Sunday, September 13, 2026
E-PAPER
Homeసందర్భంమట్టి గణపతిని పెట్టండి.. పర్యావరణాన్ని కాపాడండి

మట్టి గణపతిని పెట్టండి.. పర్యావరణాన్ని కాపాడండి

- Advertisement -

సెప్టెంబర్‌ 14న వినాయక చవితి ప్రారంభం కానుంది. మరోసారి గణనాథుడి నామస్మరణతో దేశమంతా మార్మోగబోతోంది. బంకమట్టికి ప్రాణం పోసే శిల్పుల చేతుల్లో గణపతి విగ్రహాలు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. గ్రామాలు, పట్టణాలు, నగరాలు, ఇండ్లు కొద్ది రోజుల్లో గణనాథుల విగ్రహాలతో నిండిపోతాయి. వినాయక చవితి కేవలం ఒక పండుగ కాదు. అది భక్తి, సంస్కృతి, సామరస్యం, సామాజిక బాధ్యతకు ప్రతీక. ‘భిన్నత్వంలో ఏకత్వం’ అనే భారతీయ జీవన తత్వాన్ని సజీవంగా ఆవిష్కరించే మహోత్సవం. అయితే కాలం మారుతున్న కొద్దీ ఉత్సవాల రూపురేఖలు కూడా మారుతున్నాయి. భక్తి స్థానంలో ఆర్భాటం, సంప్రదాయం స్థానంలో ప్రదర్శన, ప్రకృతి స్థానంలో రసాయనాలు చోటుచేసుకుంటున్నాయి. మనం దేవుడిని పూజిస్తున్నామా? లేక తెలియకుండానే ప్రకృతిని శిక్షిస్తున్నామా? ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన సమయం వచ్చింది.

నేడు ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌ (POP) విగ్రహాలు మార్కెట్‌ను ఆక్రమించాయి. తక్కువ ధర, తక్కువ బరువు, భారీ పరిమాణాల్లో తయారీకి అనుకూలత, ఆకర్షణీయమైన రంగులు, సులభమైన రవాణా వంటి కారణాలతో చాలామంది వాటినే ఎంచుకుంటున్నారు. ఉత్సవ కమిటీలు కూడా భారీ విగ్రహాల వైపు మొగ్గు చూపుతున్నాయి. అయితే కంటికి కనిపించే అందం వెనుక దాగి ఉన్న ప్రమాదాన్ని మాత్రం చాలామంది గుర్తించడం లేదు. POP విగ్రహాల తయారీలో జిప్సమ్‌తో పాటు పాదరసం, సీసం, క్రోమియం, ఆర్సెనిక్, కాడ్మియం వంటి హానికర లోహాలు, రసాయన రంగులు ఉపయోగిస్తారు. నిమజ్జనం అనంతరం ఇవి నీటిలో కరగకుండా చెరువులు, కుంటలు, సరస్సులు, నదుల్లో పేరుకుపోతాయి. నీటిలో ఆక్సిజన్‌ శాతం తగ్గిపోవడంతో చేపలు, ఇతర జలచరాలు మృత్యువాత పడతాయి. జలవనరుల సహజ సమతుల్యత దెబ్బతింటుంది. అదే కలుషిత నీరు భూగర్భ జలాల్లోకి చేరి, వ్యవసాయానికి, తాగునీటికి ఉపయోగపడినప్పుడు చివరకు మన ఆరోగ్యంపైనే ప్రభావం చూపుతుంది. శ్వాస సంబంధ వ్యాధులు, చర్మ సమస్యలు, జీర్ణ సంబంధ ఇబ్బందులు, దీర్ఘకాలిక అనారోగ్యాలకు ఈ కాలుష్యం కారణమయ్యే ప్రమాదం ఉందని వైద్య, పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

శ్రమకు గౌరవం ఇవ్వాలి
POP విగ్రహాల వినియోగాన్ని తగ్గించాలనే పిలుపు కళాకారుల ఉపాధికి వ్యతిరేకం కాదు. వేలాది కుటుంబాలు విగ్రహాల తయారీపై ఆధారపడి జీవిస్తున్నాయి. వారి శ్రమకు గౌరవం ఇవ్వాలి. అయితే పర్యావరణహిత మట్టి విగ్రహాల తయారీకి ప్రోత్సాహం కల్పించడం ద్వారా ఉపాధిని కాపాడుతూ ప్రకృతిని కూడా రక్షించవచ్చు. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, సమాజం కలిసి మట్టి విగ్రహాల తయారీకి అవసరమైన శిక్షణ, ప్రోత్సాహం అందిస్తే సంప్రదాయ కళాకారులకు కొత్త అవకాశాలు లభిస్తాయి.

మట్టిదే మహత్తరం
మట్టి గణపతి ప్రకృతితో మమేకమయ్యే ప్రతీక. బంకమట్టి, సహజ పదార్థాలు, సహజ రంగులతో తయారైన విగ్రహాలు నిమజ్జనం తర్వాత సులభంగా కరిగిపోతాయి. నీరు కలుషితం కాదు. నేల దెబ్బతినదు. జీవరాశులకు హాని కలగదు. ప్రకృతి నుంచి వచ్చిన మట్టిని పూజించి తిరిగి ప్రకృతిలో కలపడం భారతీయ సంస్కృతి గొప్పదనం. మనం ఈ వినాయక చవితిని ఒక కొత్త దిశగా మలచుకోవాలి. ప్రతి ఇంటా మట్టి గణపతే ప్రతిష్ఠించాలి. ప్రతి మండపం పర్యావరణ హిత ఆచరణకు వేదిక కావాలి.

ఒక ఊరు ఒక గణపతి
వినాయక చవితి అసలు స్ఫూర్తి ఐక్యత. ఒకప్పుడు గ్రామంలో ఒకే గణపతి ఉండేవాడు. ఊరంతా కుల, మత, వర్గ భేదాలు మరిచి ఒకే మండపం వద్ద చేరేవారు. ఆ వాతావరణంలో ఆత్మీయత, సామాజిక కనిపించేది. కాలం మారుతున్న కొద్దీ ఉత్సవాల నిర్వహణలోనూ మార్పులు వచ్చాయి. ఇప్పుడు ప్రతి వీధికో విగ్రహం కనిపిస్తున్నాయి. అనవసర పోటీలు, ఆర్భాటాలు, ఆర్థిక భారం పెరగడం ఆందోళన కలిగించే అంశం. విగ్రహాల సంఖ్య పెరగడం కంటే మన మధ్య ఐక్యత పెరగడం ముఖ్యం.

డీజే హోరు వద్దు
వినాయక ఉత్సవాల్లో మరో ముఖ్యమైన అంశం శబ్ద కాలుష్యం. భక్తి గీతాల స్థానంలో చెవులు పగిలే స్థాయిలో డీజేలు, భారీ సౌండ్‌ సిస్టమ్‌లు వినిపించడం ఇటీవల ఎక్కువైంది. ఉత్సాహం పేరుతో ఇతరుల ప్రశాంతతను దెబ్బతీయడం సమంజసం కాదు. అధిక శబ్దం వల్ల చిన్నారులు, వృద్ధులు, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాగే ఉత్సవాలు ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేందుకు ప్రభుత్వ శాఖలు సూచించే నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలి. మట్టి గణపతులను ప్రతిష్ఠించిన వారు సాధ్యమైనంత వరకు ఇంటి వద్దనే లేదా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కృత్రిమ నిమజ్జన కుండీల్లో నిమజ్జనం చేయడం ఉత్తమం. దీని వల్ల చెరువులు, కుంటలు, నదులు కాలుష్యానికి గురికావు.

గడగోజు రవీంద్రాచారి, 9848772232

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -