Thursday, April 23, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంకాల్పుల విరమణ పొడిగింపు

కాల్పుల విరమణ పొడిగింపు

- Advertisement -

– చర్చలు ముగిసే వరకు అమలులో ఉంటుందన్న ట్రంప్‌
– ఇరాన్‌ ఓడరేవుల దిగ్బంధం కొనసాగుతుందని స్పష్టీకరణ
– ఇది ఆకస్మిక దాడుల కోసం ఆడుతున్న నాటకం : ఇరాన్‌

ఇరాన్‌తో కుదుర్చుకున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. చర్చలు ముగిసే వరకూ, ఇరాన్‌ నేతలు, ప్రతినిధులు ఏకీకృత ప్రతిపాదనతో ముందుకొచ్చే వరకూ ఈ పొడిగింపు అమలులో ఉంటుందని, ఆ దేశంపై దాడులు చేయబోమని ఆయన చెప్పారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించే ప్రశ్నే లేదని, దౌత్య యత్నాలు విఫలమైతే తక్షణమే సైనిక చర్య చేపడతామని నిన్నటి వరకూ చెబుతూ వచ్చిన ట్రంప్‌ గడువు ముగుస్తున్న వేళ మాట మార్చారు. ‘ఇరాన్‌ ప్రభుత్వం తీవ్రంగా దెబ్బతిన్నదన్న వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకొని…పాకిస్తాన్‌ ఫీల్డ్‌ మార్షల్‌ అశిం మునీర్‌, ప్రధాని షెV్‌ాబాజ్‌ షరీఫ్‌ అభ్యర్థన మేరకు మేము దాడుల నిర్ణయాన్ని పక్కన పెట్టాం’ అని ఆయన ట్రూత్‌ సోషల్‌లో రాసుకొచ్చారు.

నవతెలంగాణ – సెంట్రల్‌ డెస్క్‌
పశ్చిమాసియా సీజ్‌ఫైర్‌ విష యంలో మరో కీలక పరిణామం చోటు చేసుకున్నది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కాల్పుల విరమణ మరో సారి పొడిగించారు. సైనిక చర్యను జాప్యం చేయాలని, దౌత్యానికి సమయం ఇవ్వాలని పాకిస్తాన్‌ కోరిందని, ఆ మేరకు నిర్ణయం తీసుకున్నామని ట్రంప్‌ తెలిపారు. అయితే ఇరాన్‌ ఓడరేవుల దిగ్బంధం కొనసాగుతుందని, తమ సైన్యం అప్రమత్తంగా సిద్ధంగా ఉంటుందని చెప్పారు. కాగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించిన ట్రంప్‌కు పాక్‌ ప్రధాని షరీఫ్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం దౌత్య యత్నాల కొనసాగింపుకు అవకాశం కల్పిస్తుందని చెప్పారు. చర్చల ద్వారా పరిష్కారం కనుగొనేందుకు పాకిస్తాన్‌ ప్రయత్నాలు కొనసాగిస్తుందని చెబుతూ ఇరు పక్షాలు కాల్పుల విరమణను గౌరవించి, తదుపరి విడత చర్చలలో సమగ్ర శాంతి ఒప్పందం దిశగా కృషి చేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఒప్పందం పొడిగింపు వెనుక…
ట్రంప్‌ మంగళవారం మధ్యాహ్నం శ్వేతసౌధంలో తన జాతీయ భద్రతా బృందంతో సమావేశమయ్యారు. ఇరాన్‌ విషయంలో ఏం చేయాలన్న దానిపై వారితో చర్చించారు. ఎందుకంటే ఇరాన్‌తో రెండు వారాల కాలానికి కుదుర్చుకున్న కాల్పుల విరమణ ఒప్పందం గడువు సమీపిస్తుండడంతో ఏదో ఓ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇరాన్‌తో రెండో విడత చర్చల కోసం ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ పాకిస్తాన్‌ బయలుదేరడానికి ముందు జాయింట్‌ బేస్‌ ఆండ్రూస్‌లోని రన్‌వేపై ఎయిర్‌ ఫోర్స్‌ టు విమానం సిద్ధంగా ఉంది. కానీ చర్చల విషయంలో ఇరాన్‌ నుంచి ఎలాంటి సానుకూలత వ్యక్తం కాక పోవడంతో అమెరికాకు ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితి ఎదు రైంది. చర్చల సందర్భంగా ఇరాన్‌ అంగీకరించాల్సిన జాబితాను అమెరికా అంతకుముందే పంపింది. కానీ టెహ్రాన్‌ నుంచి ఎలాంటి సమాధానం లేదు. దీంతో చర్చల కోసం పాకిస్తాన్‌ వెళ్లినా సాధించే దేముంటుందన్న అనుమానం వ్యక్తమైంది.
శ్వేత సౌధంలో ట్రంప్‌, వాన్స్‌, విదేశాంగ మంత్రి మార్కో రుబియో, రక్షణ మంత్రి పీట్‌ హెగ్‌ సేథ్‌, జాయింట్‌ చీఫ్స్‌ చైర్మెన్‌ డాన్‌ కెయిన్‌, సీఐఏ డైరెక్టర్‌ జాన్‌ రాట్‌క్లిఫ్‌ సమావేశమై ఇరాన్‌ స్పందన కోసం వేచి చూశారు. వాన్స్‌ బృందం ఎయిర్‌ ఫోర్స్‌ టు విమానం ఎక్కే లోపు ఇరాన్‌ నుంచి ఏదో ఒక స్పందనను రాబట్టాల్సిందిగా అమెరికా అధికారులు పాక్‌ సైన్యా ధ్యక్షుడు అశిం మునీర్‌ను కోరారు. అయినప్పటికీ ఫలితం శూన్యం.

అమెరికాకు లేని స్పష్టమైన సమాచారం
ఇరాన్‌ అగ్ర నాయకత్వంలో నెలకొన్న అభిప్రాయ బేధాల కారణం గానే అక్కడి నుంచి తమకు సమా ధానం రావడం లేదని అమెరికా అధికారులకు పాక్‌ మధ్యవర్తులు తెలియజేశారని సమాచారం. అసలు ఇరాన్‌ నూతన సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నారా, లేదా కింది స్థాయి వ్యక్తులు ఆయన కోరుకుంటున్న దేమిటో ఊహిం చుకొని ఆ ప్రకారం నడుచుకుంటు న్నారా అనేది కూడా అమెరికా నేతలకు తెలియడం లేదు. ఇలాంటి పరిస్థితుల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం గడువును ట్రంప్‌ మరోసారి పొడిగించారు. అయితే కాలపరిమితిని మాత్రం విధించలేదు. యురేనియం శుద్ధి, నిల్వ లపై ఇరాన్‌ ప్రభుత్వాధికారుల మధ్య తీవ్ర అభిప్రాయబేధాలు తలెత్తాయని, వారు నిట్టనిలువుగా చీలిపోయారని ట్రంప్‌ తన ట్రూత్‌ సోషల్‌లో రాసుకొచ్చారు.

గందరగోళ ప్రకటనలు
చర్చల విషయంలో అమెరికా నుంచి గందరగోళపర్చే ప్రకటనలు వస్తున్నాయి. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ నేతృత్వంలోని ప్రతినిధి బృందం చర్చల నిమిత్తం ఇస్లామాబాద్‌ బయలుదేరిందని ఒకసారి, పర్యటన వాయిదా పడిందని మరోసారి ప్రకటనలు వెలువడ్డాయి. కాల్పుల విరమణ ఒప్పందం గడువును పొడిగించే ప్రశ్నే లేదని, చర్చలకు ఇరాన్‌ రాకుంటే మున్నెన్నడూ లేని విధంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్‌ను ట్రంప్‌ సీఎన్‌బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో హెచ్చరించారు.

ఇరాన్‌ ఓకే అంటే.. వాన్స్‌ బృందం రెడీ
రెండో విడత చర్చలకు తాము హాజరు కావాలంటే హార్ముజ్‌ జలసంధి దిగ్బంధాన్ని అమెరికా ఎత్తివేయాలని ఇరాన్‌ పట్టుపట్టింది. అయితే ఇందుకు అమెరికా అంగీకరించ లేదు. తుది ఒప్పందం కుదిరే వరకూ జలసంధిని తెరవబోమని స్పష్టం చేసింది. చర్చలకు ఇరాన్‌ సుముఖత చూపితే వాన్స్‌ బృందం త్వరలోనే ఇస్లామాబాద్‌ వెళుతుందని అధికారులు చెప్పారు. జలసంధిని మూస ివేసినంత కాలం అమెరికా, ఇరాన్‌…రెండు దేశాలు నష్టపోతా యని కొందరు అధికారులు తెలిపారు. కాబట్టి త్వరగా ఓ పరిష్కారం సాధించాల్సిన అవసరం ఉన్నదని వారు అభిప్రాయపడ్డారు. చర్చలకు రావాల్సిం దిగా ఇరాన్‌కు నచ్చచెప్పిన పాక్‌ నేతలు…అదే సమయంలో కాల్పుల విరమణను పొడిగించాలని ట్రంప్‌ను కోరారు.

కాలయాపన కోసమే : ఇరాన్‌
కాల్పుల విరమణ ఒప్పందాన్ని కొనసాగించాలన్న ట్రంప్‌ నిర్ణయం ‘కాలయాపనకు జరిపిన కుట్ర’ అని ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ మహమ్మద్‌ బాఘర్‌ ఘలీబఫ్‌ వ్యాఖ్యానించారు. ఆకస్మిక దాడులు జరపడమే దీని ఉద్దేశమని విమర్శించారు. ఇరాన్‌ ఓడరేవుల దిగ్బంధనానికి, బాంబు దాడులకు మధ్య తేడా ఏమీ లేదని చెప్పారు. దీనికి సైనిక పరంగానే సమాధానం ఇస్తామని తెలిపారు. కాల్పుల విరమణకు అర్థమేలేదని అంటూ పరాజయం పొందుతున్న పక్షం నిబంధనలను ఎలా నిర్దేశిస్తుందని ప్రశ్నించారు.

టెహ్రాన్‌పై ఒత్తిడి పెంచుతూనే…
ఇరాన్‌ ఓడరేవుల దిగ్బంధం కొనసాగుతుందని, తమ సైన్యం సంసిద్ధంగా ఉన్నదని చెప్పడం ద్వారా టెహ్రాన్‌పై ఒత్తిడిని పెంచేందుకు ట్రంప్‌ ప్రయత్నిస్తున్నారు. కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపుపై ట్రంప్‌ ప్రకటన వెలువడడానికి కొన్ని గంటల ముందు ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో ఓ పోస్ట్‌ పెడుతూ తమ ఓడరేవులను దిగ్బంధించడం యుద్ధ చర్యేనని, అది కాల్పుల విరమణను ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం, సిబ్బందిని నిర్బంధించడం వంటి చర్యలు ఉద్రిక్తతలను పెంచుతాయని అంటూ తన ప్రయోజనాలను ఎలా కాపాడుకోవాలో, ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో ఇరాన్‌కు తెలుసునని అన్నారు.

నిరసనకారులను ఉరి తీయడం లేదు..ట్రంప్‌ తప్పుదోవ పట్టిస్తున్నారు : ఇరాన్‌
అరెస్ట్‌ చేసిన ఎనిమిది మంది మహిళా నిరసనకారులను ఇరాన్‌ ఉరి తీయబోతోందంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటనను టెహ్రాన్‌ న్యాయ వ్యవస్థ తోసిపుచ్చింది. ఈ ఏడాది జనవరిలో అరెస్ట్‌ చేసిన ఓ మహిళకు ఉరిశిక్ష విధించారని, మరో మహిళ ఉరిశిక్ష విధించదగిన ఆరోపణలు ఎదుర్కొంటోందని, ఆమెను కూడా ఉరి తీస్తారని కొన్ని హక్కుల గ్రూపులు చేస్తున్న వాదనలను కూడా ఖండించింది. తప్పుడు వార్త ద్వారా ట్రంప్‌ మరోసారి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఇరాన్‌ న్యాయ వ్యవస్థ అధికారిక వెబ్‌సైట్‌ విమర్శించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -