Thursday, April 23, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుమోడీ ప్రభుత్వమే మహిళల్ని మోసం చేసింది

మోడీ ప్రభుత్వమే మహిళల్ని మోసం చేసింది

- Advertisement -

మహిళా రిజర్వేషన్ల బిల్లును డీ లిమిటేషన్‌కు ఎందుకు ముడి పెట్టారు
ప్రధాని వాస్తవాలు చెప్పాలి..ఆయనది నయవంచనే
దానిలో భాగంగానే రాజ్యాంగ సవరణ బిల్లు ఐక్యంగా తిప్పికొట్టి, దేశభక్తి చాటుకున్న ప్రతిపక్షాలు
దేశ ప్రజలకు మోడీ సర్కార్‌ క్షమాపణలు చెప్పాలి : ఎస్వీకే వెబినార్‌లో సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

మహిళా రిజర్వేషన్లు అమలు చేయడం ఇష్టంలేకే కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లుకు డీలిమిటేషన్‌ తో ముడిపెట్టి, రాజ్యాంగ సవరణకు ప్రయత్నించిం దని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. మోడీ సర్కార్‌ కుట్రను ముందే పసిగట్టిన ప్రతిపక్షాలు రాజ్యాంగ సవరణ ను అడ్డుకొని దేశభక్తిని చాటుకున్నాయని స్పష్టం చేశారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌కు దేశభక్తి లేదనే విషయం ఈ బిల్లుతోనే తేలిపోయిందని విమర్శిం చారు. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం (ఎస్వీకే) ఆధ్వర్యంలో ‘మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌ బిల్లు వంచనలు-వాస్తవాలు’ అంశంపై జరిగిన వెబినార్‌లో ఆయన ప్రధాన వక్తగా మాట్లాడారు. కేవలం రాజకీయ దురుద్దేశ్యం తోనే సంబంధంలేని అంశాలతో రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపాదించి, పార్లమెంటులో అది వీగిపోయాక, ఆ ఓటమిని భరించలేక ప్రధాని మోడీ ప్రతిపక్షాలపై శాపనార్థాలకు దిగుతూ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారని విమర్శించారు. ప్రతిపక్షాలు ఐక్యంగా రాజ్యాంగ సవరణను తిరస్కరించాయనీ, అదే సమయంలో మహిళా రిజర్వేషన్లకు పూర్తి అనుకూలమని స్పష్టంగా ప్రకటించాయని గుర్తుచేశారు. మోడీ ప్రభుత్వం ఈ బిల్లు ముసుగులో రాజకీయ దుర్భుద్ధిని ప్రదర్శిస్తూ, తనకు అనుకూలంగా డీలిమిటేషన్‌ (నియోజకవరా ్గల పునర్విభజన) చేసుకోవాలనే కుట్రలు దేశ ప్రజలకు స్పష్టంగా తెలిసిపోయా యన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లును డీ లిమిటేషన్‌కు ఎందుకు ముడి పెట్టాల్సి వచ్చిందో ప్రధాని మోడీ సభకు వివరణ ఇవ్వకుండా కేవలం విమర్శలకే పరిమితం అయ్యారని ఎద్దేవా చేశారు. జాతినుద్దేశించి మాట్లాడేటప్పుడు కనీసం భాషను కూడా అదుపులో ఉంచుకోకుండా ప్రతిపక్షాలను ఉద్దేశించి భ్రూణ హత్య, మహా పాపం అనే
పదాలతో విష పూరిత ఉపన్యా సం చేశారని అభ్యంతరం వ్యక్తంచేశారు. ముఖ్యమైన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే ముందు అన్ని రాజకీయపార్టీలతో సంప్రదింపులు జరిపి, ఏకాభిప్రాయం కోసం ప్రయత్నం చేయడం ఆనవాయితీ అనీ, అలాంటిదేం లేకుండా చివరి నిముషం వరకు సభలో ఏం పెడుతున్నారో కూడా తెలుపకుండా అంత రహస్యంగా ఎందుకు వ్యవహరించాల్సి వచ్చిందని ప్రశ్నించారు. అదే సమయంలో అనుకూల మీడియాకు మోడీ ప్రభుత్వం లీకులు ఇచ్చి, దానిపై చర్చోపచర్చలు నిర్వహించారన్నారు. అజెండాను అధికారికంగా ముందే సభలో పెడితే ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి వస్తుందనే భయంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని స్పష్టంచేశారు. అయినప్పటికీ ఈ అంశాలపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్‌, సీపీఐ(ఎం) సహా అన్ని రాజకీయపార్టీలు మోడీ సర్కార్‌కు లేఖలు రాసాయనీ, కానీ ఆయన వాటిని స్వీకరించలేదని తెలిపారు. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో ఈ బిల్లును ఎందుకు తేలేదో తొలుత స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. కేవలం మహిళా రిజర్వేషన్ల పేరుతో డీ లిమిటేషన్‌ తేవాలనే కుట్ర తప్ప, మరే ప్రజా ప్రయోజనం బీజేపీ ప్రభుత్వానికి లేదన్నారు. ప్రతిపక్షాలకు చిత్తశుద్ధి లేదంటూ ప్రధాని మోడీ మొదలు ఆర్‌ఎస్‌ఎస్‌ వరకు విమర్శలు చేస్తున్నారనీ, అసలు మహిళా రిజర్వేషన్ల బిల్లుకు, డీ లిమిటేషన్‌ను ఎందుకు లింక్‌ పెట్టాల్సి వచ్చిందో స్పష్టంచేయాలన్నారు.

2010లో మహిళా రిజర్వేషన్‌ బిల్లును కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిందనీ, అప్పుడు ఇదే బీజేపీ మహిళా రిజర్వేషన్లకు, డీ లిమిటేషన్‌ను ప్రస్తావించలేదన్నారు. 2014 నుంచి 2023 వరకు 11 ఏండ్లు అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్‌లో పెట్టకుండా కాలయాపన ఎందుకు చేసిందని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుపై 2017లో పార్లమెంటులోనే సీపీఐ(ఎం) సభ్యులు సీతారాం ఏచూరి ప్రస్తావించారనీ, ఆరోజు మోడీ సర్కార్‌ సమాధానం దాటవేసిందన్నారు. 2018లో కూడా ఎంపీ శ్రీమతి పార్లమెంటులో ఈ ప్రస్తావన తెస్తే, అప్పుడూ సమాధానం చెప్పలేదని గుర్తుచేశారు. 2019లో గతంకంటే ఎక్కువ సీట్లతో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ఎందుకు చట్టబద్ధత తేలేకపోయిందో దేశ ప్రజలకు వివరించాలన్నారు. 2024 ఎన్నికలకు ముందు 2023 సెప్టెంబర్‌లో పార్లమెంటులో బిల్లు పెట్టి, జనగణనకు లింక్‌ చేస్తూ రాజ్యాంగ సవరణ చేశారనీ, ఆనాడే ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయని తెలిపారు. కేవలం ఎన్నికలకు ముందు మహిళా రిజర్వేషన్లను ప్రచారం కోసం వాడుకోవాలనే దురుద్దేశ్యం తప్ప, అమల్లో చిత్తశుద్ధి ఎక్కడుందని నిలదీశారు. 2021లో నిర్వహించాల్సిన జనగనణను కోవిడ్‌ సాకుతో వాయిదా వేశారనీ, ఆ తర్వాతి ఏడాది ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. జనగణనను 2027కు వాయిదా వేసి, ఇప్పుడు మహిళా రిజర్వేషన్లు, డీ లిమిటేషన్‌ను 2011 జనగణనతో చేపడతామని ప్రకటించడం కచ్చితంగా రాజకీయ దురుద్దేశ్యమేనని స్పష్టంచేశారు. కొత్త జనగణన వస్తుంటే, పాత లెక్కలతో నియోజకవర్గాల పునర్విభజన చేయడం ఏంటని ప్రశ్నించారు. కేవలం రాజకీయ దుర్భుద్ధి, స్వార్థంతో మోడీ సర్కార్‌ చేసిన పనుల్ని ప్రతిపక్షాలు ఎందుకు బలపరచాలని అడిగారు. ప్రతిపక్షాలు దేశ ప్రజలు, మహిళల పక్షానే ఉన్నాయని తేల్చిచెప్పారు. డీ లిమిటేషన్‌ను కేవలం జనాభా ప్రాతిపదికనే చేపట్టడం సరైంది కాదన్నారు. దీనివల్ల ఉత్తర, దక్షిణ భారతాల మధ్య రాజకీయ అంతరం పెరుగుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయమైన కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాల్లో సీట్ల సంఖ్యను తగ్గించి ఎలా శిక్షిస్తారని ప్రశ్నించారు. దేశభక్తి లేని బీజేపీ రాష్ట్రాల మధ్య వైషమ్యాలు పెంచేలా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. ఈ సందర్భంగా గతంలో జరిగిన జనాభా లెక్కలు, డీ లిమిటేషన్‌ అంశాలను ఆయన ప్రస్తావించారు. మోడీ ప్రభుత్వం 2027 సెన్సెక్స్‌కు విలువలేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నదనీ, కొత్త జనగణన లెక్కలు వస్తే వాటి ప్రకారం దేశంలో అనేక రాజకీయ మార్పులు సంభవిస్తాయన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ చెప్పే అఖండ భారత్‌ అంటే హిందీ రాష్ట్రాలు మాత్రమే కాదని చెప్పారు. డీ లిమిటేషన్‌పై అంతర్జాతీయ అనుభవాలను పరిగణనలోకి తీసుకోవాలంటూ కొన్ని దేశాల్లో ఐక్యత కోసం చేపట్టిన విధానాలను ఆయన ప్రస్తావించారు. డీ లిమిటేషన్‌కు ఆదాయపన్నును పరిగణనలోకి తీసుకోవాలనే ప్రతిపాదన ఉందనీ, కానీ తక్కువ ఆదాయం ఉన్నవారికి ప్రభుత్వాలు ఎక్కువ రాజకీయ దన్ను ఇవ్వాలని తెలిపారు. దేశంలో ఓవర్గం జనాభా పెరగుతుందని ఆర్‌ఎస్‌ఎస్‌ ఆందోళన చేస్తూ, మరోవైపు అదే జనాభా నిష్పత్తి ప్రకారం డీ లిమిటేషన్‌ చేస్తామనడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. డీ లిమిటేషన్‌పై అఖిలపక్ష సమావేశం నిర్వహించి, విస్త్రుత చర్చలు జరపాలనీ, కొత్త జనగణన లెక్కలకు అనుకూలంగా మహిళా రిజర్వేషన్లను సవరించుకోవచ్చని సూచించారు. తప్పుడు మార్గంలో పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టినందరకు కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. వెబినార్‌కు ఎస్వీకే మేనేజింగ్‌ కమిటీ కార్యదర్శి ఎస్‌ వినయకుమార్‌ సమన్వయకర్తగా వ్యవహరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -