గడచిన నెల 15న మనం ఈ దేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకున్నాం. 1947 ఆగస్టు 15 న స్వాతంత్ర్యం వచ్చిందని జెండా కూడా ఎగరేశాం. కానీ తెలంగాణ అప్పటికి నిజాం రాజుల పరిపాలనలోనే ఉంది. బ్రిటిషర్స్‌తో ఒప్పందం కలిగిన నిజాం ఉల్ ముల్క్ ఈ ప్రాంతాన్ని ఏలుతున్నారు. 1724 నుండి 1948 వరకూ హైదరాబాదు రాజధానిగా అసఫ్ జాహీ వంశ రాజులు ఈ ప్రాంతాన్ని స్వతంత్ర రాజ్యంగా పరిపాలించారు. కర్నాటకలోని కొంత ప్రాంతం, మహారాష్ట్రలోని మరఠ్వాడా ప్రాంతం, తెలంగాణం కలిపి నిజాం స్టేట్‌గా ఉండేది. ఇదొక ప్రత్యేక దేశం. సొంత సైన్యం.. వైమానిక సంస్థ, టెలీకమ్యూనికేషన్ వ్యవస్థ, రైల్వేలు, పోస్టల్, కరెన్సీ, రేడియో ప్రసారాలు, జెండా.. అన్నీ ఉన్నాయి. పదిమంది నవాబులు 1948 వరకు పరిపాలించారు. చివరి నవాబు నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్. ఇతను 1911 నుండి 1949 వరకు ఉన్నాడు. దీనినే హైద్రాబాద్ సంస్థానం అంటాం. ఇదంతా నేటితరానికి వివరంగా తెలియక పోవచ్చు. అందుకే ప్రాథమిక వివరాలు తెలుపుతున్నాను.
1948 సెప్టెంబరు 17న ఈ సంస్థానం స్వతంత్ర భారతదేశంలో విలీనమయింది. అప్పటి నుండి భారతదేశంలో మనం భాగమయ్యాం. హైద్రాబాద్ సంస్థానమేకాక, దేశంలో ఇలాంటి సంస్థానాలు 500లకు పైగా ఉన్నాయి. వాటిని కూడా విలీనం చేశారు. పైవన్నీ సాధారణ చరిత్ర విషయాలు, కానీ అసలు చరిత్ర ప్రజలు తెలుసుకుంటేనే తెలంగాణాను అర్థం చేసకోగలుగుతాము. నెహ్రు సైన్యాలు హైద్రాబాద్ నిజాం రాజ్యంపై ఎందుకు దాడి చేశాయి? నిజాం ఎందుకు దేశంలో విలీనం చేశాడు? అనే విషయాలు జాగ్రత్తగా వాస్తవిక దృష్టితో తెలుసుకోవాలి.
ప్రాణాలకు తెగించి
1946 నుండి 1948 వరకు భీకరమైన ప్రజా సాయుధ పోరాటం జరిగింది. ఇందులో రైతులు, కూలీలు, వృత్తిదారులు, దళితులు, ఆదివాసీలు, గ్రామీణ ప్రజలు అందరూ పాల్గొన్నారు. ప్రాణాలకు తెగించి నిజాం, జమీందారు, జాగీరుదారులు, పటేలు, పట్వారీల దౌర్జన్యాలపై ఎదురు తిరిగి యుద్ధం చేశారు. ఈ పోరాటానికి కారణమేమంటే.. తెలంగాణ పల్లెల్లో సామాన్యుల పరిస్థితి మరీ దీనంగా ఉండింది. సామాన్య ప్రజలు వెట్టి చాకిరీ చేయాల్సి వచ్చేది. అంటే, ఉచితంగానే ఊర్లలోని భూస్వాముల ఇండ్లలో పనిచేయాలి, బట్టలు ఉతకాలి, ఊడ్వాలి, చల్లాలి. ఇంటి చాకిరి చేయాలి. ఇక జమీందారు భూమిలో పనిచేసాకే సొంత పొలం పనులు చేసుకోవాలి. ఊళ్లలోని వృత్తిదారులందరూ దొరలకు అన్నీ సమకూర్చాలి. ఇక సాధార సామాన్య ప్రజలు దొర ముందు చెప్పులేసుకుని నడవటానికి కూడా లేదు. నీ బాంచన్ కాల్మొక్తా అంటూ సేవలు చేయాలి. అట్లయితేనే బతికి బట్టకడతారు. లేకుంటే చావబాదటం.

దుర్భరమైన జీవనం
ఇక ప్రజల మీద వంద రకాల పన్నులు వేసి రాక్షసంగా వసూలు చేసేవారు. ధనగర్ పట్టీ (గొల్లవారిపై పన్ను), దేడ్ పట్టీ (మాలమాదిగలపై), షాది పట్టీ (పెండ్లిళ్లపై), చర్మపట్టీ, బోయిపట్టీ (బోయలమీద), హాటి బజీరి (మార్కెట్ల మీద), కలాల్ పట్టీ (కల్లు దుకాణంపై), జూలాయి పట్టీ (సాలె వాళ్లపై), దార పట్టీ, రహదారీ (తోవపట్టి), రెడ్డి రుసుం (రెడ్డిగారికి చెల్లించేది), మజూరి పట్టీ (కూలీల మీద), మచిలీ పట్టీ (బెస్తవారి మీద), కుంబాల పట్టీ (కుమ్మరివాళ్ల మీద) దఫన్ (పీనుగలను పూడ్చినందుకు), బట్సబ్జీ(కూరగాయల మీద), మేహదర్పా(ఇంటి పన్ను), సఫర్ పట్టీ (జమీందార్ గారి డౌర), ఆదాం పట్టీ (హిందూ శిల్ప కళాకారుల మీద), బైంస్ పట్టీ (దున్నపోతులను ఉంచుకున్నవారిపై) 1867లోనే సాలర్జంగ్ భూమి పన్ను విధానంలో మార్పులు తెచ్చాడు. రెండు ఎద్దుల సేద్యగాని నుండి 5 నుండి 10 రూపాయలు వరకు, 4 ఎద్దుల వారికి 10 నుండి 20 రూపాయల వరకు వసూలు చేసేవారు. ప్రతి కుటుంబంపైన ఏదో ఒక పన్ను చెల్లించాలి. పన్నులు చెల్లించలేక చాలా మంది గ్రామాలు వదిలి పారిపోతే, వారిని పట్టుకొచ్చి హింసించి, పన్నులు వసూలు చేసేవారు. అంతేకాదు కనపడ్డ స్త్రీలను తమ గడీలకు బలవంతంగా పిలుపించుకునేవారు. ప్రజలు ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేక దుర్భరమైన జీవనం కొనసాగించారు.
సంఘంగా ఏర్పడి
జాగీర్ధార్లకు, జమందార్లకు సేవ తప్ప ఎదురు మాట్లాడటానికి వీలులేదు. భూములు ఆక్రమించుకోవడం, అవసరానికి అప్పులిచ్చి భూములు రాయించుకోవడం, వడ్డీలు గుంజడం, లేదంటే శిక్షలు విధించి హింసించడం. ఒక అరాచక రాజ్యం గ్రామాలలో కొనసాగుతున్నవేళ, ప్రజలకు తమ భాషలో చదువు కూడా అందని సందర్భాన.. 1930లో జోగిపేటలో సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షతన, ఆంధ్రమహాసభ పేరుతో సాంస్కృతిక హక్కులను పొందేందుకు ఓ సమూహం ఏర్పడింది. గ్రంథాలయోద్యమం, భాషా చైతన్యం పెల్లుబికింది. క్రమక్రమంగా ప్రజల ఆకాంక్షలు ప్రకటించే సంఘంగా రూపుదిద్దుకుని, 1944 వరకు చైతన్యయుతమై సాయుధ పోరాటానికి దారితీసింది. ప్రజలు చైతన్యమై, ఐక్యమవుతున్నారని, తమ నిరంకుశ, దోపిడీ విధానాలపై గొంతులెత్తుతున్నారని గమనించిన దొరలు అణచి వేయడానికి, దాడులు చేయడానికి పూనుకున్నారు. లక్షలు, వేల ఎకరాల భూమి కలిగిన జమీందారులు ప్రజలపై నానా కిరాతకంగా దౌర్జన్యాలకు ఒడిగట్టారు. వీరి ఆగడాలను ఎదిరించేందుకు ‘సంఘం’ పేరుతో అప్పటికే నైజాంలో ఏర్పడిన కమ్యూనిస్టు పార్టీ నాయకులు సమాయత్తమయ్యారు. జనగామ తాలూకాలో విసునూరు రామచంద్రారెడ్డి 40 గ్రామాల భూస్వామి. 45 వేల ఎకరాలు కలిగిన దొర. ఆంధ్ర మహాసభ కార్యకర్తలను అనేక నిర్భంధాలకు గురి చేశాడు. 1945లో తన జమీందారీలో ఉన్న కామారెడ్డి పల్లెలోని మహమ్మద్ బందగీని హత్యచేయించాడు. అతడి అన్నను తన గూండా గ్యాంగ్‌లో పెట్టుకుని కామారెడ్డి, సీతారాంపురం, కడివెండి గ్రామాలపై నిరంతరం దాడులు చేయించాడు.
తెలంగాణ అగ్నికణం ఐలమ్మ
పాలకుర్తిలో సంఘాన్ని గట్టిగా బలపరచిన చిట్యాల ఐలమ్మ పొలాన్ని స్వాధీనం చేసుకోవాలని జమీందారు ప్రయత్నాలు చేశాడు. అంతకుముందు పాలకుర్తిలో జరిగిన సభపైకి తన గూండాలను పంపాడు. సంఘం కార్యకర్తలు తిప్పి కొట్టారు. ఐలమ్మ ఎంతో ఆత్మాభిమానంతో కష్టపడి పండించిన పంటను దోచుకోవడానికి, పొలం ఆక్రమణకు, 100 మంది కూలీలను, 100 మంది గుండాలను పంపించాడు. సంఘ నాయకులు 23 మంది ఆ గుండాలపై దాడి చేసి తరిమికొట్టారు. అదేరాత్రి విసునూరు నుండి పోలీసులు వచ్చి ఐలమ్మ ఇంట్లో ఉన్న ధాన్యాన్ని తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. కార్యకర్తలు ఎదురు తిరగడంతో ధాన్యం ముట్టుకోలేక పోయారు. ఈ ప్రతిఘటనలో వీరోచితంగా నిలబడిన ఐలమ్మకు అండగా భీమిరెడ్డి నర్సింహారెడ్డి, చకిలం యాదగిరిరావు, చల్లా ప్రతాపరెడ్డితో పాటు సంఘ సభ్యులు నిలబడ్డారు. పేరుమోసిన దేశముఖ్, విసునూరు రాంచంద్రరెడ్డిపై మొదటి విజయంగా ఈ ఘటన నిలుస్తుంది. తన జీవితంలో ఎన్నడూ ఎరుగని ఓటమిగా జమీందారు భావించాడు. ఒక మహిళగా ధైర్య సాహసాలు ప్రదర్శించిన ఐలమ్మ నేటికీ మనకు చైతన్యాన్ని నింపుతూనే ఉంటది.

దొడ్డి కొమరయ్య వీరమరణం
పై సంఘటనతో విసునూరు దేశ్‌ముఖ్ రెచ్చిపోయాడు. పోలీసుల సహాయంతో కడవెండి గ్రామ నాయకులను హత్య చేయాలని పథకం వేశాడు. ప్రజలపై కేసులు పెట్టాడు. 1946 జులై 4 న గుండాలు నాయకుల ఇండ్లపై రాళ్లు విసిరారు. దాడులు చేయాలని ఎదురుచూశారు. ప్రజలు లాఠీలు, వడిసెలు చేతబూని నినాదాలు చేసుకుంటూ ఊరేగింపు తీశారు. జమీందారు ఇంటి పక్క పాకలో ఉన్న గూండాలు ఊరేగింపుపైకి కాల్పులు జరిపారు. అప్పుడే ఊరేగింపులో నడుస్తున్న దొడ్డి మల్లయ్య కాలికి తూటా తగిలి పడి పోయాడు. అన్నయ్యా అని కిందికి వంగిన తమ్ముడు దొడ్డి కొమురయ్య పొట్టలోకి మరో తూటా దూసుకుపోయింది. అక్కడికక్కడే కొమురయ్య నేలకొరిగాడు. ప్రజలు భయపడలేదు. జమీందారు భవనాన్ని చుట్టుముట్టారు. తగలబెట్టారు. ఇది తెలుసుకున్న జమీందారు 400 మంది గూండాలను పిస్తోళ్లతో తీసుకువచ్చాడు. ప్రజలు తరిమి తరిమి కొట్టారు. దేశ్‌ముఖ్ కొడుకు హైదరాబాద్ పారిపోతుండగా ప్రజలు జనగామ రైల్వేస్టేషన్లో పట్టుకుని చంపేశారు. ఈ ఘటన సాయుధ రైతాంగ పోరాటానికి దారి తీసింది.
ఏకమై పోరాడారు
11-09-1946 తేదీ నాడు దొరల అరాచకాలు, దోపిడీపై సాయుధ పోరాటానికి కమ్యూనిస్టు పార్టీ పిలుపునిచ్చింది. అన్ని కులాలవారు, మతాలవారు సంఘం నాయకత్వాన ఏకమై పోరాడారు. పోరాటంలో కులాల మధ్య భేదాలు లేవు. మహిళలు, పురుషులన్న భేదభావంలేదు. అన్ని వర్గాల వారూ, బాలలు, బాలికలూ పాల్గొన్నారు. గెరిల్లా దళాలేర్పడ్డాయి. సంఘం నాయకత్వాన గ్రామాలలో కమిటీలు ఏర్పడ్డాయి. ఎక్కడికక్కడ తిరుగుబాట్లు ప్రారంభమయ్యాయి. దీంతో దేశ్‌ముఖ్‌లు, భూస్వాములు పట్టణాలకు పారిపోయారు. కొమురయ్య మరణం, రైతాంగంలో నిద్రాణమై ఉన్న ఆగహాన్ని ప్రజ్వరిల్ల జేసింది. నల్గొండ, వరంగల్ జిల్లాల్లో ప్రజలు మూకుమ్మడిగా విజృంభించారు. ఇతర ప్రాంతాలలో వేలాది గ్రామాలకు విస్తరించింది. పదిలక్షల ఎకరాల భూమిని పేదలకు, దున్నేవారికి పంచారు. వెట్టి చాకిరిని రద్దు చేశారు. గ్రామాలలో గ్రామకమిటీల ఆధ్వర్యంలో పరిపాలన మొదలయింది. పదివేల మందితో గ్రామదళాలు, 2000 వేల మందితో గెరిల్లా దళాలు ఏర్పడి పనిచేశాయి. ఇది భరించలేని దొరలు, నిజాం పోలీసులు అణచివేయటానికి తీవ్రంగా పని చేశారు. బైరాన్‌పల్లి గ్రామంలో ప్రజలను కట్టేసి కాల్చి చంపారు. మహిళలపై దాడి చేసి చెరిచారు. అయినా జనం చలించలేదు. తిరుగుబాటు ఆగలేదు.
ఖాసిం రజ్వీ నాయకత్వాన ప్రవేటు సైన్యం నిజాంకు, జమీందార్లకు సహాయంగా రజాకార్లను ఏర్పాటుచేసి అరాచకం సృష్టించారు. నిజాం అరాచకాలను పత్రికలలో ప్రశ్నించిన షోయబుల్లా ఖాన్‌ను నడిరోడ్డుపై కత్తులతో పొడిచి చంపారు. రావినారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మగ్దూం మొహియుద్దీన్, మల్లు స్వరాజ్యం, భీమిరెడ్డి సర్పింహారెడ్డి, ఆరుట్ల రాంచంద్రారెడ్డి, ఆరుట్ల కమాలాదేవి.. ఇంకా ఎందరెందరో ప్రాణాలకు తెగించి వీరోచితంగా పోరాడారు. కమ్యూనిస్టు దిగ్గజం పుచ్చలపల్లి సుందరయ్య స్వయంగా ఈ పోరాటానికి నాయకత్వం వహించారు. తెలంగాణలో కమ్యునిస్టుల ప్రాబల్యం పెరుగుతోందని కేంద్రం అప్పటికే గ్రహించింది. నిజాం ప్రభుత్వాని ప్రజల తిరుగుబాటును తట్టుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఇలాంటి స్థితిలో నెహ్రూ సైన్యాలు తెలంగాణపైకి వచ్చి దాడి చేశాయి. నైజాం ఏమీ ప్రతిఘటించలేదు. లొంగిపోయి తెలంగాణను విలీనం చేశాడు.
నిజాలు తెలుసుకోవాలి
నైజాం లొంగిన తర్వాత కూడా భారత సైన్యం 1951 వరకు ఇక్కడే ఉంది. ఉండి వారు చేసిందేమీటంటే, సంఘం నాయకత్వాన్ని నిర్మూలించే పని చేపట్టారు. నాలుగు వేలమంది నాయకులను, కార్యకర్తలను చంపేశారు. పంచిన భూమిని తిరిగి భూస్వాములకు ఇచ్చే పనికి పూనుకున్నారు. ప్రజలను దోపిడీ చేసిన నైజాంను దేశప్రముఖ్గా ప్రకటించి, ఆయన పేరునే పరిపాలన సాగించారు. జీతమిచ్చారు. నష్ట పరిహారమూ అందించారు. అరాచకాలు చేసిన ఖాసీం రజ్వీని క్షేమంగా బయటికి పంపించారు. ఇదీ విలీన కథ. భారత పోలీసుల బీభత్సకాండలో దళాలు తల్లడిల్లాయి. పెద్దఎత్తున హత్యాకాండ జరిగింది. 1951 అక్టోబర్‌లో సాయుధ పోరాటాన్ని విరమించింది. అయితే ఈ పోరాట ఫలితంగానే దేశంలో భూ సంస్కరణలు జరిగాయి. కౌలుదారీ చట్టం వచ్చింది. వెట్టి చాకిరి రద్దు చేయబడింది. ప్రజల భాషలో బడులు వచ్చాయి. ప్రజాస్వామిక హక్కు పొందాము. ఇవన్నీ రైతాంగ పోరాటం వల్లనే సాధ్యమయింది.
ఇందులో ఆరెస్సెస్కుగానీ, జనసంఘ్కుగానీ, బీజేపీకిగాని ఏ ప్రమేయం లేదు. వాళ్లంతా జమీందారుల పక్షమే ఉన్నారు. జరిగిన పోరాటమంతా దోపిడీదారులకు, దోపిడికి గురవుతున్న వారి మధ్యనే కానీ, ఈ పోరును హిందూ ముస్లింల మధ్య జరిగినదిగా మార్చే దుష్ట ప్రయత్నం జరుగుతోంది. రజాకార్ సినిమా అదే బోధిస్తుంది. ప్రజలు, యువత నిజాలు తెలుసుకుని కుట్రలు, కుతంత్రాలను తిప్పికొట్టాలి. ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి!
కె. ఆనందాచారి
99487 87660



