Thursday, April 23, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలురైతు కేంద్రంగా పోరాటాలు తీవ్రం చేస్తాం

రైతు కేంద్రంగా పోరాటాలు తీవ్రం చేస్తాం

- Advertisement -

మోడీ సర్కారు అన్నదాతలకిచ్చిన రాత పూర్వక హామీలు విస్మరణ
దొడ్డిదారిన నల్లచట్టాల అమలుకు యత్నం
వాటిని తిప్పికొట్టేందుకు దేశవ్యాప్తంగా ఉద్యమాలు
అందులో భాగంగానే ఆయా రాష్ట్రాల్లో రైతుల పాదయాత్రలు
మద్దతు ధర, కొనుగోలు గ్యారంటీ చట్టాలుండాల్సిందే
కౌలు రైతులను ఆదుకోవాలి..రుణ అర్హత కార్డులివ్వాలి
కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులకిచ్చిన హామీలను అమలు చేయాలి
నవతెలంగాణతో తెలంగాణ రైతు సంఘం
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌

‘వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరించడంలో భాగంగానే మూడు నల్ల చట్టాలను దొడ్డిదారిలో అమలు చేయాలని చూస్తోంది. ఢిల్లీ రైతాంగ పోరాట సందర్భంగా రైతులకు మోడీ సర్కారు ఇచ్చిన రాత పూర్వక హామీలను మోడీ సర్కారు పూర్తిగా విస్మరించింది. ఈ నేపథ్యంలోనే రైతు కేంద్రంగా దేశవ్యాప్తంగానూ పోరాటాలను తీవ్రతరం చేస్తాం’ అని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి టి.సాగర్‌ చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఈ నెల 23 నుంచి 25 వరకు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మూడో మహాసభ జరుగనున్న నేపథ్యంలో ఆయన నవతెలంగాణకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే…

ఎ.ప్రశాంత్‌

రాష్ట్ర మహాసభకు 31 జిల్లాల నుంచి మొత్తం 600 మంది ప్రతినిధులు హాజరుకాబోతున్నారు. అందులో 75 మహిళా ప్రతినిధులు ఉన్నారు. మహాసభలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగం, వ్యవసాయం పట్ల అనుసరిస్తున్న విధానాలపైనా, పలు అంశాలపైనా సమగ్రంగా చర్చిస్తాం. మూడేండ్లుగా సాగిన ఆందోళనా పోరాటాలు, ఉద్యమాలు, సాధించిన విజయాలు, బలహీనతలు, తదితరాలపై చర్చిస్తాం. రాబోయే మూడేండ్ల కాలానికి సంబంధించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తాం.

హామీలు బుట్టదాఖలు.. దొడ్డిదారిన చట్టాలు..
ఢిల్లీలో రైతాంగ పోరాటంతో కేంద్ర ప్రభుత్వం మోడీ సర్కారు అన్నదాతలకు క్షమాపణ చెప్పి మరీ మూడు నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నది. రాతపూర్వక హామీలు కూడా ఇచ్చింది. హామీకి తిలోదకాలిచ్చి విద్యుత్‌ ట్రాన్స్‌మిషన్‌లో కార్పొరేట్లకు అనుమతిచ్చింది. దీంతో ఏపీ, తెలంగాణలో రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్‌ పథకం ఎగిరిపోనున్నది. సామాన్య, పేద ప్రజలకు క్రాస్‌ సబ్సిడీలను ఎత్తేస్తారు. మొత్తం విద్యుత్‌ రంగాన్ని కార్పొరేట్లు కట్టబెట్టే కుట్ర ఇది. కేరళ మాదిరిగా రుణ విమోచన చట్టాన్ని తీసుకురావాలనే డిమాండ్‌ను కేంద్ర సర్కారు అటకెక్కిం చింది. ఎమ్‌.ఎస్‌.స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసుల మేరకు మద్దతు ధర, కొనుగోలు గ్యారంటీ చట్టాలను తెస్తామని చెప్పి ఐదేండ్ల వుతున్నా పట్టాలెక్కలేదు. వ్యవసాయ మార్కెట్‌ ముసాయిదా బిల్లును ఇంకో రూపంలో తీసుకొచ్చింది. రైతులకు వంద శాతం రుణాలిచ్చేది సహకార రంగ వ్యవస్థనే. అలాంటి దాన్ని నిర్వీర్యం చేసేం దుకు మల్టీ స్టేట్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీలు తీసుకొచ్చి దాని బాధ్యతను అమిత్‌షా ఎత్తుకున్నాడు. విత్తన బిల్లు ద్వారా విదేశీ, స్వదేశీ కార్పొరేట్‌ సంస్థలకు విత్తన రంగా న్ని కట్టబెడుతున్నది. అమెరికా, ఈయూ, బ్రిటన్‌లతో వాణిజ్య, వ్యవసాయ ఒప్పందా లు మన దేశ వ్యవసాయాన్ని బడా కార్పొ రేట్లకు కట్టబెట్టడంలో భాగమే. కేంద్రం నిర్ణయాల మీద 500 రైతు సంఘాలు ఎస్‌కేఎమ్‌(సంయుక్త కిసాన్‌ మోర్చా)గా ఏర్పడి పోరాటాలు చేస్తున్నాయి. ఐక్యకార్చాచరణ కొనసాగుతుంది.

బోనస్‌ ఇవ్వాల్సిందే..పంటలు కొనుగోలు చేయాల్సిందే..
రాష్ట్ర ప్రభుత్వం ఆరు పంటల(వరి, మొక్కజొన్న, పత్తి, కందులు, సోయా, జొన్నలు)కు బోనస్‌, నాలుగు పంటలకు (మిర్చి, పసుపు, చెరుకు, ఎర్రజొన్నలు) మద్దతు ధర ప్రకటిస్తామని హామీనిచ్చింది. కేవలం సన్న వడ్లకు మాత్రమే బోనస్‌ ఇస్తు న్నది. పంటల బీమా పథకం అమలు చేయ డంలేదు. పంటలు కోతకొచ్చే సమయం లోనే కొనుగోలు కేంద్రాలు పెట్టి కొనడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం కనిపిస్తున్నది. 15 రోజులు ఆలస్యంగా ప్రారంభించి 15 రోజుల ముందే బంద్‌ చేస్తున్నారు. దీని వల్ల 15 నుంచి 30 శాతం మంది రైతులు నష్ట పోతున్నారు. కనీసం మద్దతు ధర అమలు కాకపోవడం వల్ల ఏటా దాదాపు రూ.4 వేల కోట్లను అన్నదాతలు నష్టపోతున్నారు. తెలంగాణలో 22 లక్షల మంది పాడి పరిశ్రమపై రైతులు ఆధారపడి జీవిస్తు న్నారు. పాల రైతులకు లీటర్‌కు రూ.5 ఇన్సెంటీవ్‌ ఇస్తామని కాంగ్రెస్‌ సర్కారు హామీనిచ్చింది. అది పట్టాలెక్కలేదు. పైగా, రెండు, మూడు పెండింగ్‌ బిల్లులు ఉంటున్న దుస్థితి.

ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులు పూర్తిచేయాలి
ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తిచేయాలని ముందునుంచీ చెబుతూ వస్తున్నాం. ప్రభుత్వాలు మారినప్పుడల్లా కమీషన్లు, రాజకీయ ప్రచారం కోసం డిజైన్లు మార్చడం, కొత్తవాటిని తెరపైకి తేవడం, స్థలాలు మార్చడం కామన్‌గా మారింది. దీంతో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం చేకూర్చే చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులు విస్మరణకు గురవుతున్నాయి. అందుకే చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులపై రాష్ట్ర సర్కారు ఫోకస్‌ పెట్టాలి. రాబోయే కాలంలో వాటి మీదా ఆందోళనా పోరాటాలు కొనసాగు తాయి. అటవీ హక్కుల చట్టం ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లో ఇంకా 8.5 లక్షల మంది పోడు రైతులకు పట్టాలివ్వాలి. వారి హక్కుల కోసం పోరాడుతాం.

ప్రణాళికలు కరువు… ఆర్‌బీఐ నిబంధనలు బుట్టదాఖలు
గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా వ్యవ సాయ ప్రణాళిక ప్రింట్‌ చేసి ఇచ్చేవి. బీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం దాన్ని ఆపేసింది. కాంగ్రెస్‌ సర్కారు కూడా వార్షిక ప్రణాళికను ప్రకటిం చడంలేదు. మన రాష్ట్ర వాతావరణం అన్ని పంటలకూ అనుకూలం. ప్రణాళిక లేక పోవ డం పెద్దలోపం. దీంతో ఆకుకూరలు, కూర గాయలు, పండ్లు, చివరకు కొత్తిమీర కూడా దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి. ఎర్రనేలల్లో ఏ పంటలు పండుతాయి? నల్ల రేగడిలో ఏ పంటలు పండుతాయి? ఇసుక భూముల్లో ఏ పంటలు పండుతాయి? ఒక ప్రణాళిక లేకపో వడంతో రైతులు ఒకే పంటలు వేయడానికి అలవాటు పడ్డారు. దీని వల్ల మోనో క్రాఫ్‌ పెరిగిపోతున్నది. దీంతో భూముల సారం తగ్గిపో తున్నది. పంటల మార్పిడిపై రైతు లకు అవగాహన కల్పించాలి. మార్చి 31 నాటికి బ్యాంకుల్లో ఉండే డిపాజిట్ల మొత్తంలో అన్నదాతలకు 18 శాతం పంట రుణాలివ్వాలి. బ్యాంకర్లు దాన్ని అమలు చేయకున్నా పాలకులు పట్టించుకోవడం మానేశాయి. దీంతో అన్నదాతలు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకోవాల్సిన దుస్థితి.

కౌలు రైతులకు రుణ అర్హత కార్డులివ్వాలి
సాగు సాయం కింద కౌలు రైతులకు కూడా రూ.15 వేలు ఇస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో పొందుపర్చింది. తెలంగాణలో 22 లక్షల మంది కౌలు రైతులున్నారు. రెండున్నరేండ్లలో ఎవ్వరికీ ఇవ్వలేదు. 2011 కౌలు రైతుల చట్టం ప్రకారం రుణ అర్హత కార్డులిస్తామని హామీనిచ్చింది. కార్డులిస్తే కౌలు రైతులకు అప్పు దొరుకుతుంది. పంటలు అమ్మకునే అవకాశం లభిస్తుంది. పథకాలకు అర్హులవుతారు. కానీ, రెండున్నరేండ్లలో వాటిని ఇవ్వలేదు. రాష్ట్రంలో జరుగుతున్న ఆత్మహత్యల్లో సగానికిపైగా కౌలు రైతులవే. కాబట్టి రుణ అర్హత కార్డులను వెంటనే ఇవ్వాలి. చాలా మందికి ఇంకా రుణమాఫీ కాలేదు. రైతు భరోసా కూడా పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. ఇంకా రెండు సీజన్లకు సంబంధించి పెండింగ్‌లో ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -