భారతీయ ఆధునిక దృశ్యకళాయానం – 15
దేశానికి స్వాతంత్ర్యం వచ్చినాక ప్రతీ కేంద్రంలో కళాకారులూ వారి వారి ప్రాంతీయ గుర్తింపు, అది భారతదేశ గుర్తింపు కావాలనీ, అలా కళలు చేయాలని సాధన చేశారు. బెంగాలు వారు వారి బంగ్లా గుర్తింపు కోసం ఆలోచిస్తే, బొంబాయి ప్రోగ్రెసివ్ కళాకారులు, అంతర్జాతీయతతో పాటూ మన దేశ ఆధ్యాత్మిక, సామాజిక, దైనందిన జీవితపు విషయాలపై చిత్రాలు వేయాలని ఆలోచించి ముందుకు వెళ్లారు. మరో ముఖ్య కళాకేంద్రం మద్రాసు ఆర్ట్ & క్రాఫ్ట్ స్కూల్. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఇక్కడి కళాకారులు, దేశంలోని మరో ప్రాంతాల కళలూ, సంస్కృతీ ప్రతిపాదించడం వారి గుర్తు ఎలా అవుతుందని, తమ కళలకు ప్రాతిపదిక వేయాలని ఆలోచించారు. అలా అని వారు ఒక సంస్థలా పేరు పెట్టుకోలేదు. కానీ ఆ అవగాహనతో ముందుకు నడిచారు.
మద్రాసు స్కూల్‌కి మొదటి భారతీయ అధ్యక్షుడు దేవీప్రసాద్‌రాయ్ చౌదరి. బ్రిటీష్ వారి దగ్గర నుంచి 1929లో ఆయన చేతికి ఆధ్వర్యం వచ్చింది. 1957 వరకూ ఆ స్కూల్ ఆయన నడిపించాడు. ఈయన కలకత్తా కళాకారుడు అబనీంద్రనాథ్ టాగోర్ వద్ద కళను అభ్యచించినా, ఆ పద్ధతులు వదిలి, తన ఆలోచనలతో ముందుకు నడిచాడు. శిల్పం చేశాడు. విద్యాబోధనపై ధ్యాస పెట్టాడు. ఆ తరువాత ఆ స్కూల్‌కి అధ్యక్షుడిగా పని చేసిన కె.సి.యస్. ఫణికర్, అక్కడే కళాభ్యాసం చేసిన అధ్యాపకుడయ్యాడు. ఈయన ద్రవిడ ప్రాంతీయుడు. ఈయన 1911లో జన్మించి 1977లో పరమపదించాడు. ఆధునిక కళలకు ప్రాంతీయ సిద్ధాంతాన్ని ఆపాదించి ఆనాటి, ఆ ప్రాంత కళలను ముందుకు తీసుకువెళ్లాడు. మద్రాసు కళాపద్ధతీ, ఆలోచనలకు మకుటమయ్యాడు. ఆ రోజుల్లో బొంబాయి, బెంగాలు వారి కళల పేరు మారుమోగుతోంది. వెనుకబడి వుండిన మద్రాసు కళాకారులను ముందుకు నడిపించాలి, వారి ఆలోచనా పద్ధతి వారి గుర్తులుగా పని చేయాలని తలచి ఆ ప్రాంత కళలను ముందుకు నడిపాడు.
పాశ్చాత్య కళా పద్ధతులు తెలిసినవాడేను. తన ప్రాంతీయ సంస్కృతి తమ ఆధునిక కళలకు గుర్తులా, చిహ్నంలా కళలు చేయాలని ఆలోచించాడు. ఆ కళలను చూసి మద్రాసు ప్రాంతీయ ఆధునిక కళలని ఎరుకలోకి రావాలన్నాడు. మన పురాతన గ్రంథాలలోని రాత ప్రతుల లిపిని ఒక దృశ్యంలా, కలీగ్రఫీలా చిత్రించాడు. అవి అక్షరాలుగా చదవటానికి కాదు. అందు వున్న ఆకారాన్ని, సంస్కృత పద్యాలలోని గుర్తులు, లోతులు కన్పించేలా చిత్రం వేయమొదలెట్టాడు. అంతేకాదు, 1966లో అక్కడి కళాకారులందరినీ, చోళమండల కళాకారుల గ్రామం అని చెన్నైకి దగ్గర, అక్కడ అందరూ కలిసి నివసిస్తూ కళలు చేయ మొదలుపెట్టించాడు. దీనికి దర్శకులూ రావచ్చు. ఒక విధంగా ఇది చోళమండల పురోగతి గ్రామం అని చెప్పవచ్చు. చాలామంది కళాకారులు ఈ కట్టులో చేరారు. రాయ్ చౌదరి, ఫణికర్ బోధనలు తీసుకుని వారి ఆలోచనలు జోడించి ముందడుగు వేశారు.
ఎస్.ధనపాల్ (1919- 2000) : రాయ్ చౌదరి వలన బెంగాలు మరియు దక్షిణ భారత సనాతన శిల్ప ప్రభావం వలన, 1950 నుండి ఆధునిక శిల్పం చేశాడు. దక్షిణ భారత జానపద చిత్రం నుండి, పురాణాల నుండి ఆలోచనలు తీసుకుని శిల్పం చేశాడు. గుర్తుండే శిల్పి అయ్యాడు. మద్రాసు ఆర్ట్ కాలేజీ శిల్ప విభాగ అధ్య్‌క్షుడయ్యాడు.
సి.యస్.యన్.పట్నాయక్ (1925 -2022) : ఈయన తెలుగువాడు. శ్రీకాకుళం నుండి మద్రాసు కళాభ్యాసానికి వెళ్లాడు. ఆ తరువాత రాజస్థాన్‌లోని వనస్థలి విద్యాపీఠ్‌కు వెళ్లి ఫ్రెస్కో చిత్రం నేర్చుకున్నాడు. గుంటూరు స్ర్తీల కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశాడు. తెలంగాణ లెజిస్లేసివ్ అసెంబ్లీ వద్ద ఈయన చేసిన మహాత్మాగాంధీ శిల్పం ఈయనకు పేరు తెచ్చి పెట్టింది. ఈయన ఎన్నో లోహపు శిల్పాలు, చిన్న పెద్ద ఆకారాల్లో చేశాడు. ఎన్నో దేశ విదేశీ ప్రదర్శనలు చేశాడు.
వి.పి.జానకీరామ్ (1930 – 1995) : అక్కడి శిల్పవిభాగం అధ్యక్షుడు ధనపాల్ శిష్యుడు. ఒక కొత్త పద్ధతి మొదలెట్టి శిల్పం చేశాడు. ఒక లోహపు రేకును మలచి పలుచటి శిల్పాలు ముందు భాగ ప్రాధాన్యం ఇచ్చి శిల్పాలు చేశాడు. ఆ లోహపు రేకుకు నొక్కులతో ఆకారం దిద్దాడు. అవి చేస్తున్నప్పుడు చోళులకాలం నాటి లోహ శిల్పాలు గర్తుపెట్టుకున్నాడు. ఈయన శిల్పాలు పలుచటి శిల్పాలు. ఈయన పద్ధతి తరువాతి శిల్పులను ఎంతో ప్రభావితం చేసింది. మందిరాల దేవతా మూర్తుల కవచాలు, మాస్కు ముసుగులకు మల్లే ఈయన శిల్పాలు వుంటాయి.
అంత్యాకుల పైడిరాజు (1919 – 2012) : విజయనగరం నుండి వెళ్లిన తెలుగువాడు. అక్కడ చదువుకుని తెలుగు జానపద కళల పద్ధతిన కళలు చిత్రించి అది తన ప్రాంతీయ ఆధునికతగా నిలబెట్టాడు. ఈయన గురించి మనం ఇదివరకే మాట్లాడాం.
సి.దక్షిణామూర్తి (1943 – 2018) : తన చిన్నతనాన ఆటలాడిన ఎర్రమట్టిని, తన జ్ఞాపకాలతో పాటు శిల్పాలుగా మార్చాడు. లోహపు శిల్పాలూ చేశాడు. మానవ శరీర అందమైన సున్నితమైన ఆనందాన్ని శిల్పాలలో తీసుకురావడం మొదలుపెట్టాడు.
పి.ఎస్.నందన్ అనే శిల్పి కూడా తన చిన్ననాటి జ్ఞాపకాల ఆధారంగా కళలు చేశాడు. ఇతను సంప్రదాయ కళాకారుల కుటుంబంవాడు.
ఎస్.నందగోపాల్ (1946 – 2017) : ఈ చోళమండల కళాగ్రామంలోని మరో ముఖ్యమైన కళాకారుడు. ఈ ఉద్యమం మొదలుపెట్టిన కె.సి.యస్.ఫణిక్కర్‌కి కొడుకు. ఇతను మన జానపద, ఆదివాసి సంప్రదాయక కళలనుండి ప్రభావితమై శిల్పం చేశాడు. రాగి, ఇత్తడి వెల్డింగ్ చేసి ఒకే పక్కన కనపడే శిల్పంలా, ఆ మిశ్రమాన్ని కావలసిన ఆకారాల్లో ఉబ్బెత్తు రూపాలుగా మలచి శిల్పం చేశాడు. ఇవి గుడి గోపురాలు, గ్రామదేవతల ఊరేగింపులలో ఎత్తే కవచాలు వీటినుంచి ప్రభావితమయ్యాడు. ఈయన శిల్పాలు గుర్తుండేలా దర్శకులను ఆకర్షిస్తాయి. తండ్రిది మరో రకం కళల పద్ధతి. అయితే తను తన పరిచయం పెంచేలా మరో రకం కళలు చేశాడు. కానీ అక్కడి కళాకారుల సిద్ధాంతం ప్రకారం ద్రవిడ సంప్రదాయ కళలను ఆధునిక కళలలోకి అడుగు పెట్టించాడు. జానకీరామ్ శిష్యుడు.
టి.ఆర్.పి. మూకయ్య రాయ్ చౌదరి, ధనపాల్ శిష్యుడు. రాయి, లోహం, టెర్రకోటలో గుండ్రటి శిల్పం చేశాడు.
ఎన్.జి.విద్యాశంకర్ స్థపతి : కుంబకోణంలో ఉండి అక్కడి సంప్రదాయ శిల్పం చూశాడు. ఇతని శిల్పాలు పంచలోహాలతో చోళ శిల్పంలా అనిపిస్తాయి. కానీ తన ఊహ ప్రకారం ఆ శిల్పాలకు సౌందర్యం జోడించాడు.
ఎమ్.రెడ్డప్ప నాయుడు (1932- 2000) : మన సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని నమ్మాడు. మన పురాణ కథలను తీసుకుని, తన పద్ధతిన చిత్రీకరించాడు. కానీ కథను మార్చలేదు. ఆయన చిత్రాలు కొత్తదనంగా అనిపించినా, ఇవి మన పురాణ కథలా అని ఆశ్చర్యం కలుగుతుంది. అతి సరళరూపంగా, ఒక కవితలా వుంటాయి ఈయన చిత్రాలు.
కె.శ్రీనివాసులు (1923 – 1995) : లేపాక్షి, తంజావూరు పద్ధతుల మిశ్రమ చిత్రంగానో, తెలుగు జానపద కళాపద్ధతులుగానో అనిపించే కళలు చేశాడు. ఇతనూ తెలుగు వాడే. అక్కడ కళాభ్యాసం చేశాడు.
జె.సుల్తాన్ అలీ (1920 – 1990) : ఆదివాస, జానపద, తాంత్రిక పద్ధతులను ఒకదానితో ఒకటి కలిపి చిత్రించాడనిపిస్తుంది.
వి. అర్నవాజ్ (1945 – 1988) : ఈమె పార్సీ వనిత. హిందూ పురాణ కథలపై ఆసక్తి గల కళాకారిణి. ఈమె చిత్రాలు ఒక తీగలా సాగినట్టు వుంటాయి.
కె.రామానుజన్, ఆర్.సారంగన్, సనాతనరాజ్, హరిదాసన్, మునుస్వామి వంటివారు మన పురాణేతిహాసాల, తాంత్రిక సంప్రదాయాల ప్రకారం రూపం దిద్ది కళలు చేశారు.
ఎస్.జి.వాసుదేవ్ : కల్పవృక్షం ఆధారంగా వృక్ష అనే శీర్షికన చిత్రాలు వేశాడు.
ఆర్.బి.బాస్కరన్, మురళీధరన్, ఆదిమూలం, అచ్యుతన్ కుడలూర్, డోగ్లాస్ వంటివారు కొత్త మార్పులు తెచ్చారు. ఆర్.ఎమ్.పళనియప్పన్ గణితమూ, చిత్రమూ కలుపుతూ సరళమైన చిత్రం వేస్తాడు. వసుధాతొజూర్ స్ర్తీ వాదన ఆధార చిత్రం వేస్తుంది.
ఒక ప్రత్యేకత సంతరించుకుని, ప్రాంతీయ గుర్తుతో చోళమండల కళాకారులు ఎంతో ముందడుగు వేశారు.
(ఎస్.జి.విద్యాశంకర్, ఆర్.బి.భాస్కరన్, సి.దక్షిణామూర్తి చిత్రాలు వ్యాసంలో ప్రచురించబడినవి, చండీగడ్ మ్యూజియంలో పొందుపరచి వున్నాయి.)
డా.యం. బాలామణి, 8106713356



