బాధిత మహిళను అక్కున చేర్చుకొని కుటుంబ సభ్యులకు అప్పగించిన ఎస్ఐ
నవతెలంగాణ – ముధోల్
వర్షంలో తడిసి, చలికి వణుకుతూ దిక్కుతోచని స్థితిలో ఉన్న మతిస్థిమితం లేని మహిళకు ముధోల్ ఎస్ఐ బాసటగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకెళ్తే.. ఓ మహిళ శనివారం వర్షంలో తడుస్తూ భైంసా -బాసర జాతీయ రహదారిపై చలికి వణుకుతూ రోడ్డుపై తిరుగుతున్నది. ఈవిషయం ను తెలుసుకున్న ముధోల్ ఎస్సై బిట్ల పెర్సిస్ తన సిబ్బందితో వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి మహిళను చేరదీసి ఆహారం, పండ్లు అందించారు. దుస్తులు వర్షానికి తడిసిపోయి, చలికి వణుకుతున్నడంతో ఎస్ఐ చలించిపోయారు.
వెంటనే ఇంటికి వెళ్లిమహిళకు వేరే దుస్తులను తెచ్చి అందించారు. మహిళ నుండి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేసినప్పటికీ మతిస్థిమితం లేక వివరాలు సరిగా చెప్పలేకపోయింది. అంతలో ఆ రోడ్డు కూడా వెళ్తున్న ముధోల్ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ ఆ మహిళ నుండి వివరాలు ఎట్టకేలకు సేకరించారు. అక్కడే ఉన్న ఎస్ఐకీ వివరాలు తెలియజేశారు. దీంతో ఎస్సై వెంటనే సంబంధిత కుటుంబ సభ్యులకు,అక్కడి పోలిసులకు సమాచారం చేరవేశారు. దీంతో శనివారం రాత్రి కుటుంబ సభ్యుల ముధోల్ కు వచ్చారు. మహిళను బాధిత కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆపదలో ఉన్న మహిళను చేరదీసి దుస్తులు మార్చించి, ఆహారం అందించి, చికిత్స చేయించడంతో పాటు , కుటుంబ సభ్యులకు అప్పగించటంపై ఎస్సై బిట్ల పెర్సిస్ పై స్థానికులు ప్రశంసల వర్షం కురిపించారు.



