపై స్పందించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి హమారా ప్రసాద్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. అంబేద్కర్‌ను కించపరిచే చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు. హమారా ప్రసాద్‌పై చర్యలు తీసుకునే వరకు, అవసరమైతే రాష్ట్ర బహిష్కరణ కోసం కూడా ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో అంబేద్కర్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆకుల బాబు, జిల్లా అధ్యక్షుడు కొత్తల గంగారం, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొంగరి వెంకట్, డీఎస్‌పీ జిల్లా అధ్యక్షుడు అశోక్, హరికృష్ణ, ఐసా జిల్లా కన్వీనర్ జీఎం విఠల్, బాంసెఫ్ రాష్ట్ర అధ్యక్షుడు దుబాసి నరేందర్, మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జిల్లా అధ్యక్షుడు గ్యార బాబు, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు సంగయ్య, సాయి గౌతమ్, సురేష్, భూపతి, కొండ సంజీవ్, పెద్దోలు సాయిలు, బట్టు రాములు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



