మహిళల సింగిల్స్ టైటిల్ సొంతం
ఫైనల్లో వరల్డ్ నం.1 సబలెంకాపై గెలుపు
యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్
యుఎస్ ఓపెన్‌కు కొత్త క్వీన్ వచ్చేసింది. ముచ్చటగా మూడో ఏడాది టైటిల్‌పై కన్నేసి బరిలోకి దిగిన వరల్డ్ నం.1, టాప్ సీడ్ అరినా సబలెంకా (బెలారస్)ను కజకిస్తాన్ స్టార్, వరల్డ్ నం.2, రెండో సీడ్ ఎలెనా రిబకినా మట్టికరిపించింది. మూడు సెట్ల పాటు ఉత్కంఠగా సాగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ సబలెంకా నుంచి టైటిల్‌తో పాటు వరల్డ్ నం.1 ర్యాంక్‌ను సైతం రిబకినా లాగేసుకుంది. ఫైనల్లో ఓటమితో 2013 తర్వాత తొలిసారి ఓ ఏడాదిని గ్రాండ్‌స్లామ్ టైటిల్ విజయం లేకుండా సబలెంకా ముగించనుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో సబలెంకాపై విజయంతో అదరగొట్టిన రిబకినా.. యుఎస్ ఓపెన్‌లోనూ అదే ప్రదర్శన పునరావృతం చేసింది.
న్యూయార్క్ (యుఎస్‌ఏ)
రెండు సార్లు డిఫెండింగ్ చాంపియన్, వరల్డ్ నం.1 అరినా సబలెంకా (బెలారస్)ను మూడు సెట్ల పోరులో ఓడించిన కజకిస్తాన్ స్టార్ వరల్డ్ నం.2 ఎలెనా రిబకినా యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ చాంపియన్‌గా అవతరించింది. 6-4, 5-7, 6-2తో సబలెంకాపై గెలుపొందిన రిబకినా.. యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో పాటు వరల్డ్ నం.1 ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. ఎలెనా రిబకినాకు ఇది కెరీర్ మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్ కాగా.. ఈ ఏడాదిలో రెండో గ్రాండ్‌స్లామ్ విజయం. 2013 నుంచి ప్రతి ఏడాది కనీసం ఓ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో దూసుకెళ్తున్న అరినా సబలెంకా 99 వారాల పాటు మహిళల సింగిల్స్ వరల్డ్ నం.1గా కొనసాగింది. ఈ ఏడాది గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో పాటు వరల్డ్ నం.1 ర్యాంక్‌ను చేజార్చుకుంది. సోమవారం విడుదల కానున్న కొత్త ర్యాంకింగ్స్‌లో యుఎస్ ఓపెన్ క్వీన్ ఎలెనా రిబకినా అగ్రస్థానంలో నిలువనుండగా, అరినా సబలెంకా రెండో స్థానానికి పడిపోనుంది. ఆరుసార్లు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత, రష్యా స్టార్ మరియా షరపోవా చేతుల మీదుగా ఎలెనా రిబకినా యుఎస్ ఓపెన్ టైటిల్‌ను అందుకుంది.
టాప్ సీడ్ల సూపర్ పోరు
మహిళల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్లు తలపడటం అరుదు. చివరగా యుఎస్ ఓపెన్‌లో 2013లో సెరెనా విలియమ్స్, విక్టోరియా అజరెంకాలు టాప్, రెండో సీడ్‌గా టైటిల్ ఫైట్ చేశారు. ఆ తర్వాత ఈ ఏడాది సబలెంకా, రిబకినా టాప్-2 సీడ్లుగా బరిలోకి ఫైనల్లో ఢీకొట్టారు. జనవరిలో ఆస్ర్టేలియా ఓపెన్ ఫైనల్లో సబలెంకాను ఓడించిన ఉత్సాహంలో రిబకినా ఉండగా.. డబ్ల్యూటీఏ టూర్‌లో రెండు ఫైనల్స్‌లో రిబకినాను చిత్తు చేసిన ఆత్మవిశ్వాసంతో సబలెంకా బరిలోకి దిగింది. తొలి సెట్లో ఇద్దరూ బేస్‌లైన్ గేమ్‌తో అదరగొట్టారు. నెట్ దగ్గర, ర్యాలీలు, పవర్‌ఫుల్ షాట్లతో నువ్వా నేనా అన్నట్టు పోటీపడ్డారు. సబలెంకా సర్వ్‌ను బ్రేక్ చేసిన రిబకినా 3-2తో ముందంజ వేసింది. వెనుకంజ వేసిన సబలెంకా వరుసగా పాయింట్లు, గేమ్‌లతో పాటు సహనం కోల్పోయింది. 6-4తో తొలి సెట్‌ను గెల్చుకున్న రిబకినా.. మానసికంగానూ సబలెంకాపై పైచేయి సాధించింది. కానీ రెండో సెట్లో సబలెంకా పుంజుకుంది. సబలెంకా ఆటతీరు మెరుగైనా, మానసికంగా ఆమె కాస్త అసహంగానే కనిపించింది. మూడు బ్రేక్ పాయింట్లు నిలుపుకున్న సబలెంకా 5-5తో స్కోరు సమం చేసుకుంది.
ఆ తర్వాత వరుసగా రెండు గేములు గెలుపొంది 7-5తో రెండో సెట్‌ను ఖాతాలో వేసుకుంది. దీంతో విజేతను తేల్చేందుకు నిర్ణయాత్మక మూడో సెట్ అనివార్యమైంది. ఆఖరు సెట్లో మల్లీ రిబకినా ఊపందుకుంది. సబలెంకా సర్వ్‌ను ఆరంభంలోనే బ్రేక్ చేసింది. 2-1తో ముందంజ వేసింది. అదే జోరులో వరుస గేములు గెల్చుకుని 6-2తో మూడో సెట్‌తో పాటు యుఎస్ ఓపెన్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. టైటిల్ పోరులో ఎలెనా రిబకినా 12 ఏస్‌లు సంధించి, మూడు బ్రేక్ పాయింట్లు సాధించింది. సబలెంకా ఆరు ఏస్‌లతో ఓ బ్రేక్ పాయింట్‌తోనే సరిపెట్టుకుంది. రిబకినా 36 విన్నర్లు కొట్టగా, సబలెంకా 32 విన్నర్లు కొట్టింది. పాయింట్ల పరంగా 103-90తో రిబకినా పైచేయి సాధించింది. రిబకినా 24 అనవసర తప్పిదాలు చేయగా, సబలెంకా 35 అనవసర తప్పిదాలతో భారీ మూల్యం చెల్లించుకుంది.



