కొత్తగా భూముల్ని నిషేధిత జాబితాలో చేర్చలేదు
బీఆర్ఎస్ హయాంలో ఆ క్లాజు దుర్వినియోగం
అప్పుడు విస్మరించి.. ఇప్పుడు ప్రజల్ని రెచ్చగొడుతున్నారు
దర్యాప్తు కోసం చారుసిన్హా చైర్మెన్‌గా ‘సిట్’ వేశాం
ఫోరెన్సిక్ ఆడిట్‌తో భూ అక్రమాల బాగోతం బట్టబయలు
‘22ఏ’పై స్వల్పకాలిక చర్చలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
భూముల్ని నిషేధిత జాబితాలో చేరుస్తూ 22A ను తమ ప్రభుత్వం తీసుకురాలేదని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆ కాలమ్ 1999 నుంచే ఉందనీ, బీఆర్ఎస్ తెచ్చిన ధరణి చట్టం ద్వారా 22A ను దుర్వినియోగం చేశారని చెప్పారు. తొమ్మిదున్నరేండ్లు అధికారంలో ఉన్నప్పుడు పేదలకు న్యాయం చేయాలని ఆనాటి మంత్రి హరీశ్‌రావుకు ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. అప్పుడు విస్మరించి ఇప్పడే కాంగ్రెస్ ప్రభుత్వం 22ఏను తీసుకొచ్చినట్టు ప్రజల్ని రెచ్చగొడుతున్నారని విమర్శించారు. 22A పై శాసనసభలో శనివారం స్వల్పకాలిక
చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సుదీర్ఘంగా మాట్లాడారు. సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో తొలుత, ఆ తర్వాత రాష్ట్రమంతటా భూములపై ఫోరెన్సిక్ ఆడిట్‌ను చేయించామని తెలిపారు.
అందులో వేలాది ఎకరాల భూమి 13 వేల ఖాతాలకు ట్రాన్స్ఫర్ అయిందని తేలిందన్నారు. దీనిపై చారుసిన్హా చైర్మెన్‌గా సిట్ వేశామని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రిజిస్ర్టేషన్ల ఆదాయాన్ని కూడా కొల్లగొడితే.. రూ.కోటీ 89 లక్షలను తమ ప్రభుత్వం రికవరీ చేసిందని గుర్తుచేశారు. ఈ సందర్బంగా ప్రతిపక్ష నాయకులు హరీశ్‌రావు, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్పింగ్స్‌ను స్పీకర్ అనుమతితో సభలో చూపించారు. తద్వారా 22-ఏ లో పెట్టి రిజిస్ట్రేషన్లు నిలిపిశారని చేసిన ప్రచారాన్ని తిప్పికొట్టారు. గతేడాదికి ఈ ఏడాదికి ఏప్రిల్ నుంచి ఆగష్టు వరకు 1,359 కోట్ల రూపాయల ఆదాయం పెరిగిందని చెబుతూ రిజిస్ర్టేషన్ల వివరాలను సభ ముందుంచారు. ధరణి వచ్చిన తరువాత తయారు చేసిన 22-ఏ జాబితానే హైకోర్ట్ ఆదేశాల మేరకు డిసెంబర్ 3, 2025న ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసే సమయంలో పొరపాటు జరిగిందని అంగీకరించారు. తప్పును గుర్తించి వెంటనే దాన్ని సరిదిద్దామని చెప్పారు. 22-ఏ సమస్యను తొమ్మిదన్నరేండ్లు అధికారంలో ఉన్నవాళ్ళు పరిష్కరించి ఉంటే ఈ రోజు ఈ సమస్య వచ్చి ఉండేది కాదన్నారు.
ఇవీ వాస్తవాలు
2023 డిసెంబర్ 7కు ముందు బీఆర్ఎస్ హయాంలో 22A లో 96,61,026 ఎకరాలు, వ్యవసాయేతర భూములు 1,95,812 ఎకరాలు, ప్రయివేటు భూములు 3,95,852 ఎకరాలు…మొత్తంగా 1 కోటి 02 లక్షల 52 వేల 690 ఎకరాలు ఉన్నాయని తెలిపారు. అలాగే 2023 డిసెంబర్ 7 నుంచి ఆగస్టు 31వ తేదీ నాటికి ఇదే 22Aలో ప్రభుత్వ భూములు 96,36,777 ఎకరాలు, వ్యవసాయయేతర భూములు 1,94,543 ఎకరాలు, ప్రయివేటు భూములు 3,73,930 ఎకరాలు…మొత్తంగా 1 కోటి 02 లక్షల 05 వేల 250 ఎకరాలు ఉన్నాయని వివరణ ఇచ్చారు. గతంలో కంటే 22A లో చేర్చిన భూములు 47,440 ఎకరాలు తగ్గాయని చెప్పారు. గతంలో పట్టాల్యాండ్ క్లాసిఫికేషన్ (భూమి స్వరూపం తప్పుగా నమోదు చేయడం వల్ల) టీఎమ్15 మాడ్యూల్ ద్వారా తొలగించిన 23 వేల ఎకరాల భూమి, గతంలో ఇచ్చిన జీవోలు, మెమోలు రెగ్యులైజేషన్ ఉత్తర్వుల ప్రకారం తొలగించిన భూమిని కూడా కలిపితే 47,440 ఎకరాలు తగ్గిందని వివరించారు.
విరుద్ధ ప్రకటనలు
CS-7, CS-14 ల పై కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే. జయప్రకాశ్ నారాయణ, మాజీ మంత్రి హరీష్ రావు పరస్పర విరుద్దమైన ప్రకటనలు చేసారని వీడియో క్లిప్పింగ్‌ల ద్వారా వివరించారు. తమ ప్రభుత్వమే 22-ఏ లో పెట్టిందని హరీశ్‌రావు చేసిన ఆరోపణలకు బదులిస్తూ అవి 2013 నుంచే 22-ఏ లో ఉన్నాయని గెజిట్ నోటిఫికేషన్ ను చూపించారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో సుమారు 40 వేల ఎకరాలను 22-ఏలో చేర్చామనడం నిజం కాదని స్పష్టం చేశారు. 40 వేల ఇంటి స్థలాలు మాత్రమేనని తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు 2025 డిసెంబర్లో జరిగిన డేటా అప్డేషన్ సమయంలో ఇంటి నెంబర్‌తో పాటు లబ్ధిదారుడి పేరును కూడా రికార్డులో చేర్చడం వల్ల సాంకేతిక సమస్య తలెత్తిందని వివరించారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి మా దృష్టికి తీసుకురాగానే తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించామన్నారు. పటాన్చెరు పరిధిలోని సింఫనీ కాలనీ హోమ్స్ భూములను మొత్తం 22-ఏలో చేర్చారని ఎమ్మెల్యే హరీశ్‌రావు, బిజేపీ ఎంపీ రఘునందన్‌రావు చేసిన ఆరోపణలపై స్పష్టత ఇచ్చారు. ఆ కాలనీలో రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలిచిపోయాయని చేసిన ఆరోపణకు కూడా రిజిస్ట్రేషన్ గణాంకాలే సమాధానమని, 2026 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు మొత్తం 21 డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయని తెలిపారు.
మార్గదర్శకాలు రూపొందించింది బీఆర్ఎస్ హయాంలోనే..
హైకోర్టు ఆదేశాల మేరకు 2016లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో 121ని జారీ చేసి, 2017లో మార్గదర్శకాలు రూపొందించిందని తెలిపారు. అయితే దాన్ని అమల్లోకి తేలేదన్నారు. 22–Aకు సంబంధించి 2017 నుంచి 2025 వరకు హైకోర్టులో 28,611 కేసులు నమోదయ్యాయని వివరించారు. హైకోర్టు ఆదేశాల మేరకు A, B, C, D, E కేటగిరీల ప్రకారం 22-ఏ జాబితాను డిసెంబర్ 3, 2025న పబ్లిక్ డొమైన్లో ఉంచామని తెలిపారు. ధరణికి ముందు నుంచే భూ రికార్డుల్లో అనేక తప్పులు, వైరుధ్యాలు, అసంపూర్ణ సమాచారం వారసత్వంగా వచ్చిందన్నారు. తమ ప్రభుత్వం పొరపాట్లను, తప్పులను గుర్తించి బాధ్యతగా సరిదిద్దుతున్నదని వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకొని కొల్లగొట్టిన భూముల వివరాలకు సంబంధించి కొన్నింటిని సభ ముందుంచారు. ఈ భూ అక్రమాలకు కర్త, కర్మ, క్రియ మాజీ సీఎం కేసీఆర్, ఆయన అల్లుడు, మంత్రి హరీశ్‌రావులే అని ఆరోపించారు. 2022-23లో గంగుల కమలాకర్ లాంటి వారు రాత్రికి రాత్రే పీఓబీ తొలగించి రిజ్రిస్టేషన్ చేయించుకుని, మళ్లీ పీఓబీలో పెట్టి 226.06 ఎకరాలను హస్తగతం చేసుకున్నారని ఆధారాలు చూపించారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ భూముల్లో రిజిస్ట్రేషన్లు బ్లాక్ చేశామని తెలిపారు.



