Tuesday, April 21, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవాహన్‌ పోర్టల్‌ సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తాం

వాహన్‌ పోర్టల్‌ సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తాం

- Advertisement -

– 59 వేల టీఆర్‌లు జారీ
– 1262 ఫ్యాన్సీ నెంబర్ల కేటాయింపు
– రవాణా శాఖ కమిషనర్‌ ఇలంబరితి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

రవాణా శాఖ పరిధిలోని వాహన్‌ పోర్టల్‌ సాంకేతిక సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని కమిషనర్‌ డాక్టర్‌ కె ఇలంబరితి చెప్పారు. పోర్టల్‌ ప్రారంభించిన గత మార్చి 23 నుంచి ఇప్పటివరకు 59,567 తాత్కాలిక రిజిస్ట్రేషన్లు జారీ చేసినట్టు ప్రకటించారు. అలాగే 1262 ఫ్యాన్సీ నెంబర్లను కేటాయించినట్టు వివరించారు. సోమవారం హైదరాబాద్‌లోని రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9292 వాహనాలకు శాశ్వత రిజిస్ట్రేషన్‌ నెంబర్లు కేటాయించినట్టు వివరించారు. ఈసందర్భంగా ఉత్పన్నమవుతున్న సమస్యలను త్వరలోనే కొలిక్కి తెస్తామని తెలియజేశారు. వాహన్‌ పోర్టల్‌ను ఎన్‌ఐసీ బృందం నిరంతర సహకారంతో స్థిరీకరించడం జరుగుతుందన్నారు. అదనపు మాడ్యూళ్లను కూడా దశలవారీగా అమలుచేస్తున్నామని చెప్పారు. మరో 15 నుంచి 30 రోజుల్లో పూర్తిగా స్థిరీకరిస్తామన్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆటోమొబైల్‌ డీలర్లకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఆ సందర్భంగా వచ్చిన సలహాలు, సూచనల ఆధారంగా సాఫ్ట్‌వేర్‌ మార్పులు, చేర్పులు చేయనున్నట్టు తెలియజేశారు. ఆటోమొబైల్‌ డీలర్లు, శాఖా సిబ్బందికి వాహన్‌ అప్లికేషన్‌ వినియోగంపై అవగాహన కల్పించేందుకుగాను తరచుగా ఆన్‌లైన్‌ సమావేశాలు నిర్వహించడం జరుగుతున్నదన్నారు. డీలర్ల నుంచి వచ్చే సమస్యలను తక్షణ పరిష్కారం కోసం ఢిల్లీ ఎన్‌ఐసీ ప్రత్యేక బృందం రవాణా శాఖ ప్రధాన కార్యాలయం కేంద్రంగా పనిచేస్తున్నదని వివరించారు. పోర్టల్‌ అభివృద్ధి, పనిచేయించే విషయమై డీలర్లు, పౌరులు, ఇతర భాగస్వాములు అందిస్తున్న సహకారానికి రవాణా శాఖ కమిషనర్‌ అభినందనలు తెలియజేశారు. వాహన్‌ పోర్టల్‌ ద్వారా ప్రస్తుతం వాహనాల రిజిస్ట్రేషన్లు మాత్రమే జరుగుతున్నాయనీ, త్వరలో మరిన్ని సర్వీసులు ప్రారంభిస్తామన్నారు. సారథి పోర్టల్‌ పూర్తిస్థాయిలో పనిచేస్తున్నదన్నారు. ఇందులో సమస్యలేవీ లేవని చెప్పారు. కొత్తగా ఈవీల డిస్కౌంట్‌ విధానం అమల్లోకి వచ్చాక అదనంగా 21 శాతం కొనుగోళ్లు పెరిగాయని చెప్పారు. ప్రస్తుతం రవాణా పూర్తిగా డిజిటల్‌ పద్దతిలో సేవలు అందిస్తున్నదని గుర్తు చేశారు. 15 ఏండ్లు నిండిన ప్రభుత్వ వాహనాలు స్క్రాపింగ్‌ చేస్తున్నామన్నారు. సాధారణ పౌరులు చేస్తే ప్రత్యేకంగా సర్టిఫికెట్‌ ఇస్తామనీ, తద్వారా కొత్తగా వాహనం కొనుగోలు చేసేవారికి రాయితీ లభిస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో సంయుక్త రవాణా కమషనర్లు సి రమేష్‌, సిహెచ్‌ శివలింగయ్య పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -