– ఇప్పటికే అమ్ముడైన 20 వేల టికెట్లు హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు
హైదరాబాద్: జనవరి 25 నుంచి ఉప్పల్ స్టేడియంలో జరుగనున్న భారత్, ఇంగ్లాండ్ తొలి టెస్టును విజయవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్ రావు చెప్పారు. మ్యాచ్ ముంగిట, స్టేడియం ఆవరణలోని గణపతి ఆలయం, ప్రధాన పిచ్ వద్ద వేద పండితుల ఆధ్వర్యంలో అపెక్స్ కౌన్సిల్ సభ్యులతో కలిసి జగన్‌మోహన్‌రావు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ‘భారత్, ఇంగ్లాండ్ టెస్టు మ్యాచ్‌కు అభిమానుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఇప్పటికే 20 వేల టికెట్లు అమ్ముడుపోయాయి.సుందరీకరణ పనులతో ఉప్పల్ స్టేడియం అభిమానులకు సరికొత్త అనుభూతి కలిగించనుంది. టెస్టు మ్యాచ్ సందర్భంగా ఎటువంటి అసౌకర్యం కలుగకుండా కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేస్తున్నామని’ జగన్‌మోహన్ రావు తెలిపారు. కార్యక్రమంలో హెచ్‌సీఏ కార్యదర్శి దేవరాజ్, ఉపాధ్యక్షుడు దల్జిత్ సింగ్, కోశాధికారి సీజే శ్రీనివాస్, సహాయ కార్యదర్శి బసవరాజు, చీఫ్ క్యూరేటర్ చంద్రశేఖర్ సహా గ్రౌండ్ సిబ్బంది పాల్గొన్నారు.