Thursday, April 23, 2026
E-PAPER
Homeజాతీయంనేడు రెండు రాష్ట్రాల్లో పోలింగ్‌

నేడు రెండు రాష్ట్రాల్లో పోలింగ్‌

- Advertisement -

– తమిళనాడు, బెంగాల్‌లో ఏర్పాట్లు పూర్తి
– భద్రత కట్టుదిట్టం
– మే 4న ఫలితాలు
న్యూఢిల్లీ :
దేశంలో ఎంతో ఉత్కంఠను రేపుతున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు నేడు (గురువారం) జరగనున్నాయి. ఇందుకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. ప్రజలు ఓటు హక్కు ద్వారా వివిధ పార్టీల అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు నేడు ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 294 నియోజకవర్గాలకు గానూ రెండు దశల్లో ఎన్నికలు జరగనుండగా.. అందులో మొదటి దశలో భాగంగా 152 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మిగతా 142 స్థానాలకు ఈనెల 29న పోలింగ్‌ జరగనున్నది. పోలింగ్‌ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. మే 4న తుది ఫలితాలు వెలువడనున్నాయి.

తమిళనాడు రెడీ
అసెంబ్లీ పోరుకు తమిళనాడు సిద్ధమైంది. మొత్తం 234 స్థానాలకు గానూ వివిధ పార్టీల నుంచి 4,023 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మొత్తం 5.73 కోట్ల మందికి పైగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 2.93 కోట్ల మందికి పైగా మహిళా ఓటర్లు, 2.77 కోట్ల మందికి పైగా పురుష ఓటర్లు ఉన్నారు. మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉండటంతో వారి ఓట్లు కీలకం కానున్నాయి. ట్రాన్స్‌జెండర్లు 7728 మంది ఉన్నారు. మొత్తం 33,133 ప్రాంతాల్లో 75 వేలకు పైగా పోలింగ్‌ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తం 3,60,068 మంది పోలింగ్‌ సిబ్బంది ఎన్నికల విధులను నిర్వర్తించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే విడతలో పోలింగ్‌ జరగనుండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. మొత్తం 1.40 లక్షల మంది పోలీసులు ఎన్నికల విధుల్లో ఉన్నారు. పోలింగ్‌ డే కావడంతో నేడు తమిళ నాడుకు పబ్లిక్‌ హాలిడే ప్రకటించింది ఎన్నికల సంఘం.

బెంగాల్‌ దంగల్‌
పశ్చిమబెంగాల్‌ మొదటి విడత ఎన్నికలకు సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా 16 జిల్లాల్లోని 152 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ సారి ఓటర్లు ఎన్నికల పండుగలో ఎక్కువ సంఖ్యలో పాల్గొనే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 3.60 కోట్ల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

వీరిలో 1.84 కోట్ల మందికి పైగా పురుష ఓటర్లు కాగా.. 1.75 కోట్ల మందికి పైగా మహిళా ఓటర్లు ఉన్నారు. ట్రాన్స్‌జెండర్లు 465 మంది ఉన్నారు. .. బెంగాల్‌లో ఎన్నికల కోసం ఈసీ భారీ ఏర్పాట్లను చేసింది. దాదాపు 2.5 లక్షల మంది సిబ్బందితో పాటు రికార్డు స్థాయిలో 2,450 కంపెనీల కేంద్ర పారామిలిటరీ బలగాలను మోహరించింది. ఏఐ సహాయంతో 152 నియోజకవర్గాల్లోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ను అమలు చేస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -