– ‘పైగా ప్యాలెస్’ మరమ్మతులకే రూ.93 కోట్లు!
– ప్రజాధనం వృథా చేస్తున్నారంటూ విమర్శలు
– హెచ్‌ఎండీఏ కార్యాలయ మార్పుపై వింత నిర్ణయాలు
– జులై నాటికి బేగంపేటకు మకాం.. కొనసాగుతున్న పనులు
– పాత సామాగ్రినే వాడతామంటున్న అధికారులు
– భవనానికి మాత్రం భారీ ఖర్చు
నవతెలంగాణ- సిటీబ్యూరో
హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) తన గూడు మార్చుతోంది. అమీర్‌పేటలోని స్వర్ణజయంతి కాంప్లెక్స్ నుంచి బేగంపేటలోని చారిత్రక ‘పైగా ప్యాలెస్’కు తరలి వెళ్లేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ తరలింపు ప్రక్రియ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు ప్రభుత్వం ఖర్చులను ఆదా చేయాలని చెబుతుండగా.. మరోవైపు భవన పునరుద్ధరణ కోసమే రూ.93 కోట్లు వెచ్చించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హెరిటేజ్ భవనం పేరిట ఇంత భారీ మొత్తంలో ప్రజాధనాన్ని ఖర్చు చేయడం అవసరమా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
రూ.93 కోట్లతో ‘పైగా’కు మెరుగులు!
రెండేండ్ల కిందట అమెరికన్ కాన్సులేట్ నానక్‌రాంగూడకు తరలివెళ్లింది. దీంతో అప్పటి నుంచి పైగా ప్యాలెస్ ఖాళీగా ఉంది. హెచ్‌ఎండీఏ సొంత భవనమైన ‘పైగా’లోకి హెచ్‌ఎండీఏ కార్యాలయాన్ని మార్చాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ మేరకు ఆ శాఖ ఇంజినీరింగ్ అధికారులు యుద్ధప్రతిపాదికన పనులు చేపడుతున్నారు. సుమారు 400 ఏండ్ల నాటి ఈ పురాతన భవనానికి ‘లైమ్ మోర్టార్’ (సున్నం)తో పాత పద్ధతిలోనే మరమ్మతులు చేస్తున్నారు. ఈ చారిత్రక భవన పునరుద్ధరణకు రూ.63 కోట్లు, దాని వెనుక వైపు మరో రెండు బ్లాకుల(జీ-ప్లస్ 3, 4) నిర్మాణాలకు రూ.30 కోట్లు కలిపి మొత్తం రూ.93 కోట్లు ఖర్చు చేస్తున్నారు. భవన నిర్మాణంలో ఎక్కడా సిమెంట్, ఇనుము, స్క్రూలు వాడకుండా సహజత్వం దెబ్బతినకుండా పనులు చేస్తున్నట్టు సంబంధిత అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం హెచ్‌ఎండీఏ వేర్వేరు చోట్ల నుంచి కార్యకలాపాలు సాగిస్తోంది. అమీర్‌పేటలోని స్వర్ణజయంతి కాంప్లెక్స్‌లో ప్రధాన కార్యాలయం, నానక్‌రామ్‌గూడలో ఔటర్ రింగ్ రోడ్(హెచ్‌జీసీఎల్) కార్యాలయం, ట్యాంక్ బండ్ వద్ద బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ కార్యాలయాలు ఉన్నాయి. ఈ మూడు విభాగాల్లో ప్రస్తుతానికి స్వర్ణజయంతి కాంప్లెక్స్‌లోని హెడ్ ఆఫీస్ త్వరలోనే పైగా ప్యాలెస్ నుంచే పని చేయనుంది.
పాత సామాగ్రి వాడకం..
పొదుపు మంత్రం నిజమేనా?
కార్యాలయ మార్పిడిలో అనవసర ఖర్చులను తగ్గిస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అమీర్‌పేట కార్యాలయంలో ఉన్న పాత కుర్చీలు, టేబుళ్లు, ఫ్యాన్లు, ఏసీలు, చివరికి ఆవరణలోని చెట్లను కూడా కొత్త కార్యాలయానికి తరలిస్తామని తెలిపారు. పాత ఫర్నీచర్‌ను వాడుతూ పొదుపు పాటిస్తున్నామని చెబుతూనే, భవన రిపేర్ల కోసమే రూ.93 కోట్లు ఖర్చు చేయడమేంటన్న చర్చ సాగుతోంది.
అద్దె రూపంలో
రూ. 2.16 కోట్ల ఆదాయం?
ప్రస్తుతం హెచ్‌ఎండీఏ ఉన్న అమీర్‌పేటలోని స్వర్ణజయంతి కాంప్లెక్స్ మొత్తం నాలుగు అంతస్తులు(1.20 లక్షల చదరపు అడుగులు) ఉంది. దీన్ని అద్దెకు ఇవ్వడం ద్వారా నెలకు సుమారు రూ.2.16 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఇందులో రెండు అంతస్తులను ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ‘తెలంగాణ ఫైబర్ గ్రిడ్'(టీ-ఫైబర్)కు కేటాయించారు. అయితే, వచ్చే అద్దె ఆదాయం కంటే ముందుగా పెడుతున్న పెట్టుబడి (రిపేర్ ఖర్చులు) చాలా ఎక్కువగా ఉండటం గమనార్హం.
కమిషనర్ సౌకర్యం కోసమేనా?
హెచ్‌ఎండీఏ కమిషనర్‌కు అదనంగా మెట్రోరైలు ఎండీ బాధ్యతలు ఉండటంతో ఆయన ఎక్కువగా బేగంపేటలోని మెట్రో భవన్‌లోనే ఉంటున్నారు. అమీర్‌పేట నుంచి బేగంపేటకు రాకపోకలు సాగించడం, ట్రాఫిక్ సమస్యల వల్ల సమయం వృథా అవుతోందని అధికారులు సాకుగా చెబుతున్నారు. పైగా ప్యాలెస్ అయితే మెట్రో భవన్‌కు అతి సమీపంలో ఉంటుందనేది అంతర్గత ఆలోచన. అయితే, నానక్‌రామ్‌గూడలో ఉన్న అర్బన్ ఫారెస్ట్రీ, హెచ్‌జీసీఎల్ కార్యాలయాలను కూడా ఇక్కడికి తరలిస్తారా? లేదా? అనే దానిపై ఇంకా స్పష్టత లేదు.
రెండు నెలల్లో పూర్తి.. జులైలో తరలింపు
ప్రస్తుతం పైగా ప్యాలెస్‌లో మరమ్మతులు వేగంగా జరుగుతున్నాయి. మరో రెండు నెలల్లో పనులన్నీ పూర్తి చేసి, జులై నాటికి అన్ని విభాగాలనూ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. చారిత్రక భవనాల పరిరక్షణ అవసరమే అయినప్పటికీ, ఒక ప్రభుత్వ కార్యాలయం కోసం ఇంత భారీ స్థాయి ఖర్చు చేయడం ప్రజాధనాన్ని వృథా చేయడమేనని ప్రజా సంఘాల నాయకులు, సామాజిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు.
ఆదా అంటే ఇదేనా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



