Thursday, April 23, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుప్రభుత్వానికి చెంపపెట్టు

ప్రభుత్వానికి చెంపపెట్టు

- Advertisement -

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్షగట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి హైకోర్టు తీర్పు చెంపపెట్టులాంటిదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్‌ కుట్రలు కూలిపోయాయని విమర్శించారు. పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదికపై హైకోర్టు ఇచ్చిన స్టేను స్వాగతించారు. ఈ తీర్పు ఇచ్చిన హైకోర్టుకు, మంచి వాదనలు వినిపించిన బీఆర్‌ఎస్‌ లీగల్‌ సెల్‌కు ధన్యవాదాలు చెప్పారు. ఇది ముమ్మాటికీ తెలంగాణ ప్రజలు, రైతాంగం సాధించిన విజయమని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్‌ రాజకీయాల కోసం కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్షసాధింపు చర్యలను ఆపాలని డిమాండ్‌ చేశారు. రాజకీయాల కోసం రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేయొద్దని కోరారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని చిల్లర ప్రచారాలు బంద్‌ చేసి ప్రాజెక్టు మరమ్మతులపైన, పరిపాలనపైన దృష్టి పెట్టాలని సూచించారు. అది పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదిక కాదనీ, పీసీసీ నివేదిక అని తాము ముందు నుంచి చెప్తున్న మాట అక్షరాల నిజమని తేలిపోయిందని చెప్పారు. కాళేశ్వరంపైన కాంగ్రెస్‌ చేసిన దుష్ప్రచారం హైకోర్టు తీర్పుతో పటాపంచలైందన్నారు. అంతిమ విజయం సత్యానిదే అని రుజువైందని అన్నారు. గోబెల్స్‌ ప్రచారం చేసిన వారికి హైకోర్టు గుణపాఠం చెప్పిందన్నారు. రూ.94 వేల కోట్ల ప్రాజెక్టును నిర్మిస్తే రూ.లక్ష కోట్ల కుంభకోణం జరిగిందంటూ అబద్ధాలను ప్రచారం చేశారని విమర్శించారు.

మేడిగడ్డకు మరమ్మతులు చేయాలి : హరీశ్‌రావు
ప్రాథమిక హక్కులను, సహజ న్యాయ సూత్రాలను విస్మరిస్తూ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదిక చెల్లదనీ, ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టు అని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి టి హరీశ్‌రావు విమర్శించారు. చిల్లర రాజకీయాలు మాని మేడిగడ్డకు మరమ్మతులు చేయాలని డిమాండ్‌ చేశారు. వంద కాంపోనెంట్లలో రెండు పిల్లర్లు కుంగితే రూ.లక్ష కోట్లు కొట్టుకుపోయాయంటూ కాంగ్రెస్‌ చేసిన గోబెల్స్‌ ప్రచారం, రాజకీయ కుట్రలు బట్టబయలయ్యాయని తెలిపారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి డ్రామాలు ఆడిన సీఎం రేవంత్‌రెడ్డి నిజస్వరూపం తేటతెల్లం అయ్యిందని పేర్కొన్నారు. చిల్లర రాజకీయాలు, కక్షసాధింపులు మాని ఆ రెండు పిల్లర్లకు వెంటనే మరమ్మతులు చేసి రైతులకు సాగునీరు అందించాలని కోరారు. ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు బనాయించి లొంగదీసుకోవాలని చూస్తే భయపడేది లేదనీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని ప్రకటించారు. కాళేశ్వరమే ఈ రాష్ట్రానికి ప్రాణాధారమని పేర్కొన్నారు. పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదిక పీసీసీ నివేదిక అని బీఆర్‌ఎస్‌ ముందే చెప్పిందని మాజీమంత్రి జి జగదీశ్‌రెడ్డి అన్నారు. కాళేశ్వరం అంటే మేడిగడ్డ మాత్రమే కాదన్నారు. ఘోష్‌ కమిషన్‌ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ ఎంపీ బి వినోద్‌ కుమార్‌ అన్నారు. మేడిగడ్డ లేకపోతే కరువు కాలంలో ఉత్తర తెలంగాణ ఎడారిగా మారుతుందన్నారు. ఇప్పటికైనా మేడిగడ్డ పిల్లర్లకు మరమ్మత్తులు చేయాలని కోరారు. పీసీ ఘోష్‌ నివేదికపై హైకోర్టు తీర్పు కాంగ్రెస్‌ కుట్రలకు చెంపపెట్టు అని మాజీమంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, మాజీ డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్‌, దేశపతి శ్రీనివాస్‌, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకులు పల్లె రవికుమార్‌, దేవీప్రసాద్‌, గోసుల శ్రీనివాస్‌ యాదవ్‌ విమర్శించారు.

తెలంగాణ భవన్‌ ముందు సంబురాలు
కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ బీఆర్‌ఎస్‌ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌ ముందు పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి. బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు బాణాసంచా కాల్చి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -