Sunday, September 13, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుదేశంలో పెరుగుతున్న పేదరికం, దారిద్ర్యం

దేశంలో పెరుగుతున్న పేదరికం, దారిద్ర్యం

- Advertisement -

300 కుటుంబాల వద్ద రూ.138 లక్షల కోట్ల సంపద
ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వాలు : సాయుధ పోరాట వారోత్సవాల్లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ
షాపూర్‌ ‌నగర్‌ ‌చౌరస్తా నుంచి ఐడీపీఎల్‌ చౌరస్తా వరకు బైక్‌ ‌ర్యాలీ

నవతెలంగాణ-సిటీబ్యూరో/కుత్బుల్లాపూర్‌
‌స్వాతంత్ర్యం వచ్చి 80 ఏండ్లు గడుస్తున్నా దేశంలో పేదరికం కొనసాగుతోందని, కేవలం 300 కుటుంబాల వద్ద పోగై ఉన్న రూ.138 లక్షల కోట్ల సంపదను పంచితే పేదరికం రూపుమాపొచ్చని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ తెలిపారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా శనివారం సీపీఐ(ఎం) మేడ్చల్‌-‌మల్కాజిగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్‌ షాపూర్ నగర్ శుభం హోటల్ నుంచి ఐడీపీఎల్‌ చౌరస్తా వరకు నిర్వహించిన బైక్‌ ర్యాలీని ఆయన ప్రారంభించి మాట్లాడారు. నాటి రోజుల్లో రైతులు అప్పులపాలైతే ఆ భూములను జమీందారులు ఆక్రమించుకునే ఘటనలు అనేకం ఉండేవన్నారు. వీరనారి ఐలమ్మ తన నాలుగెకరాల భూమిని సాగు చేసుకుంటుంటే ఆ భూమిని రాంచంద్రారెడ్డి ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తే ఎర్ర జెండా నాయకత్వంలో ప్రతిఘటించినట్టు గుర్తు చేశారు. ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమయంలో దొడ్డి కొమురయ్యను ప్రయివేటు గుండాలు కాల్చి చంపినట్టు తెలిపారు. నాడు నైజాం పోలీసులు, రజాకార్ల దాడులు, మహిళలపై లైంగిక దాడులకు వ్యతిరేకంగా ఆంద్రమహాసభ, కమ్యూనిస్టు పార్టీ పోరాటం చేశాయన్నారు. 3వేల గ్రామాలకు ఎర్రజెండా విముక్తి కలిపించిందని, ఆయా గ్రామాల్లో గ్రామ రాజ్యాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

ఈ పోరాటం వల్ల 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేసిన చరిత్ర ఉందన్నారు. ఆ భూములను భూస్వాములకు తిరిగి అప్పగించేందుకు నాటి కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ప్రయత్నం చేయడంతో మరోసారి పోరాడాల్సి వచ్చిందన్నారు.ఈ పోరాటంలో 4వేల మంది అమరులైతే, మరో 2వేల మందిని భారత సైన్యమే చంపేసిందన్నారు. ఈ ఉద్యమం దేశమంతా వ్యాప్తి చెందకుండా ఆపేందుకు నాటి కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం హైదరాబాద్‌‌కు సైనిక బలగాలను పంపించిందని గుర్తు చేశారు. కుప్పకూలిపోయే స్థితిలో ఉన్న నిజాం సైన్యంతో ఒప్పందం చేసుకున్నట్టు చెప్పారు. ఈ పోరాటంలో బీజేపీ పాత్ర అసలే లేదని స్పష్టం చేశారు.నేడు దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ, కులోన్మాదాన్ని రెచ్చగొట్టడం, మతోన్మాదాన్ని పెంపొందించేలా వ్యవహరిస్తూ చట్టాలు, రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తోందన్నారు. బీజేపీ అసమర్థ పాలన వల్ల దేశవ్యాప్తంగా విద్య, వైద్యం వ్యాపారంగా మారిందన్నారు.

దేశంలో పేదరికం, దారిద్ర్యం కొనసాగుతోందన్నారు. విద్య, వైద్యం అందుబాటులో లేదని, ఉపాధి లేదని, కూలి సరిగా పెరగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు వేర్వేరుగా కనిపించినా.. వాటి విధాలన్నీ దోపిడీ వర్గాలకు ఉపయోగపడే విధానాలే అని వివర్శించారు. ఇందుకు వ్యతిరేకంగా ప్రజలు సంఘటితం కావాల్సి ఉందన్నారు. అసమానతల్లేని సమాజాన్ని నిర్మించుకోవడం కేవలం సోషలిస్టు సమాజంలో సాధ్యమవుతుందని చెప్పారు. కమ్యూనిస్టు పార్టీలకు ఎన్ని ఇబ్బందులున్నా.. ఎన్ని ఆటంకాలు ఎదురైనా లక్ష్యం, పోరాటాలను వదలడం లేదన్నారు. ​ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పి.సత్యం, లక్ష్మణ్, జిల్లా కమిటీ సభ్యులు బి.లింగస్వామి, వెంకట్రామయ్య, ఆర్,సంతోష్, ఎం.నరేష్, నాయకులు బీఎన్‌.సుదర్శన్, అంజయ్య, విజయ, బాలు, శ్రీను, స్వాతి, జాహ్నవి, సత్యం, నాగరాజు, జాకిర్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -