అంతరిక్ష మౌలిక వసతుల్లో రెండో స్థానం
టాప్-10లో భారత్‌కు చోటు
బీజింగ్ : అంతరిక్ష రంగంలో వేగంగా దూసుకెళ్తున్న చైనా మరో కీలక ఘనత సాధించింది. ప్రపంచ అంతరిక్ష మౌలిక వసతుల నిర్మాణంలో రెండో స్థానంలో నిలిచింది. తాజా అంతర్జాతీయ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. అమెరికా అగ్రస్థానంలో ఉండగా, జపాన్, రష్యా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, భారత్, ఇటలీ, నెదర్లాండ్స్ తదుపరి స్థానాల్లో నిలిచాయి. భవిష్యత్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థతో అంతరిక్ష మౌలిక వసతులు మరింతగా మమేకం కానుండటంతో.. రాబోయే దశాబ్దంలో ఈ రంగం ప్రపంచ భౌగోళిక-రాజకీయ, సాంకేతిక పోటీకి ప్రధాన వేదికగా మారనుందని నివేదిక పేర్కొంది.బీజింగ్‌లో జరిగిన 2026 చైనా అంతర్జాతీయ సేవల వాణిజ్య ప్రదర్శన సందర్భంగా 2026 గ్లోబల్ స్పేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెస్మెంట్ః నివేదికను విడుదల చేశారు. అంతరిక్షంలోని వివిధ ప్రాంతాల మధ్య అనుసం ధానానికి అవసరమైన మౌలిక వసతుల ఆధారంగా ప్రపంచంలోని 48 ఆర్థిక వ్యవస్థలను ఈ నివేదిక అంచనా వేసింది. అంతరిక్ష మౌలిక వసతుల అంచనాలో హార్డ్‌వేర్‌తోపాటు సాఫ్ట్వేర్ అంశాలనూ పరిగణనలోకి తీసుకున్నారు. జీవన సహాయక వ్యవస్థలు, ప్రయోగ-రవాణా వ్యవస్థలు, సమాచార వ్యవస్థలు, ఇంధన వనరులు, చట్టాలు, నిబంధనల ు, వివాదాల పరిష్కార యంత్రాంగాలు వంటి కీలక అంశాలను పరిశీలించారు.
హార్డ్ పవర్లో అమెరికా-చైనా ఆధిపత్యం
అంతరిక్ష రంగానికి సంబంధించిన సాంకేతిక, భౌతిక సామర్థ్యాల పరంగా అమెరికా, చైనా ముందంజలో ఉన్నాయని నివేదిక వెల్లడించ ింది. రష్యా, జపాన్, బ్రిటన్, భారత్ కూడా ఈ రంగంలో పోటీతత్వ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని పేర్కొంది. అంతరిక్ష రంగంలోని చట్టాలు, విధానా లు, అంతర్జాతీయ సహకారం, నియంత్రణ వ్యవస్థ లు వంటి సాఫ్ట్ పవర్ అంశాల్లో ఫ్రాన్స్, అమెరికా, చైనా, రష్యా, ఇటలీ అగ్రస్థానాల్లో ఉన్నాయి.
2035 వరకు చంద్రుడి పరిసరాలపైనే దృష్టి
2035 వరకు మానవ అంతరిక్ష కార్యకలాపాలు ప్రధానంగా భూమి-చంద్రుడి మధ్య, చంద్రుడి పరిసర ప్రాంతంలోనే కేంద్రీకృ తమై ఉంటాయని నివేదిక అంచనా వేసింది. దీనిని సిస్లూనార్ స్పేస్ అని పిలుస్తారు. 2040 తర్వాత భూమి నుంచి అంగారక గ్రహం వరకు ఉన్న అంతరిక్ష ప్రాంత అభివృద్ధి సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ, సమీప భవిష్యత్తులో గ్రహాల మధ్య అంతరిక్షాన్ని భారీ స్థాయిలో వినియోగించడం సాధ్యం కాదని నివేదిక స్పష్టం చేసింది. బాహ్య అంతరిక్షం భవిష్యత్తులో భౌగోళిక రాజకీయాలు, అత్యాధునిక సాంకేతికతల మధ్య పోటీకి కొత్త వేదికగా మారనుందని పేర్కొంది.
వచ్చే పదేండ్లలో మరింత తీవ్ర పోటీ
బీజింగ్ అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్ అసోసియేట్ రీసెర్చ్ ఫెలో వాంగ్ పెంగ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం అంతరిక్ష పరిశ్రమ భారీ స్థాయిలో ఉపగ్రహ సమూహాలను ఏర్పాటు చేసే ప్రారంభ దశలోనే ఉందన్నారు. అయితే రాబోయే పదేండ్లలో ఈ రంగంలో పోటీ మరింత తీవ్రంగా మారుతుందని చెప్పారు. భూమి-చంద్రుడి పరిసర అంతరిక్షం ప్రపంచ దేశాల మధ్య ప్రధాన పోటీ వేదికగా మారే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు వ్యక్తిగత సాంకేతికతల మధ్య సాగుతున్న పోటీ క్రమంగా పూర్తి అంతరిక్ష వ్యవస్థలు, సాంకేతిక పర్యావరణ వ్యవస్థలు, అంతరిక్ష నిబంధనలను నిర్ణయించే సామర్థ్యం కోసం జరిగే పోటీగా మారుతుందని వివరించారు. అగ్రగామి దేశాలు ఈ రంగంలో ఆధిపత్యాన్ని కొనసాగించే అవకాశం ఉన్నప్పటికీ.. ఇతర దేశాలు ప్రత్యేక అంతరిక్ష రంగాల్లో తమదైన మార్గాలను అభివృద్ధి చేసుకునే అవకాశాలు ఉంటాయని వాంగ్ పెంగ్ తెలిపారు.
చైనాకు పలు రంగాల్లో ఆధిక్యం
మానవ సహిత అంతరిక్ష యాత్రలు, తక్కువ భూమి కక్ష్యలో వ్యోమగాములు దీర్ఘకాలం ఉండే సామర్థ్యం, సమగ్ర ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థ, భూ పరిశీలన వ్యవస్థలు, భారీ అంతరిక్ష కార్యక్రమాలను అమలు చేసే సంస్థాగత సామర్థ్యం వంటి రంగాల్లో చైనాకు పోటీతత్వ ప్రయోజనం ఉందని పరిశ్రమ నిపుణులు వివరించారు. ఈ సాంకేతికత భవిష్యత్తులో తక్కువ వ్యయంతో వాణిజ్యపరమైన అంతరిక్ష ప్రయోగాలకు మార్గం సుగమం చేయనుంది.
డిజిటల్ ఆర్థిక వ్యవస్థతో మమేకం
అంతరిక్ష మౌలిక వసతుల అభివృద్ధి భూమిపై ఉన్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థతో మరింతగా మమేకం కానుందని వాంగ్ పెంగ్ తెలిపారు. తదుపరి తరం సమాచార సాంకేతికతతో అంతరిక్ష వ్యవస్థలు సన్నిహితంగా అనుసంధానమవుతాయని చెప్పారు. భవిష్యత్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు అంతరిక్ష మౌలిక వసతులు కీలక వ్యూహాత్మక పునాదిగా మారడంతోపాటు, సుదూర అంతరిక్ష అన్వేషణను వ్యవస్థీకృతంగా అభివృద్ధి చేసేందుకు కూడా బాటలు వేస్తాయని ఆయన వివరించారు. ఈ నివేదికను పెకింగ్ యూనివర్సిటీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ కోఆపరేషన్ అండ్ అండర్స్టాండింగ్, జెజియాంగ్ ఇంటర్నేషనల్ స్టడీస్ యూనివర్సిటీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ ఇంటర్నేషనలైజేషన్ స్టడీస్, సింగువా యూనివర్సిటీకి చెందిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ అండ్ గవర్నెన్స్, ది చైనీస్ యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్-షెన్జెన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీతోపాటు ఇతర సంస్థలు సంయుక్తంగా విడుదల చేశాయి. అంతరిక్షంలో అమెరికా ఆధిపత్యానికి సవాల్ విసురుతూ, మౌలిక వసతుల నిర్మాణం నుంచి ఉపగ్రహ వ్యవస్థలు, మానవ సహిత అంతరిక్ష కార్యక్రమాల వరకు చైనా వేగంగా విస్తరిస్తుండటం భవిష్యత్ అంతరిక్ష పోటీకి కొత్త దిశను సూచిస్తోందని నిపుణులు చెప్తున్నారు.



