Sunday, September 13, 2026
E-PAPER
Homeహెల్త్భరించడమా.. తెగించడమా...

భరించడమా.. తెగించడమా…

- Advertisement -

ఎవరికి ఇష్టమైన పనిని వారు చేయాలి అనుకుంటే సవాళ్ళను ఎదుర్కొనక తప్పదు. సవాళ్ళకు భయపడి వాటినుండి తప్పించుకోవాలనుకుంటే స్వేచ్ఛను వదులుకోక తప్పదు. కష్టమైన దాన్ని భరించే శక్తి అయినా వుండాలి. ఇష్టమైన దాన్ని ఎంచుకోగల ‘తెగువ’ అయినా వుండాలి.

ఇటీవలి కాలంలో అసంఖ్యాకమయిన వృత్తి నిపుణులు తమకు వ్యక్తిగత, వృత్తిపరమైన ఆత్మసంతృప్తి అందివ్వగల మరింత పరిపూర్ణమైన కెరీర్ గురించి తపన పడుతూ వున్నారు. తమ ఉజ్వలమైన భవితవ్యాన్ని తమ కలలకు అనుగుణంగా మలుచుకోవటంలో తమకు పూర్తి స్వేచ్ఛ వుండాలని వారి పట్టుదల. తాము స్వయంగా తీసుకునే నిర్ణయంపట్ల, పూర్తి విశ్వసనీయత కనపరుస్తూ వుంటేనే తమ ప్రజ్ఞా పాటవాలు నిర్బంధరహితంగా పెల్లుబికి రాగలవని వారి ఆశ. అంతేకాదు తాము తీసుకున్న నిర్ణయం ‘సరియైనదే’ అని తమ అంతరంగానికి చెప్పుకోగల, చెప్పి ఒప్పించగల స్వావలంబన అనివార్యమని భావిస్తున్నారు.
జాబ్ శాటిస్ఫేక్షన్ అంటే.. ఉద్యోగంలో సంతృప్తి. ఆత్మసంతృప్తి గురించి తరచూ పలువురు పలురకాలుగా వ్యాఖ్యానిస్తుంటారు. ‘నాకు జాబ్ శాటిస్ఫేక్షన్ పుష్కలంగా వుంది’ అంటారు కొందరు. మరి కొందరయితే ఇందుకు విరుద్ధంగా ‘జాబ్‌లో సాటిస్ఫేక్షన్ వుంది కానీ వ్యక్తిగతంగా మాత్రమే నేను అసంతృప్తితో నలిగిపోతున్నాను. ఏ కారణంచేతనో నేను మనఃశ్శాంతిగా వుండలేకపోతున్నాను’ అంటారు. వారు ఎంచుకున్న వృత్తి లేదా ఉద్యోగాన్ని వారి ఘటనాఘటన సామర్ధ్యానికి పదును పెట్టి, తెలివి తేటలతోను, స్వయం సామర్ధ్యాలతోను చక్కగా మేనేజ్ చేయగలుగు తున్నామనే భావన అయితే బాగానే వుంటోంది. కానీ, అసలు తాము ఎంచుకున్న రంగానికి, తమ వ్యక్తిత్వపు విలువలకు పొంతన వున్నదా లేదా అని ఏనాడూ ఆలోచించకపోవడం వలన, వారికి తెలియని ఈ నైరాశ్యం వెంటాడుతూ వుంది. అందుకే వ్యక్తిగతంగాను, ఉద్యోగపరంగాను ఆత్మ సంతృప్తినివ్వగల “పని” ఏమిటి అనే ఆలోచన వారి బుర్రలో సామాజిక పరిస్థితులు, ఆర్థిక ఒత్తిళ్ళు, తమ విలువలకు సానుకూలంగా వుండే మేధావులలో సైతం ఈనాడు నెలకొని వుంది. తమకు బహిర్గతంగా ఎదురయ్యే ఒత్తిళ్ళను వృత్తిని గానీ, ఉపాధినిగానీ ఎంచుకునే స్వేచ్ఛను పరిమితం చేసేస్తున్నాయనే వేదన తెలివిగా అధిగమించేంత స్థాయి వరకూ, తమ తమ వృత్తి ఉద్యోగాలను విజయవంతంగా నిర్వర్తించగలుగుతున్నారే తప్ప, ఇతరత్రా తమ వ్యక్తిగత విలువలకు తగిన జీవితాన్ని గడుపుతూ, ఆత్మ సంతృప్తిని పొందగలిగే పరిస్థితి మాత్రం కానరావడం లేదు.

మనకు మనమే శత్రువులుగా వుండాలి..!
ఆధునిక జీవితపు ఒత్తిళ్ళను సమర్థించుకుంటూ పోవడంలో కొంత వ్యక్తిగత దృక్పథానికి ప్రాధాన్యతనివ్వడం దానంతట అదే తగ్గిపోతూ వుంటుంది. కాగా ఈ అనివార్య పరిస్థితిని తప్పించలేమని కెరీర్ ఎక్స్ పర్ట్ జోయిసీ వీజ్ (joyce weiss) అంటాడు. అందుచేత ఈ పరిస్థితిని ఎటూ తప్పించుకోలేం కాబట్టి, ఇందుకు నిరంతరం కుమిలిపోతూ, ఘర్షణపడుతూ వుండేకన్నా మనకు మనమే శత్రువులుగా మనగలగటం ఉత్తమం అంటాడాయన. అంటే.. వ్యక్తిగత ఇష్టాలను గుర్తించడం వదిలిపెట్టి వ్యతిరేకించమంటాడు. అలా వ్యతిరేకించడం ద్వారా స్వేచ్ఛా రాహిత్యాన్ని భావించే శక్తి ఏర్పడ్తుంది. ఎప్పుడయితే ‘పరిధి’ ఇంతే అన్న భావనకు లోనవుతామో ఆ పరిధిలోపలే అసమాన ప్రతిభా సామర్ధ్యాలను చూపించగల శక్తి విడుదల అవుతుంది. ఆ మేరకు.. చేస్తూ వున్న వృత్తి వ్యాపారాదులలో గణనీయమైన ప్రగతినే సాధింపగలమని ఒక అంచనా. ఉదాహరణకు గదిలో బంధించి పిల్లిని కొడితే అది పులిలా మారి తిరగబడినట్లు తమ పరిధిని తెలుసుకున్న ఉద్యోగులు, తమ పరిధిలోనే అదనపు శక్తి సామర్ధ్యాలను చూపించే అవకాశముందనేది జోయిసీ వీజ్ అభిప్రాయం.

మనకు మనమే మిత్రులుగా
ఇకపోతే మిగిలిన మరొకదారి.. మనకు మనమే ఉత్తమ స్నేహితులుగా గుర్తించి, మనకి మనం అనంతమైన తోడ్పాటునందివ్వటానికి సిద్ధపడాలి. ఏ వ్యక్తికయినా, తనపట్ల తాను మైత్రి భావాలతో మెలగడం అంటే మహదానందంగాను, ఈ ప్రపంచంలో తను అత్యంత ప్రాణప్రదమైనదిగాను అన్పిస్తుంది. ఈ పరిణామం ఒక శుభ పరిణామమే. దీనివల్ల ఘర్షణ తప్పుతుంది, విచారం పోతుంది. స్వేచ్ఛారాహిత్యం అనే సమస్య వుండదు. ఉండే సమస్య ఒక్కటే, బహిర్గత సమస్యలు, ఒత్తిళ్ళు, స్వయం రాజా, స్వయం మంత్రి పంథాలో వ్యవహరించే వ్యక్తులకు ఈ సమస్య ఎప్పుడూ వుండేదే. ఆర్థిక ఒత్తిళ్ళు జీవితపు సవాళ్ళు నిర్వర్తించలేమన్నంత స్థాయిలో ఆత్మబలం సన్నగిల్లిపోతుంది. ఈ పరిస్థితిని తట్టుకోగల దృఢమైన వైఖరి ఏర్పరుచుకుంటే చాలు పరిస్థితులు మెరుగవుతాయి.

డా.హిప్నో పద్మా కమలాకర్‌
9390044031
కౌన్సెలింగ్‌ సైకో థెరపిస్ట్,
హిప్నో థెరపిస్ట్

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -