వర్ధమాన దేశాలకు ప్రాతినిధ్యం..
చర్చలు, దౌత్యంతోనే శాశ్వత శాంతి..ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఖండించాల్సిందే
బ్రిక్స్ దేశాల మధ్య మరింత ఆర్థిక సహకారం : న్యూఢిల్లీ డిక్లరేషన్ పిలుపు
న్యూఢిల్లీ: సమగ్ర ప్రాతినిధ్యం, న్యాయంతో కూడిన సమ్మిళిత ప్రపంచ వ్యవస్థ పట్ల బ్రిక్స్ దేశాల నిబద్ధతను న్యూఢిల్లీ డిక్లరేషన్ పునరుద్ఘా టించింది. బలమైన బహుళపక్షవా దాన్ని సమర్థిస్తూ, అంతర్జాతీయ నిర్ణయాక క్రమంలో వర్ధమాన ఆర్థిక వ్యవస్థలకు మరింత ప్రాతినిధ్యం కల్పించాలని డిక్లరేషన్ కోరింది. భద్రతా మండలితో సహా ఐక్యరాజ్యసమితి సంస్కరణలకు బ్రిక్స్ మద్దతిచ్చింది. అంతర్జాతీయ సంస్థల్లో వర్ధమాన దేశాల జోక్యం మరింత ఉండాలని కోరింది. భద్రతా మండలితో సహా ఐక్యరాజ్యసమితిలో మరింత బృహత్తర పాత్ర పోషించేందుకు బ్రెజిల్, భారత్ వ్యక్తం చేస్తున్న ఆకాంక్షలకు చైనా, రష్యాలు మద్దతును పునరుద్ఘాటించాయి.
పశ్చిమాసియా ఉద్రిక్తతలపై ఆందోళన..
పశ్చిమాసియాలో పెచ్చరిల్లుతున్న ఉద్రిక్తతలపట్ల బ్రిక్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సంయమనాన్ని పాటిస్తూ, పౌరులను, పౌర సదుపాయాలను పరిరక్షిస్తూ, చర్చలు, దౌత్యం ద్వారా శాశ్వత శాంతి నెలకొల్పాలని పిలుపునిచ్చింది.అంతర్జాతీయ వాణిజ్యం సజావుగా సాగాలని, సరఫరా మార్గాలు, ఇంధన రవాణా సక్రమంగా నిర్వహించాలని డిక్లరేషన్ కోరింది. గాజాలో కాల్పుల విరమణకు కట్టుబడి ఉండాలని కోరిన డిక్లరేషన్, ఎలాంటి అడ్డంకులు, అవరోధాలు లేని రీతిలో మానవతా సాయం అందేలా చూడాలని పేర్కొంది. బలవంతంగా ప్రజలను తరలించే పద్ధతులకు స్వస్తి చెప్పాలని స్పష్టం చేసింది. రెండు దేశాల ఏర్పాటుకు (పాలస్తీనా, ఇజ్రాయిల్) మద్దతును పునరుద్ఘాటిస్తూ, పాలస్తీనాకు ఐక్యరాజ్యసమితిలో పూర్తి స్థాయి సభ్యత్వం ఇవ్వాలని డిక్లరేషన్ పిలుపునిచ్చింది.
ఉగ్రవాదంపై ఉమ్మడి గళం..
పహల్గాం దాడిపై ఖండన
అన్ని రూపాల్లోని ఉగ్రవాదాన్ని నిర్ద్వంద్వంగా ఖండిస్తూ, ముఖ్యంగా గతేడాది ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడిని బ్రిక్స్ తీవ్రంగా ఖండించింది. సరిహద్దు ఆవలి తీవ్రవాదానికి పాల్పడే వారిపై, ఉగ్రవాదులకు నిధులు సమకూర్చే, వారికి సురక్షితంగా ఆశ్రయాన్ని కల్పించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఉగ్రవాదం, సంఘటిత నేరాలు, మనీ లాండరింగ్, విదేశీ మోసపూరిత నెట్వర్క్లకు వ్యతిరేకంగా మరింత సహకారం ఉండాలని డిక్లరేషన్ పిలుపునిచ్చింది.
ఆర్థిక సహకారానికి ఊతం.. స్థానిక కరెన్సీపై దృష్టి
బ్రిక్స్ దేశాల మధ్య మరింత సమన్వయంతో కూడిన ఆర్థిక సహకారం ఉండాలని బ్రిక్స్ డిక్లరేషన్ పునరుద్ఘాటించింది. 2030 నాటికి బ్రిక్స్ ఆర్థిక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళుతూనే, విదేశీ చెల్లింపులు మరింత వేగంగా, చవకగా, పారదర్శకంగా, భద్రంగా, అందరికీ అందుబాటులో ఉండేలా చేపట్టే చర్యలకు బ్రిక్స్ మద్దతిచ్చింది. వాణిజ్య పరిష్కారాలకు, పెట్టుబడులకు స్థానిక కరెన్సీని మరింతగా ఉపయోగించాలని కోరింది.
సాంకేతికత, ఏఐ, స్థిరాభివృద్ధిపైనా ప్రత్యేక దృష్టి
సాంకేతికత, ఆవిష్కరణ, ఆరోగ్యం, వ్యవసాయం, వాతావరణ పరిస్థితులు ఇవన్నీ కూడా డిక్లరేషన్లో ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చాయి. ఆర్థిక వృద్ధికి, సుస్థిర అభివృద్ధికి కృత్రిమ మేధస్సును ప్రధాన అవకాశంగా బ్రిక్స్ గుర్తించింది. అదే సమయంలో సురక్షితమైన, భద్రమైన, విశ్వసనీయమైన ఎఐ ఉండాలని పిలుపునిచ్చింది. ‘ఒడిదుడుకులను తట్టుకుని నిలబడే సామర్థ్యాలు, వినూత్న ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత నిర్మాణం’ అనేది ఈ సదస్సు విస్తృతాంశంగా ఉంది. దాన్ని ప్రతిబింబించేలా డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, ఆహార భద్రతా రంగాల్లో సహకారం, మార్పులకు తట్టుకునేలా ఇంధన వ్యవస్థలు, కీలకమైన ఖనిజాల సరఫరా మార్గాలు, విపత్తు నిర్వహణా సన్నద్ధతలను కూడా డిక్లరేషన్ ప్రోత్సహించింది. బ్రిక్స్ దేశాధినేతలు సమావేశం కావడానికి ముందుగానే సంయుక్త డిక్లరేషన్ జారీ చేయడానికి సభ్య దేశాలు అంగీకరించాయి. ఏ ఒక్క దేశం పేరును ప్రస్తావించకుండా, ఐక్యంగా యుద్ధాన్ని ఖండించేందుకు అంగీకరించినట్లు సంబంధిత శ్రేణులు మీడియాకు తెలిపాయి.



