Wednesday, April 22, 2026
E-PAPER
Homeక్రైమ్త్రిసూర్‌ బాణాసంచా పరిశ్రమలో భారీ పేలుడు

త్రిసూర్‌ బాణాసంచా పరిశ్రమలో భారీ పేలుడు

- Advertisement -

– 13 మంది సజీవదహనం
– 30 మందికి తీవ్రగాయాలు.. పలువురి పరిస్థితి విషమం
– సీఎం పినరయి విజయన్‌ తీవ్ర దిగ్భ్రాంతి
– సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశం
– క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలి : మంత్రి వీణా జార్జ్‌

త్రిసూర్‌ : కేరళ రాష్ట్రంలోని త్రిసూర్‌లోగల ఓ బాణాసంచా పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 13 మంది సజీవదహనమయ్యారు. 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. పూరం వేడుక కోసం ముండతికోడ్‌లో నిల్వ ఉంచిన బాణాసంచా కేంద్రాల్లో ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు. ఈ కేంద్రాన్ని స్థానికంగా ఉన్న పంటపొలాల్లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెడ్‌లలో ఏర్పాటు చేశారు. పేలుడు సంభవించిన వెంటనే అప్రమత్తమైన స్థానికులు, అధికారులు గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలోనూ బాణాసంచా నిల్వ కేంద్రాలు ఉండటం, వరుసగా పేలుళ్లు జరగడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని రెస్క్యూ బందాలు వెల్లడించాయి. ఈ ఘటనకు అధిక ఉష్ణోగ్రతలు కూడా ఓ కారణం కావచ్చని అనుమానం వ్యక్తం చేశాయి. అయితే ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎంతమంది కార్మికులు ఉన్నారనే విషయంపై స్పష్టత లేకపోయినప్పటికీ.. వారి కోసం తెప్పించిన ఆహార ప్యాకెట్ల ఆధారంగా దాదాపు 40 మంది ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు.
ఈ ఘటనపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ అధికారులను ఆదేశించారు. ఈ దుర్ఘటనపై స్పందించిన ప్రధాని మోడీ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -