ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలొద్దు
సీబీఐ దర్యాప్తు కూడా చేయొద్దు
కాళేశ్వరంపై హైకోర్టు కీలక తీర్పు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యవహారంపై సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏక సభ్య కమిషన్ నివేదిక చెల్లదని హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక ఆధారంగా బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి టి.హరీశ్‌రావుపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని తేల్చి చెప్పింది. అలాగే ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎస్‌కే జోషి వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలను కలిపి ఉమ్మడిగా తీర్పు వెలువరించింది. పిటిషనర్లపై కమిషన్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తుతో పాటు ఇతర చర్యలేవీ తీసుకోరాదని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ చట్టబద్ధంగానే ఉన్నప్పటికీ, ఆ కమిషన్ విచారణ తీరు చట్టబద్ధంగా లేదని తేల్చింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం.మొహియుద్దీన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది. వివరాల్లోకి వెళ్తే…పిటిషనర్లు కేసీఆర్, హరీశ్‌రావు, ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎస్‌కే జోషిలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గత ఏడాది జులై 31న ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దర్యాప్తు చేయరాదని హైకోర్టు గతేడాది సెప్టెంబర్ 2న మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. బుధవారం వెలువడిన తీర్పు ప్రకారం మధ్యంతర ఉత్తర్వులు తుది ఉత్తర్వుల య్యాయి. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు గురైందని చెప్పి ప్రభుత్వం జస్టిస్ ఘోష్ కమిషన్‌తో విచారణకు ఆదేశించడం చట్టబద్ధమేనని స్పష్టం చేసింది. కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీస్ యాక్ట్ ప్రకారం ప్రభుత్వానికి విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసే అధికారం ఉందని వెల్లడించింది.
ఈ క్రమంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నిజనిర్ధారణ మాత్రమే చేయాలనీ, ఎవరు తప్పు చేశారో చెబుతూ వాళ్లపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలనే ధోరణిలో నివేదిక ఇవ్వడాన్ని ఆక్షేపించింది. కమిషన్ విచారణ సమయంలో సాక్షులు ఇచ్చిన సమాచారాన్ని, ఆధారాలను పరిశీలించాక ఎవరిపైన అయినా అభియోగాలు ఉన్నాయని భావిస్తే.. సదరు సాక్షికి ఆ వివరాలు, అభియోగాలు తెలియజేసి వివరణ తీసుకోవాలన్న కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీస్ యాక్ట్‌లోని సెక్షన్ 8(బి), 8(సి) సెక్షన్ల నిబంధనలను అమలు చేయలేదని తప్పుపట్టింది. వరుసగా సాక్షుల వివరాలు తీసుకుని వాటిని పరిగణనలోకి తీసుకుంటూ తుది నివేదిక ఇవ్వడం చట్ట వ్యతిరేకమని స్పష్టం చేసింది. ఒక వ్యక్తి లేదా సాక్షి ఒకరిపై చేసిన ఆరోపణలను అతనికి అందజేసి వివరణ తీసుకోవాలని ఆ రెండు సెక్షన్లు స్పష్టం చేస్తున్నాయని తెలిపింది. ఇక్కడ పిటిషన్లకు జస్టిస్ ఘోష్ కమిషన్ అలాంటి అవకాశం ఇవ్వలేదని విచారణలో తేల్చింది. దీని వల్ల పిటిషనర్లకు చట్టబద్ధమైన హక్కులు దెబ్బతిన్నాయని పేర్కొంది. పిటిషనర్లపై ఆరోపణలు చేసిన వాటిని కమిషన్ ఏకపక్షంగా పరిగణనలోకి తీసుకుని నివేదిక ఇవ్వడం వల్ల రాజ్యాంగం కల్పించిన సహజ న్యాయసూత్రాల హక్కులకు ఉల్లంఘన అవుతుందనే ఆందోళన న్యాయబద్ధమని వెల్లడించింది. సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లోని పేరా 3లో కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా మూడు బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలు, ప్రజాధనం దుర్వినియోగం జరిగినందున కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీస్ యాక్ట్‌లోని సెక్షన్ 3 కింద జస్టిస్ ఘోష్ కమిషన్ ఏర్పాటు జరిగినట్టుగా ప్రభుత్వం పేర్కొనడాన్ని ఉదహరించింది. కమిషన్ ఈ ఏడాది జులై 31న ఇచ్చిన రిపోర్టుతో సంబంధం లేకుండా సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తున్నామని ప్రభుత్వం చెబుతూనే రిపోర్టులోని అంశాలను సీబీఐ దర్యాప్తు కోరుతూ వెలువరించిన నోటిఫికేషన్‌లో ప్రస్తావించడాన్ని తప్పుపట్టింది. తీర్పు ప్రతి ఇప్పటి వరకు అందుబాటులోకి రాలేదు. బెంచ్‌పై చీఫ్ జస్టిస్ మూడు వ్యాఖ్యల తీర్పు సారాంశాన్ని వెలువరించారు. పిటిషన్లను పాక్షికంగా అనుమతిస్తున్నట్టు ప్రకటించారు.
కాళేశ్వరంపై హైకోర్టు ఎవరికీి క్లీన్ చిట్ ఇవ్వలేదు
సీబీఐ విచారణకు కోర్టు తీర్పు అడ్డంకి కాదు : నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
కాళేశ్వరంపై హైకోర్టు ఎవరికి క్లీన్ చిట్ ఇవ్వలేదని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ”జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 6ను కొట్టేయాలని పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. కానీ జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటును కోర్టు తప్పుబట్టలేదు. కమిషన్ నియామకాన్ని పూర్తిగా సమర్థించింది. జ్యుడీషియల్ కమిషన్ విచారణ నివేదికలో కొందరు బాధ్యులపై చేసిన నిర్ధారణలపై హైకోర్టు అభ్యంతరం తెలిపింది. పిటిషనర్లకు నిర్ణీత ఫార్మాట్ ప్రకారం నోటీస్ ఇవ్వలేదనే టెక్నికల్ అంశాన్ని తప్పుబట్టింది. జ్యుడీషియల్ కమిషన్ విచారణ నివేదిక ఆధారంగా వారిపై చర్యలు తీసుకోవద్దని మాత్రమే తెలిపింది. ఇప్పటికే మా ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో జరిగిన లోపాలు, అవకతవకలపై సీబీఐతో విచారణ చేపట్టాలని లేఖ రాసింది. బుధవారం వెలువడిన హైకోర్టు తీర్పు సీబీఐ విచారణకు అడ్డంకి కాదు” అని ఉత్తమ్ పేర్కొన్నారు. హైకోర్టు పూర్తి తీర్పును పరిశీలించిన తరువాత తదుపరి చర్యలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
కేసీఆర్, హరీశ్‌రావులకు ఊరట
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



