Saturday, September 12, 2026
E-PAPER
Homeమానవిచెప్పకుండా తీస్తే...

చెప్పకుండా తీస్తే…

- Advertisement -

ప్రియమైన వేణు గీతికకు
ఎలా ఉన్నావు నాన్నా? నేను విశాఖపట్నం నుండి తిరిగి హైదరాబాద్ చేరుకున్నాను. అక్కడ ఉన్న నాలుగు రోజులు విపరీతమైన జ్వరం. నావల్ల వాళ్లకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అని భయ పడ్డాను. కృష్ణ మామ దగ్గరుండి మందులు వేయడం, జ్వరం చూడటం, ఎలెక్ట్రోల్ తాగించడం చేసాడు. ఫంక్షన్ రోజు కూర్చోగలిగాను. ఫంక్షన్ చాలా బాగా జరిగింది. హైదరాబాద్ వచ్చాను కానీ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. నువ్వు బుల్లెట్ నడుపుతున్న వీడియో చూసాను. చాలా బాగా నడుపుతున్నావు. కానీ జాగ్రత్త, హెల్మెట్ పెట్టుకో. ట్రాఫిక్‌లో నడపడం నెమ్మదిగా సాధన చేయి. సరే నాన్నా! ఇక అసలు విషయానికి వస్తాను. పిల్లల పెంపకం గురించి చెప్తున్నా కదా! ఈ సారి చెప్పేది ఇంట్లో నుండి డబ్బులు తీసుకెళ్లడం గురించి. ఇంతకు ముందు ఉత్తరంలో పిల్లలకు డబ్బు విలువ చెప్పాలి అన్నాను. అయితే డబ్బులు ఇవ్వకుండా కట్టడిచేసినప్పుడు వాళ్ళు దారి తప్పే అవకాశం కూడా ఉంటుంది. స్నేహితుల ప్రభావంతో వాళ్లు కూడా ఖర్చు పెట్టాలనుకుంటారు. ఇంట్లో అడిగినప్పుడు ఇవ్వకపోతే చెప్పకుండా తీసుకెళుతుంటారు. ఇలాంటివి అస్సలు ప్రోత్సహించకూడదు. వాళ్ల దృష్టిలో అది తప్పు కాకపోవచ్చు, కానీ అది ముమ్మాటికీ తప్పే. వస్తువైనా, డబ్బైనా ఇంట్లో వాళ్లకు చెప్పి తీసుకోవాలి. చెప్పకుండా తీసుకోవడం అలవాటుగా మారితే ప్రమాదం.

నా చిన్నప్పుడు మా బంధువుల ఇంట్లో వాళ్ల పిల్లలతో కలిసి ఉండేదాన్ని. నా దగ్గర ఒక బ్యాగ్ ఉండేది. అందులో ఎంతో కొంత డబ్బులు ఉండేవి. నేను వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్లినా నా డబ్బులు మాయం అవుతూ ఉండేవి. అలాగని వాళ్లకు చెప్పలేను. ఇంట్లో అందరూ పెద్ద వాళ్లే, ఎవరు తీసేవారో తెలిసేది కాదు. చాలా రోజులయ్యాక తెలిసింది, వాళ్ళ పిల్లల్లో ఒకరు డబ్బులు తీస్తున్నారని. ఆ ఇంట్లో వాళ్లు పిల్లలకు డబ్బులు అందుబాటులో లేకుండా చేశారు. దాంతో ఇలా వచ్చిన బంధువుల దగ్గర డబ్బులు చెప్పకుండా తీసుకునేవారు. అప్పటి నుండి వాడొక దొంగ అనే భావనతోనే ఉండే వాళ్ళం. అందుకే పిల్లలకు అందుబాటులో ఉంచినా చెప్పకుండా మాత్రం తీయకూడదని నేర్పించాలి. నువ్వు ఏ రోజూ చెప్పకుండా ఏమీ తీసుకునే దానివి కాదు. ఈ రోజు నువ్వు సంపాదన పరురాలివి అయినా కూడా జాగ్రత్తగా ఖర్చు పెడతావు. నేను కూడా డబ్బులు అవసరమైనా నీ దగ్గర అడిగి తీసుకుంటాను. లేదా ఖర్చు పెట్టాల్సి వస్తే డబ్బులు తీసుకుంటున్నాను అని నీకు ఫోన్ చేసి చెప్తాను. ‘నా కేందుకు చెప్తావు అమ్మా!’ అని నువ్వు అన్నా, నా దృష్టిలో మాత్రం చెప్పి చేయాల్సిందే. డబ్బు మనిషిని అనేక రకాలుగా మార్చేస్తుంది. కనుక దానికి బానిస అవ్వకుండా జాగ్రత్త పడాలి. ఉంటాను నాన్నా! రాయలేకపోతున్నాను, చాలా నీరసంగా ఉంది.

ప్రేమతో అమ్మ
పాలపర్తి సంధ్యారాణి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -