Thursday, April 23, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్పుస్త‌కాలు దారి దీపాలు

పుస్త‌కాలు దారి దీపాలు

- Advertisement -

పుస్తకం మిమ్మల్ని స్వేచ్ఛా లోకంలో విహరించేలా చేస్తుంది. సజీవ పాత్రలుఉండే ప్రపంచానికి తీసుకెళుతుంది. వాటి గురించి చదివేటప్పుడు మీ మెదడు ఆ సమాచారాన్ని విజువల్స్‌ రూపంలో ప్రాసెస్‌ చేసుకుంటుంది. దీంతో మీరు చదివే టాపిక్‌లో లోతుగా లీనమయ్యేలా చేస్తుంది. అందుకే పుస్తక ప్రేమికులకు చదవడం ఏనాడూ బోర్‌ కొట్టదు. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది, జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడుతుంది. నేడు ‘ప్రపంచ పుస్తక దినోత్సవం’ సందర్భంగా పుస్తకంతో తమ అనుభవాలను కొందరు రచయిత్రులు మనతో ఇలా పంచుకున్నారు…

పుస్తకం వర్ధిల్లాలి
ఏప్రిల్‌ మాసానికి ఒక విశిష్టమైన ప్రత్యేకత ఉంది. భారతదేశ బహుజన మహనీయుల మాసం ఏప్రిల్‌. ఆ మహనీయుల జయంతి ఉత్సవాలు జరిగేది ఏప్రిల్‌ నెలలోనే. దేశీయంగానే కాకుండా పాశ్చాత్య దేశాల్లోని విలియం షేక్స్పియర్‌ లాంటి ప్రఖ్యాత ప్రభావశీల రచయిత జయంతి ఇదే ఏప్రిల్‌ నెల 23న రావడం విశేషం. అందుకే యునెస్కో ఏప్రిల్‌ 23ను ప్రపంచ పుస్తక దినంగా ప్రకటించి 1995 నుంచి ఉత్సవాలు చేస్తున్నది. చరిత్ర, సమాచారానికి ప్రాథమిక సాధనం పుస్తకం. మానవ సమాజ జ్ఞానసృజన, జ్ఞాన వ్యాప్తి పంపిణీలో పుస్తకం కీలక భూమిక. మనుషులు చరిత్ర, సామాజిక శాస్త్ర జ్ఞానాన్ని పొందడం ద్వారా తమ ఆలోచన పరిదుల విస్తృతికి, అవగాహన ఉన్నతిని పెంచుకునే వనరు పుస్తకం. పుస్తక దినోత్సవం అంటే పుస్తకం అభ్యాసన అవసరాన్ని చెప్పేది. ఇంటర్నెట్‌ మొబైల్‌, ఈ బుక్స్‌ ఎన్ని వచ్చినా పుస్తకం విలువ తగ్గింది లేదు. భారతదేశానికి సంబంధించి పుస్తకం రాకముందు రాత వారసత్వంగా రాగి, రేకులు, శిలాశాసనాలు, తాళపత్ర గ్రంథాలే ఉండేవి. ఇప్పటికీ లిఖిత సాహిత్యం కన్నా మౌఖిక సాహిత్యమే ఎక్కువ. ఇక్కడ కుల, మత ఆధిపత్యాల కోసం లక్షలాది పుస్తక విధ్వంసాలు, నలంద వంటి పుస్తక భాండాగారాలు భస్మం చేసిన చరిత్రలున్నాయి. యుద్ధాల కారణంగా కోట్ల పుస్తకాలు బూడిదైపోయినరు. ప్రస్తుతం జరుగుతున్న అమెరికా, ఇజ్రాయిల్‌ దేశాలు ఇరాన్‌, లెబనాన్‌ మీద చేసిన యుద్ధాల్లో వందల గ్రంధాలయాలు ధ్వంసమైనవి. ధ్వంసం అయినవి కేవలం పుస్తకాలు కాదు వేల ఏండ్ల మానవ చరిత్రలు, సంస్కృతులు. నిరక్షరాస్యత ప్రభలంగా ఉన్న మనదేశంలో పుస్తకం అట్టడుగు పొరలకి చేరని వెనకబాటు తనం. లిఖిత సాహిత్యం కన్నా, సాంకేతికత పెరిగిన ఈ కాలంలో కూడా, మౌఖిక సాహిత్యాలే అణగారిన కులాల, మతాల, జెండర్‌ సమాజాల చరిత్రలను, సంస్కృతినీ నిలిపి ఉంచినవనేది వాస్తవం. ఇక్కడ పుస్తకం ప్రజాస్వామీకరించబడలేదు. ఈ దేశంలో సామాజిక జ్ఞానం ఉన్నవాళ్లు పుస్తకంగా లేరు. పుస్తకాల్లో ఉన్నవారు సామాజిక జ్ఞానంలో లేరు అనేది చారిత్రక సత్యం. ప్రపంచ దేశాల్లాగా ఇక్కడ ప్రచురణ ఒక పరిశ్రమగా లేదు. పుస్తకం అంటే గడ్డకట్టిన గుండెలకు చిగురులెయ్యాలి, చెరువులా చెమ్మగిల్లాలి, చీకటి సముద్రాలకు వేకువ దారులేయ్యాలి. పుస్తకం వర్ధిల్లాలి. – జూపాక సుభద్ర

పుస్తక పఠనం మనసును విశాలం చేస్తుంది
నా జీవితంలో పుస్తకాలు చదవడం వల్ల పొందిన ఆనందం, ఆత్మవిశ్వాసం మాటల్లో చెప్పలేనిది. బాల్యం నుండీ పుస్తకాలే నా స్నేహితులు, బంధువులు, గురువులు కూడా.. ప్రపంచాన్ని చదవడానికి పుస్తక పఠనం చాలా ఉపయోగపడింది. అందుకే ‘పుస్తకాలు మీ మనసును తెరిచి, విశాలం చేస్తాయి, మరేదీ చేయలేని విధంగా మిమ్మల్ని బలపరుస్తాయి’ అనే స్కిప్‌ ప్రిచర్డ్‌ మాటలను పూర్తిగా సమర్ధిస్తాను. పుస్తక పఠనం ఒక రకమైన ధ్యానం వంటిది, తపస్సు వంటిది. ఎంతటి దు:ఖాన్నైనా పుస్తకంతో నేను పక్కకు పెట్టగలను. ఏకాగ్రతతో పుస్తక పఠనం చేయడం వల్ల లెక్కలేనన్ని ఉపయోగాలు పొందవచ్చు. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది, ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. వ్యక్తిత్వ వికాసానికి, భాషా పరిజ్ఞానానికి తోడ్పడి, జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో మార్గదర్శకం చేస్తుంది. అందుకే ఈ పుస్తకాల ఋణం తీర్చుకునే ప్రయత్నమే నేను ప్రచురించిన ‘మల్లెసాల’, ‘ఖమ్మం కథలు’, ‘కరోనా డైరీ’, ‘సంఘటిత’ వంటివి. శక్తికి మించి ‘బహుళ పత్రిక’ నడిపేది కూడా పుస్తక ఋణ చెల్లింపులో భాగమే. కేవలం 6 నిమిషాల పఠనం కూడా ఒత్తిడిని 68శాతం వరకు తగ్గిస్తుందట, ఇది ధ్యానం వలె ప్రశాంతతను ఇస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. నాకైతే అలసిన మనసుకు ఊరటనిచ్చేది పుస్తకాలు చదవడమే. అంతే కాదు మెదడుకు ఒక వ్యాయామం అంటాను నేను. ఇది ఆల్జీమర్స్‌ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించి చురుకుదనాన్ని పెంచుతుంది కూడా.. ‘పుస్తకాలు లేని గది ఆత్మ లేని శరీరం లాంటిది’ అన్నాడు ప్రముఖ రోమన్‌ భాషావేత్త సిసిరో. నేను దుస్తుల కంటే ఎక్కువ పుస్తకాలే కొంటాను. ఈ పుస్తక సముద్రంలో నేను చదవాలిసినవి చాలా మిగిలే వున్నాయి. ఏ పుస్తకం చదవాలి అనే ఎంపిక కూడా పుస్తక పఠనం వల్లనే కలుగుతుంది. మంచి పుస్తకం ఏది చెయ్యాలో, ఏది చెయ్యకూడదో కూడా చెపుతుంది. – జ్వలిత, బహుళ సంపాదకురాలు

పుస్తకాలు మనిషి ఎదుగుదలకు వెన్నెముకలు
తాళ పత్రాలనుంచి కాగితపు పుస్తకాలలోకి మారిన మన సాహిత్యం వెనుక ఎన్నో ఏండ్ల కృషి ఉంది. పుస్తకం మనకు విద్యను, విజ్ఞానాన్ని, నాగరికతను అందించింది. పుస్తకాలు మనిషి ఎదుగుదలకు వెన్నెముకలుగా నిలిచాయి. పుస్తకాలు హస్త భూషణాలు మాత్రమే కాదు దారి దీపాలు కూడా. పర్షియన్లు గ్రీకుల మీద దాడి చేసినప్పుడు ప్రజలు దుస్తులు, వెండి, బంగారు వస్తువులను కాకుండా మోయగలిగినన్ని శాస్త్ర గ్రంథాలను చేజిక్కించుకుని పారిపోయారని చిన్నప్పుడు చదువుకున్నాం. దీన్నిబట్టి పుస్తకాలు ఒక జాతిని పునర్నిర్మించే విజ్ఞాన సారపు ఇటుకలు అని అర్థమౌతుంది. కానీ మనం ఇంకా సంపూర్ణ అక్షరాస్యతను సాధించుకునే దశలోనే ఉన్నాం. అంతర్జాతీయ భాష అయినా ఆంగ్ల భాషకు పెరిగిన ఆవశ్యకత నేపథ్యంలో మాతృ భాషలను ఎన్నింటినో కోల్పోతున్నాం. భాషను కోల్పోతే సంస్కృతిని కూడా కోల్పోతాం. అక్షరాస్యత, భాష, సంస్కృతి, సాంకేతికత, నాగరికత ఇవ్వన్నీ ఒకదానితో ఒకటి ముడి పడి ఉన్న అంశాలు. పుస్తకాలను కేవలం విద్య నేర్పే గ్రంథాలుగా మాత్రమే పరిగణించకుండా పుస్తక పఠనం ఒక అలవాటుగా చేసుకున్న వారి మనస్తత్వాలు భిన్నంగా, సంస్కారవంతంగా ఉంటాయి. పుస్తకాలు కాగితాల్లో నుంచి స్క్రీన్‌ లోకి రూపు మార్చుకుంటున్న రోజులివి. పుస్తకాలు రూపు మారినా మన జీవన లయకారులవి తమ ఆత్మను కోల్పోవు.
– సమ్మెట ఉమాదేవి

పుస్తకాలు చదవడం ఇష్టం
అకాడమిక్‌గా ఇంగ్లీష్‌ లిటరేచర్‌ చదివినప్పటికిని చరిత్ర, భూగోళ శాస్త్రాలను ఎక్కువగా చదివాను. నవలలు, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ పుస్తకాలు చదువుతూ విద్యార్థుల చేత చదివించడం, అభిప్రాయం తెలుసుకోవడం అనేది మా పాఠశాలలో పాటిస్తుంటాను. నెపోలియన్‌ హిల్‌ రాసిన ‘థింక్‌ అండ్‌ గ్రో రిచ్‌’, రాబిన్‌ శర్మ రాసిన ‘ద ఫైవ్‌ ఏ ఎమ్‌ క్లబ్‌’, జపాన్‌ వారి జీవన చిత్రణ ‘ఇకిగాయి’, హెలెక్స్‌ రచించిన ‘ఏడు తరాలు’, కేశవరెడ్డి ‘అతడు అడవిని జయించాడు’ వంటి నవలలు అంటే చాలా ఇష్టం. దిన పత్రికల సండే మ్యాగజైన్లోని కథలు చదవడం హాబీగా మారింది. రీడ్‌ ఫర్‌ లెజెండ్రీ లైఫ్‌ గ్రూప్లో కొనసాగుతూ మంచి మంచి పుస్తకాల్ని చదువుతున్నాను. పుస్తకాలను చదవడం వల్ల సినిమాలకు, టి.వి. సీరియళ్లకు కాస్త దూరంగా ఉండగలుగుతున్నాను.
– సుల్తానా, గురుకుల ఉపాధ్యాయిని

ఆలోచనా సరళిలో మార్పు తెస్తుంది
మా అమ్మ మొదటి నుండీ పుస్తక ప్రియురాలు కనుక ఇంటికి చాలా పత్రికలు తెప్పించే వారు. చిన్ననాడు అమ్మ మా చేత అన్ని రకాల పుస్తకాలతోబాటు సుమతి, వేమన, భర్తృహరి, దాశరథి, భాస్కర శతకాలూ, సుభాషితాలూ చదివించేది. అలాగే గ్రంథాలయంలో మా నాన్నకు సభ్యత్వం ఉండడంతో అమ్మ అక్కడి నుండి నవలలు, కథల పుస్తకాలు తెప్పించుకునేది. అప్పట్లోనే నేనూ, అక్కా లైబ్రరీకి వెళ్లి పుస్తకాలు తెచ్చుకుని చదివే వాళ్ళం. మా అమ్మ మాకు ఏ వయసుకు తగినట్లుగా ఆ వయసులో పుస్తకాలు చదివేలా ప్రోత్సహించడమే కాక చదివిన కథలు, నవలలపై మాతో చర్చిందేది కూడా. అమ్మ స్వయంగా పురాణాల్లోంచి తను చదివిన దక్కన్‌ కీ తారిఫ్‌ కహానీయా, కాశీమజిలీ కథలు, భేతాళ కథలు, అరేబియన్‌ నైట్స్‌, భోజరాజు కథలు వంటి వాటిల్లోంచి కథలు చెప్పేది. ఇప్పటికీ రోజుకు ఏదో ఒక పుస్తకంలో కొన్ని పేజీలైనా చదువకుండా ఉండను. నేను గమనించినది ఏమిటంటే సాహిత్యం చదివినవారికీ, చదవని వారికీ… ఆలోచనా సరళిలోగానీ, అవగాహనా సామర్థ్యంలోగానీ, వ్యకిత్వ నిర్మాణంలో గానీ తేడా వుంటుంది. ఒకటి మాత్రం కచ్చితంగా చెప్పగలను. నేను పుస్తకాలు చదవకుంటే నేడు రచయిత్రిగా, కవయిత్రిగా ఈ మాత్రం నిలబడగలిగేదాన్ని కాదు. – నెల్లుట్ల రమాదేవి

సమాజ ముఖచిత్రాన్ని మార్చగలదు
పుస్తకం మట్టి పువ్వులను రెక్కల గుర్రాలపై ఊరేగించగలదు. ఎంతోమంది మిడిల్‌ క్లాసులని క్లాసీగా మార్చనూగలదు. ఒక వ్యక్తి బతుకుచిత్రాన్నే కాదు, సమాజ ముఖచిత్రాన్ని మార్చగల మహిమా న్విత శక్తి పుస్తకానికే సొంతం. బేకన్‌ మహాశయుడు అన్నట్లుగా కొన్ని పుస్తకాలను స్పృశించాలి. కొన్నిటిని జీర్ణించుకోవాలి. మరికొన్నింటిని నెమరు వేసుకోవాలి. అప్పుడే ఉజ్వలమైన కాంతిలో విహరించగ లం. ఆ కోవలో నన్ను ప్రభావితం చేసిన పుస్తకాలు ఎన్నో ఎన్నెన్నో. పాఠశాల దశలో ఎంతో మందిలాగే నేను చందమామ, బుజ్జాయి, బాలమిత్రల నేస్తాన్ని. ఆ తర్వాత మొదటి వరుసలో దేవరకొండ బాలగంగాధర్‌ తిలక్‌ రచించిన అమృతం కురిసిన రాత్రి, గురజాడ కన్యాశుల్కం, కాళోజీ నా గొడవ, ముదిగంటి సుజాతా రెడ్డి విసు ర్రాయి, ఓల్గా విముక్త మొదలైనవి నిలుస్తాయి. నన్ను పాఠకురాలి గానే కాదు, నా భావపరంపరను వివిధ ప్రక్రియా రూపాలలో చెక్కి, ప్రపంచానికి అందించగల రచయిత్రిగానూ నిలబెట్టాయి. ‘A తీవaసఱఅస్త్ర అa్‌ఱశీఅ ఱర a శ్రీవaసఱఅస్త్ర అa్‌ఱశీఅ’. చదివే ప్రజలున్న దేశమే అభివృద్ధిలోనూ ముందంజలో ఉంటుం ది. అందుకే వీలైనన్ని ఎక్కువ పుస్తకాలను చదువుతూ ఉన్నతంగా జీవితాలను తీర్చిదిద్దుకోవడం ఆవశ్యకం. – డా. ఉప్పల పద్మ

సేకరణ: సలీమ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -